Andhra News: విశాఖ అభివృద్ధికి నౌకాదళం సహకారం లేదు: మంత్రి అమర్‌నాథ్‌

విశాఖ అభివృద్ధికి నౌకాదళ అధికారులు సహకరించడం లేదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ ఆరోపించారు. భారత విమాన ప్రయాణికుల సంఘం (ఏటీఏఐ) ఆధ్వర్యంలో ‘విశాఖ కనెక్ట్‌, టూరిజం’ పేరుతో ఆదివారం విశాఖలో

Updated : 16 May 2022 09:37 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ అభివృద్ధికి నౌకాదళ అధికారులు సహకరించడం లేదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ ఆరోపించారు. భారత విమాన ప్రయాణికుల సంఘం (ఏటీఏఐ) ఆధ్వర్యంలో ‘విశాఖ కనెక్ట్‌, టూరిజం’ పేరుతో ఆదివారం విశాఖలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యుద్ధ నౌకల సమీక్ష సమయంలో రాష్ట్రపతితో యుద్ధ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు విశాఖ ఎంతో అందంగా ఉన్నా ఎందుకు అభివృద్ధి లేదని కొందరు తనను అడిగారని, దానికి నౌకాదళ అధికారులే కారణమని చెప్పానని వివరించారు. విశాఖలో తూర్పు నౌకాదళం ఉండటంతో పలు ప్రాజెక్టులకు వారి అనుమతులు కావాల్సి వస్తోందని, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమతులు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండలో 5 నక్షత్రాల హోటల్‌ నిర్మిస్తుంటే కొందరు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీ తీర ప్రాంతంలో ప్రతి 50 నుంచి 60 కి.మీ.లకు ఒక నౌకాశ్రయమో, చేపల రేవో నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. తెలంగాణకు హైదరాబాద్‌, కర్ణాటకకు బెంగళూరులా ఆంధ్రప్రదేశ్‌కు విశాఖను టైర్‌-1 నగరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. విశాఖకు మరిన్ని విమాన సర్వీసులు రావడానికి వీలుగా ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. నగరానికి పెట్టుబడులు వచ్చేలా ‘బీచ్‌ ఐటీ’ నినాదంతో దావోస్‌ సదస్సులో ప్రచారం చేస్తామని చెప్పారు. విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రం, అనుబంధంగా 300 గదులతో 5 నక్షత్రాల హోటల్‌ నిర్మించాలని ఆలోచిస్తున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని