నమ్మకమే నడిపిస్తుంది!

అప్పటివరకూ నేల మీద పాకుతాడు పసిబిడ్డడు.  నడవగలననే నమ్మకం ఆ బిడ్డను తొలిఅడుగు వేసేటట్టు చేస్తుంది. నమ్మకంతో వేసిన ఆ తొలి అడుగే అతడి సర్వతోముఖాభివృద్ధికి కారణమవుతుంది. స్వప్నసాకారానికి పూర్వ రూపం నమ్మకం. సహజంగానో, సిద్ధంగానో మనిషిలో ఉండే చైతన్య స్వరూపమే నమ్మకం.

Published : 04 Mar 2024 01:18 IST

అప్పటివరకూ నేల మీద పాకుతాడు పసిబిడ్డడు.  నడవగలననే నమ్మకం ఆ బిడ్డను తొలిఅడుగు వేసేటట్టు చేస్తుంది. నమ్మకంతో వేసిన ఆ తొలి అడుగే అతడి సర్వతోముఖాభివృద్ధికి కారణమవుతుంది. స్వప్నసాకారానికి పూర్వ రూపం నమ్మకం. సహజంగానో, సిద్ధంగానో మనిషిలో ఉండే చైతన్య స్వరూపమే నమ్మకం. చేతన ప్రక్రియ లాంటి అటువంటి నమ్మకం  కార్యసాధనకు అంకురారోపణ లాంటిది.

తన మీద  తనకున్న నమ్మకం బుద్ధ భగవానుణ్ని విశ్వవిఖ్యాతుడిని చేసింది. అతడు దుఃఖానికి కారణం తెలుసుకోవాలని రాజప్రాసాదాన్ని వదిలిపెట్టాడు. వేలాది మైళ్లు తిరిగాడు. ఎందరో యోగుల్ని మునీశ్వరుల్ని సంప్రదించాడు. ఫలితం దక్కలేదు. అయినా నమ్మకం ఏ మాత్రం సడలలేదు. స్వయం సహాయమే అత్యుత్త మమైందని భావించాడు. ఏకాగ్రతతో ధ్యానం చేసి దుఃఖ హేతువును కనుగొన్నాడు. జ్ఞానోదయం సాధించి మానవాళికి మార్గదర్శిగా నిలిచాడు.

‘కెరటం నాకు ఆదర్శం. లేచి పడినందుకు కాదు. పడి మళ్ళీ లేస్తున్నందుకు’ అన్న వివేకానందుడి మాటలు నమ్మకానికి పెట్టుబడిలాంటివి. నీ మీద నీకున్న నమ్మకమే నీకు వెయ్యి ఏనుగుల బలమని మరచిపోకూడదు. బండశిల ఊరికే శిల్పం కాదు. అది శిల్పి నమ్మకానికి ప్రతిరూపం. లోకంలో ఏదీ తనంతట తాను వచ్చి చేరదు.  ఒకింత ప్రయత్నం, మరికొంత  నమ్మకం అవసరం. కార్యసాధనలో ఎప్పుడూ ఆటంకాలు ఉంటాయి. తడబడినా తట్టుకుని నిలబడాలి. తప్పటడుగు వేసినా  సరిదిద్దుకోవాలి.  మళ్ళీ లేవగలననే చిగురంత నమ్మకం వల్ల విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.

పదిశాతం ప్రేరణ, తొంభై శాతం పరిశ్రమ అని నానుడి. ప్రేరణలో నమ్మకమూ పరిశ్రమలో మేధస్సు అంతర్భూతమై ఉంటాయి. ప్రపంచంలో చాలామంది శాస్త్రజ్ఞులు మొదటి ప్రయత్నంలో విఫలమైనవారే. మలి ప్రయత్నంలో నమ్మకం వారందరినీ విశ్వవిజేతల్ని చేసింది. హెలెన్‌ కెల్లర్‌ అంధురాలు. ‘త్రీ డేస్‌ టు సీ’ వంటి అద్భుతమైన కథలు సృష్టించింది. థామస్‌ ఆల్వా ఎడిసన్‌కు పాక్షికంగా చెవిటితనం ఉంది. ఎలెక్ట్రిక్‌ బల్బు మొదలుకొని చాలా వాటిమీద ఆయనకు ఆవిష్కరణ హక్కులున్నాయి.  నమ్మకమే విజయ రహస్యం అనడానికి ఇటువంటి స్ఫూర్తి చంద్రికలు చాలా ఉన్నాయి. సోమరులు సాకులు వెదుకుతారు. సాధకులు పరిష్కార మార్గాలు వెదుకుతారు!

విజయం సాధించడానికి శత్రువులు, పోటీదారులు తప్పనిసరిగా అవసరం అంటాడు చార్లీ చాప్లిన్‌. నమ్మకానికి అధైర్యం మొదటి శత్రువు. విజయసాధనలో అధైర్యం కూడదు. నమ్మకాన్ని కోల్పోకూడదు. భయాన్ని బంధిస్తే  ధైర్యానికి దారి దొరుకుతుంది.

గొప్ప కార్యాలు సాధించడానికి సమయం పడుతుంది. ఒక్కసారి నమ్మకం సడలిందంటే భయం ఆవరిస్తుంది. ఆ భయం మన లక్ష్యాన్ని  మింగేస్తుంది. మన మీద మనకు నమ్మకం ఉంటే  ఎంతటి గొప్ప కార్యాన్నైనా సాధించవచ్చు. నమ్మకం చుట్టూ అచంచలమైన ధైర్యం ఉండాలి. సాగరమంత సహనం అవసరం. లక్ష్యసాధనకు తొలిమెట్టూ చివరి మెట్టూ నమ్మకమే అని ఎప్పుడూ మరిచిపోకూడదు.

డాక్టర్‌ బండి సత్యనారాయణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని