టర్న్‌కీ సూత్రధారి శేఖర్‌రెడ్డే

ఆంధ్రప్రదేశ్‌లోని ఇసుక తవ్వకాలు, వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థ.. తమిళనాడులో ఇసుక దందాలకు పేరొందిన శేఖర్‌రెడ్డిదేనని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. ఆ సంస్థ

Updated : 16 May 2022 10:36 IST

బోసాని శ్రీనివాసరెడ్డి ఆయన భాగస్వామి.. సన్నిహితుడే  
పేరుకే జేపీ పవర్‌ వెంచర్స్‌.. నడిపించేదంతా ‘టర్న్‌కీ’నే
జీఎస్టీ నంబరు వచ్చే వరకూ కొన్నాళ్లు ఆగారంతే..
ఇసుక దందాను శేఖర్‌రెడ్డి చేతిలో పెట్టాలని ముందే పథకం
ఆ సొమ్మంతా జగన్‌ చెంతకే చేరుతోంది
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇసుక తవ్వకాలు, వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థ.. తమిళనాడులో ఇసుక దందాలకు పేరొందిన శేఖర్‌రెడ్డిదేనని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. ఆ సంస్థ డైరెక్టరు బోసాని శ్రీనివాసరెడ్డి శేఖర్‌రెడ్డికి వ్యాపార భాగస్వామి, అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో శేఖర్‌రెడ్డికి సంబంధించిన వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు, బంగారాన్ని ఆదాయ పన్నుశాఖ స్వాధీనం చేసుకుందని, అప్పట్లో శ్రీనివాసరెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిపి సొత్తు పట్టుకున్నారని వివరించారు. ఈ విషయాలన్నీ 2016 డిసెంబరు 9న ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమయ్యాయని వెల్లడించారు. శ్రీనివాసరెడ్డి కంటే ముందు టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడురు వాసి కోడూరి తనూజ శేఖర్‌రెడ్డికి సమీప బంధువని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో పట్టాభి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ పేరిట రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, వ్యాపారం మొత్తాన్ని జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో హస్తగతం చేసుకున్న శేఖర్‌రెడ్డి ఆంధ్ర ఇసుక మాఫియా డాన్‌గా మారారని ఆరోపించారు. ఇసుకలో వేల కోట్లు లూటీ చేసి జగన్‌రెడ్డి ఖజానాకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు.  

దోపిడీ పథకంలో భాగంగానే..

‘రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని శేఖర్‌రెడ్డి చేతిలో పెట్టాలని ముందుగానే నిర్ణయించుకుని అతడి వ్యాపార భాగస్వాములు బోసాని శ్రీనివాసరెడ్డి, బోసాని రవికాంత్‌రెడ్డిలతో టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థను ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఇసుక టెండర్ల నాటకానికి తెరలేపి జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ అనే కీలు బొమ్మ సంస్థను తెరపైకి తెచ్చారు. తాము అనుకున్న విధంగా సబ్‌ కాంట్రాక్టు పేరిట శేఖర్‌రెడ్డికి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ చేతుల్లోకి ఇసుక వ్యాపారమంతా వచ్చేలా చేశారు. వేల కోట్ల దోపిడీ పథకంలో భాగంగానే జేపీ పవర్‌ వెంచర్స్‌, టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. 2020 డిసెంబరు 30న టర్న్‌కీ సంస్థ ఏర్పాటైంది. వారం రోజుల్లోనే అంటే 2021 జనవరి 5న ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని టెండర్ల ద్వారా ఏదైనా కేంద్ర సంస్థకుగానీ, ప్రైవేటు సంస్థకుగానీ అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించింది. అయినా ఆ సంస్థ మొదటి రెండు, మూడు నెలలపాటు ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించలేదు. టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌కు జీఎస్టీ నంబరు రాకపోవటమే దీనికి కారణం. అది వచ్చే వరకూ వేచి చూసి ఆ తర్వాత 2021 మే 21 నుంచి కార్యకలాపాలను ప్రారంభించారు. శేఖర్‌రెడ్డి ప్రమేయం, భాగస్వామ్యంతో అంతా ముందస్తు పథకం ప్రకారమే ఇదంతా జరిగిందనేందుకు ఇంత కంటే ఆధారాలు ఏం కావాలి? ‘టర్న్‌కీ సంస్థ ఎవరిదో మాకు అనవసరం’ అంటూ గనులశాఖ ఇన్‌ఛార్జ్‌ సంచాలకుడు చంద్రశేఖర్‌, ‘సబ్‌ కాంట్రాక్టు ఎవరికి ఇస్తారో వాళ్లిష్టం’ అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?

ఏ రోజు ఆదాయం ఆ రోజే..

రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని పేరుకే జేపీ పవర్‌ వెంచర్స్‌ నిర్వహిస్తోంది. చక్రం తిప్పేదంతా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థే. సబ్‌ కాంట్రాక్టు పేరిట జగన్‌రెడ్డి ఇసుక వ్యాపారం మొత్తాన్ని తన బినామీ శేఖర్‌రెడ్డి గుప్పిట్లో పెట్టారు. రాష్ట్రంలోని ఏ ఇసుక రీచ్‌కు వెళ్లినా టర్న్‌కీ ప్రతినిధులే కనిపిస్తారు. జగన్‌కు ఇసుకపై వచ్చే ఆదాయం ఎంతో ఏ రోజు లెక్క ఆ రోజే తేలిపోవాలి. సాయంత్రానికి చేరాల్సిన వారికి చేరిపోవాలి. అందుకే ఆన్‌లైన్‌ చెల్లింపులు కాకుండా నగదు లావాదేవీలనే అంగీకరిస్తున్నారు.


ఎవరి మాట నిజం.. మంత్రిదా? గనుల శాఖదా?

రీచ్‌లలో ఆన్‌లైన్‌ ఇన్‌వాయిస్‌లు ఇచ్చే విధానాన్ని త్వరలో అమలు చేస్తామని గనులశాఖ ఇన్‌ఛార్జ్‌ సంచాలకుడు చంద్రశేఖర్‌ విలేకరుల సమావేశంలో చెబుతుంటే.. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. ఉల్లంఘనలపై ఒక్క కేసూ నమోదు చేయలేదని చంద్రశేఖర్‌ చెప్పగా.. ఇప్పటికే వేల కేసులు నమోదు చేశామని మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారు. వీరిద్దరి మాటల్లో ఎవరిది నిజం? ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పనిలో ప్రావీణ్యం ఉన్నవారు ఉండొచ్చంటూ మంత్రి పెద్దిరెడ్డి అంటున్నారు. నేనూ అదే చెబుతున్నా.. శేఖర్‌రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్న వారికి ఇసుక లూటీ, దొంగతనంతోపాటు వేల కోట్లను ఎలా లాగించాలన్న విషయంలో ప్రావీణ్యం ఉంది. అందుకే ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చారు’ అని పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని