అసలు కథ

‘మరణం సంభవించే క్షణం’ అనే విషయమై చాలా ఏళ్ల క్రితం ఓంటారియో శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు చేసింది. గమనించిన అంశాలను వారు మాంట్రియల్‌ గెజిట్‌లో ప్రకటించారు. గుండె కవాటాల మార్పిడిలో అత్యంత నిపుణుడిగా పేరొందిన డాక్టర్‌ విల్‌ఫ్రెడ్‌ జి.బ్రెజిలో వాటిని సోదాహరణంగా వివరించారు.

Published : 05 Mar 2024 01:02 IST

‘మరణం సంభవించే క్షణం’ అనే విషయమై చాలా ఏళ్ల క్రితం ఓంటారియో శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు చేసింది. గమనించిన అంశాలను వారు మాంట్రియల్‌ గెజిట్‌లో ప్రకటించారు. గుండె కవాటాల మార్పిడిలో అత్యంత నిపుణుడిగా పేరొందిన డాక్టర్‌ విల్‌ఫ్రెడ్‌ జి.బ్రెజిలో వాటిని సోదాహరణంగా వివరించారు. ‘మనిషి జీవనస్థితి నుంచి మరణ స్థితికి మారే క్షణాలను నేను ఎన్నో సందర్భాల్లో ప్రత్యక్షంగా గమనించాను. ఆ సమయంలో ఎన్నో విచిత్రమైన మార్పులు సంభవిస్తాయి. మనం స్పష్టంగా గమనించగల ఒక పరిణామం- కళ్లలోంచి జీవకళ మాయం అవుతుంది. కళ్లు అక్షరాలా తెల్లగా నిర్జీవంగా మారిపోతాయి’ అన్నారాయన. ఈ వివరాలన్నింటినీ- ఇస్కాన్‌ వ్యవస్థాపకులు ఎ.సి.భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, తమ ‘ఆత్మసాక్షాత్కార శాస్త్రం’ అనే గ్రంథంలో ప్రస్తావించారు.

తమకు జన్మించిన పసికందును పురిటి వాసనలతో వదిలేసి మేనక, విశ్వామిత్రుడు ఎవరి దారిన వారు వెళ్ళిపోయిన కథ మనకు తెలిసిందే. నెత్తురోడుతున్న ఆ పసిగుడ్డును పక్షులు రక్షించాయి. శకుంతాలంటే పక్షులు. శకుంతాలు కాపాడిన బిడ్డ కాబట్టి ఆమెకు కణ్వమహర్షి ‘శకుంతల’ అని పేరు పెట్టారు. భారతంలోని ‘శకుంతలోపాఖ్యానం’, కాళిదాసు ‘అభిజ్ఞాన శాకున్తలమ్‌’ కథల్లో ఒక రహస్యం ఏమంటే- పసికందు దగ్గర పక్షులు కాచుకున్నది కాపాడటం కోసం కాదు, కబళించడం కోసం. పసిబిడ్డ చారెడు, పక్షుల రెక్కలు బారెడు. కాబట్టి గొడుగు పట్టినట్లు అయింది. నీడ దొరికింది. వాస్తవానికి పసిప్రాణాలు కాస్తా గుటుక్కుమంటే- ఆ మాంసం ముద్దను పీక్కుతిందామని పక్షులు వేచి చూశాయి. ఈ లోగా కణ్వమహర్షి వచ్చి ఆమెను కాపాడాడు. దాంతో కావ్యగత ధోరణి అద్భుత మానవీయ విలువల దిశగా సాగిపోయింది.

పరిమితమైన దయార్ద్ర హృదయాన్ని మానవత్వం అనుకొంటే, అపరిమితమైనదాన్ని మాధవత్వంగా చెప్పుకోవాలి. మహర్షులు మాధవ జాతి మహనీయులు. కణ్వమహర్షి ఆ కోవకు చెందినవారు. ‘కామంతో కళ్లు మూసుకుపోయిన ఏ కాముకురాలో కిరాతకంగా కని పారేసింది’ అని జనం చీదరించుకొనే దుస్థితి- ఆ నెత్తురు గడ్డది. సకల మాలిన్యాలతోను బిడ్డను చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొన్న మహనీయుడు- ఆ మహర్షి. బండబారిన మనిషి గుండెను కాసింత చెమర్చేలా మానవీయ విలువలకు చెందిన విత్తులను కాసిని దానిలో మొలకెత్తేలా చేయడం- ప్రాచీన కావ్యాల పరమలక్ష్యం. పనిలో పనిగా పక్షుల కారుణ్యాన్ని పరిచయం చేయడం కోసం- అవి రెక్కలు విప్పి ఎండ తగలకుండా కాపాడాయని కవులు వర్ణించారు. బిడ్డ ప్రాణాలతో నిలిచి ఉండటానికి అదే కారణమని చెప్పారు.

ఇది అద్భుతమైన ప్రతిపాదన. అందులో సందేహం లేదు. అయితే సత్యం ఏమంటే- పక్షులు పసికందుపై దాడి చేయాలంటే, ముందు కనుగుడ్ల కదలిక ఆగిపోవాలి. వాటిలో జీవకళ అంతరించిపోవాలి. ప్రేతకళ ఆవరించాలి. కేవలం దాని కోసమే పక్షులు అంతసేపు కాచుకొన్నాయి. కదులుతున్నంతసేపు ఆ బిడ్డ జోలికి పోలేక ఆగిపోయాయి. భక్షించాలని వచ్చి తమకు తెలియకుండానే బిడ్డను రక్షించాయి. ఈ కథలో ఆధ్యాత్మికపరమైన అసలు రహస్యం ఏమంటే- ఆ బిడ్డకు ఇంకా ఈ లోకంలో నూకలున్నాయి. బతికే యోగం ఉంది. కాబట్టే మృత్యువు నీడే స్వయంగా ఆమెకు గొడుగు పట్టింది. ప్రాణాలు నిలబెట్టింది!

ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని