వనితా వందనం

సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. కానీ పురుషులు తామే అధికులమని అహంకరిస్తారు. నిజానికి ఆమెలేని అతడి జీవితం అర్థరహితం. మగవారి జీవితంలో మగువ మధురభావన. మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపి వెలుగునిస్తుంది. అతడి వెనక ఆమె నిలబడి తగు సలహాలను ఇచ్చి విజయపథంలో నడిపిస్తుంది.

Published : 07 Mar 2024 00:11 IST

సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. కానీ పురుషులు తామే అధికులమని అహంకరిస్తారు. నిజానికి ఆమెలేని అతడి జీవితం అర్థరహితం. మగవారి జీవితంలో మగువ మధురభావన. మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపి వెలుగునిస్తుంది. అతడి వెనక ఆమె నిలబడి తగు సలహాలను ఇచ్చి విజయపథంలో నడిపిస్తుంది. ఆమె మార్గదర్శిగా ఉండి బతుకును ఇంపుగా సరిదిద్దుతుంది. ప్రపంచంలో మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని సమున్నత స్థానాన్ని మనదేశం ఇచ్చింది. ప్రకృతి వనరులు, దేశం, పశుపక్ష్యాదులు, పరిసరాలు... ఇలా అన్నింటినీ స్త్రీ మూర్తిగా గౌరవించి నమస్కరించే సంస్కారం మనదేశంలోనే ఉంది. గంగానదిని గంగామాత అని, దేశాన్ని దేశమాత అని, భూమిని భూమాత అంటూ... తల్లిగా, స్త్రీ మూర్తిగా గౌరవించే సంస్కారం భారతీయసంస్కృతికి ప్రత్యేకం.

వేద కాలంనాటి నుంచి మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు. ఇంటి పెత్తనం నుంచి ఇంటిల్లపాదికీ ఆధారం ఆమే. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఆడవారే. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఆడవారే. పరిచయం లేని మహిళ ఎదురై ఆమెతో మాట్లాడవలసిన సందర్భం వస్తే ‘అమ్మా’ అంటూ సంబోధించే ఉత్తమగుణం కేవలం మనదేశంలోనే ఉంది.

కొన్ని మూఢనమ్మకాలు, స్వార్థపరుల ఆలోచనలు, చాదస్తాలు వారి స్థానాన్ని కొన్నాళ్లపాటు కిందికి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. వివిధ రంగాల్లో కానరాని సంకెళ్లలో చిక్కుకునేటట్టు చేశారు. ఆమెను అబల అన్నారు. అనేకమైన దురాచారాలకు బలి చేశారు. ఫలితంగా కొన్నాళ్లు వంటింటికే పరిమితం అయిపోయారు. కానీ నేడు ఆంక్షల సంకెళ్లు తెంచుకొని, ఆత్మస్థైర్యం నిండిన హృదయంతో ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. క్రమంగా ఇది, అది అని కాకుండా ఆడవారు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు.

వేదవేత్తలు మంత్రదర్శినులు అయిన మహిళలు చాలామంది ఉన్నారు. గార్గి, గోధఘోష, విశ్వపార, వేష, మాతృకర్షక, బ్రహిజాయ, రోమక, జుహు, నామ, అగస్త్య, నృపాదితి, శశ్వతి మొదలైన వారెందరో... ఖేలుని భార్య నిష్పల, యుద్ధ విద్యలలో ఆరితేరినది. రెండో పులకేశి కోడలు విజ్ఞిక సంస్కృతభాషలో తొలి కవయిత్రి. ఎందరో వీరనారీమణులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. ఆనాటి వనితలు చూపిన ధైర్య సాహసాలు, త్యాగనిరతి, పోరాట పటిమ, ప్రతిఘటన ఎందరికో ఆశ్చర్యాన్ని స్ఫూర్తిని కలిగించాయి. దుర్గాబాయి దేశముఖ్‌ వంటి ఎందరో వనితామణులు తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారు. కందుకూరి రాజ్యలక్ష్మి తన భర్త వీరేశలింగంగారికి చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించారు. తాళ్లపాక అన్నమాచార్యుని సతీమణి తాళ్లపాక తిమ్మక్క గొప్ప కవయిత్రి.

ఈ పవిత్ర భూమిలో ఆధ్యాత్మిక సేవా భావం, త్యాగం, ధీరత్వం వంటి సద్గుణాలు కలిగిన వనితామణులకు కొదవ లేదు. అవనిలోనే కాదు- అంతరిక్షంలోనూ వనితామణులు విజయం సాధించారు. అందుకే విశ్వమంతా ముక్తకంఠంతో పలికే ఒకే ఒక్క మాట ‘వనితా వందనం’ అని.

వి.ఎస్‌.రాజమౌళి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని