మనో నియంత్రణ

మానవుడి దేహంలోని అన్ని ఇంద్రియాలూ పనిచేయడానికి మూలం మనసేనని రామాయణం చెబుతోంది. మనసే అన్నింటికీ మూలమని అందరూ అంగీకరించే సత్యం. మనసు ప్రేరేపించకుండా ఏ మనిషీ ఏ పనీ చేయలేడు.

Published : 06 Mar 2024 01:41 IST

మానవుడి దేహంలోని అన్ని ఇంద్రియాలూ పనిచేయడానికి మూలం మనసేనని రామాయణం చెబుతోంది. మనసే అన్నింటికీ మూలమని అందరూ అంగీకరించే సత్యం. మనసు ప్రేరేపించకుండా ఏ మనిషీ ఏ పనీ చేయలేడు. మనసులో నిరంతరం అనుకూల భావాలు, వ్యతిరేక భావాలు పుడుతుంటాయి. అందుకే మానసిక తత్వవేత్తలు మనసు సంకల్ప, వికల్పాత్మకమని నిర్వచించారు. అనుకూల, వ్యతిరేక భావాలు నిరంతరం పుడుతుంటే మనిషి చేయవలసిందేమిటి అంటే- తన విచక్షణా జ్ఞానంతో మనసును వ్యతిరేక భావాల నుంచి మరలించి, అనుకూల భావాల వైపు నడిపించాలి. ఇదే మనిషిలోని విజ్ఞతకు పరీక్ష. లోకంలో మనిషికి అడుగడుగునా పూలబాటలు ఉండవు. ముళ్లదారులు కూడా ఉంటాయి. ఆటంకాలు, ఆందోళనలు చుట్టుముట్టి మనిషికి అవరోధాలు కలిగిస్తాయి. అలాంటి స్థితిలో మనిషి తన మనసును పెడదారులు పట్టకుండా చూసుకోవాలి. చీకట్లు అలముకొన్న రాత్రి నుంచే వేకువజాములో వెలుగులు పుడతాయనే సంగతి మరవరాదు. కష్టాల కడలిలో ప్రయాణిస్తున్నప్పుడు యుక్తిగా ఆ అగాథ జలనిధి నుంచి ఒడ్డుకు చేరే ఉపాయాన్ని ఆలోచించాలి. దీనమైన మనసులో ధైర్య రసాయనాన్ని నింపాలి. దానికి మనోనియంత్రణ ఎంతో అవసరం.

కష్టాల్లోనే కాదు- సుఖాల్లోనూ మనసు పెడదారి పడుతుంది. కష్టాల నుంచి గట్టెక్కలేమని భావించినప్పుడు ఆత్మహత్యే శరణ్యం అనిపిస్తుంది. ఇలాంటి ఆలోచన మానవులకే కాదు దైవాంశ సంభూతులైన అవతార పురుషులకు కూడా కలుగుతుందనడానికి రామాయణమే ఉదాహరణ. సీతామాత జాడను కనుగొనేందుకు లంకకు వెళ్ళిన హనుమంతుడు, అక్కడ ఎంతకూ సీతమ్మ కనిపించకపోయేసరికి- నిరాశతో తాను సీతాన్వేషణలో విఫలమై తిరిగి వెళ్లేకంటే ఆత్మహత్యకు పాల్పడటమే మేలని అనుకొంటాడు. కానీ తన తొందరపాటు వల్ల తన స్వామికి అనర్థం జరుగుతుందని, మనసును కుదుటపరచుకొని, ఎన్ని కష్టాలెదురైనా సీతమ్మ జాడను కనుగొని తీరుతానని ధైర్యంగా పలకడం మనో నియంత్రణకు సంకేతం.

నిరాశా నిస్పృహలు మానవమాత్రులకే కాదు, దేవతలకు కూడా కలుగుతాయి. లోకకంటకులైన రాక్షసుల వల్ల ఇంద్రాది దేవతలకూ ఆపదలు తప్పలేదు. అలాంటి సందర్భాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలకు మనోధైర్యం చెప్పి, అనుకూల కాలం వచ్చేదాకా వేచి ఉండాలని చెప్పిన సంఘటనలు మనో నియంత్రణకు మార్గాలుగా కనిపిస్తాయి.

సృష్టిలో ఏ జీవి, మరో జీవికి పుట్టుకతోనే మిత్రుడూ కాదు, శత్రువూ కాదు. సందర్భాలను బట్టి మిత్ర, శత్రు భావాలు కలుగుతుంటాయి. అవేమీ శాశ్వతంగా ఉండేవి కావు.  పరిస్థితుల ప్రాబల్యంతో వస్తూ పోతూ ఉంటాయి. కనుక అవన్నీ క్షణికాలనే భావన మనిషికి నిరంతరం దృఢంగా ఉండాలి. నిన్నటిదాకా శత్రువు అయినవాడు, నేడు మిత్రుడు కావచ్చు. కాలం ఒకేవిధంగా ఉండదు. ఎప్పుడూ వసంతాలే ఉండవు, శిశిరాలే ఉండవు. కాలానుగుణంగా మార్పులు రావడం సంభవమే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు మనిషిని ప్రబలంగా ప్రభావితం చేస్తాయి. మనిషి ఈ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏది మానవధర్మం, ఏది కాదు అని మనసుతో ఆలోచించాలి. ధర్మబద్ధమైన తీరులో మనసును కట్టడి చేయాలి. మనసు అనే గుర్రం పరుగులు తీస్తున్నా, విచక్షణ అనే పగ్గంతో దాన్ని అదుపుచేయాలి. దారీ తెన్నూ లేకుండా పరుగులు తీస్తే పతనం తప్పదు. పతనం అంచుల్లోకి జారకముందే పగ్గాలు వేసి అదుపు చేస్తే అపాయాన్ని దాటవచ్చు. తెలిసి తెలిసి అపాయాన్ని కోరుకుంటే జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది.  

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు