ఉదయ్‌ పథకంతోనూ మారని తెలుగు రాష్ట్రాల డిస్కంలు

సంస్కరణలు తెచ్చినా తెలుగు రాష్ట్రాల డిస్కంల ఆర్థిక స్థితిలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఉజ్వల్‌ డిస్కం హామీ యోజన (ఉదయ్‌) పథకం 2015లో అమల్లోకి వచ్చినా డిస్కంలు బలపడలేదని కేంద్ర విద్యుత్తు శాఖ

Updated : 09 Aug 2022 06:12 IST

అప్పుల ఊబిలో విద్యుత్తు పంపిణీ సంస్థలు
 తెలంగాణ- రూ.21947 కోట్లు- ఏపీవి రూ.26,811
కేంద్ర విద్యుత్తు శాఖ తాజా నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌ : సంస్కరణలు తెచ్చినా తెలుగు రాష్ట్రాల డిస్కంల ఆర్థిక స్థితిలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఉజ్వల్‌ డిస్కం హామీ యోజన (ఉదయ్‌) పథకం 2015లో అమల్లోకి వచ్చినా డిస్కంలు బలపడలేదని కేంద్ర విద్యుత్తు శాఖ పార్లమెంటుకిచ్చిన తాజా నివేదికలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డిస్కంల అప్పులన్నీ కలిపి 2019-20 ఆఖరునాటికే రూ.5.14 లక్షల కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.48,758 కోట్లు. ఏటా ఈ రుణం పెరుగుతూ ఉంది. ఉదయ్‌ పథకం కింద 2015 సెప్టెంబరు ఆఖరునాటికి డిస్కంలకున్న మొత్తం అప్పుల్లో 75 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేశారు. ఇక మిగిలిన కొద్దిపాటి అప్పులతో ఈ సంస్థలు ఆర్థికంగా బలపడతాయని కేంద్రం అప్పట్లో అంచనా వేసింది. కానీ అలా కాకుండా అప్పులు మరింత పెరిగాయి. ఉదయ్‌ అమల్లోకి వచ్చి తొలి ఏడాది అన్ని డిస్కం అప్పులు రూ.4.21 లక్షల కోట్లుంటే నాలుగేళ్ల తరవాత రూ.5.14 లక్షల కోట్లకు చేరాయి. ఈ కాలవ్యవధిలో తెలుగు రాష్ట్రాల అప్పులు రూ.29,634 కోట్ల నుంచి రూ.48,758 కోట్లకు పెరిగాయి.

పెరుగుతున్న సగటు నష్టం..: ఈ నాలుగేళ్లలో తెలంగాణలో యూనిట్‌ కరెంటు సరఫరాకు పెడుతున్న ఖర్చులో సగటున వచ్చే నష్టం 74 పైసల నుంచి 109 పైసలకు పెరిగింది. ఉదయ్‌ పథకం అమలుచేస్తే ఈ లోటు గణనీయంగా తగ్గాలని కేంద్రం లక్ష్యంగా పెట్టింది. దేశవ్యాప్తంగా సగటున ఈ లోటు 48 నుంచి 30 పైసలకు తగ్గగా తెలంగాణలో మాత్రం 74 నుంచి 109కి పెరిగింది. అదే సమయంలో అగ్రిగేటెడ్‌ ట్రాన్స్‌మిషన్‌ కమర్షియల్‌ (ఏటీసీ) నష్టాలు 14.01 నుంచి ఏకంగా 21.54 శాతానికి పెరిగినట్లు కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో ఏటీసీ నష్టాలు 20.93 శాతముంటే తెలంగాణలో మరో 0.61 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఈ నష్టాలు పెరగడం వల్ల తెలంగాణ డిస్కంలకు ఆదాయం తగ్గిపోయి అప్పులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తున్న కరెంటుకు బిల్లులు నెలనెలా చెల్లించకపోవడం వల్ల రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. సమగ్ర విద్యుత్తు అభివృద్ధి (ఐపీడీఎస్‌) పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చిన కేంద్రం డిస్కంల పనితీరులో సంస్కరణలు తేవాలని సూచించింది. ప్రతి కరెంటు కనెక్షన్‌కు తప్పనిసరిగా స్మార్ట్‌మీటరు ఏర్పాటుచేసి ప్రతీ యూనిట్‌ కరెంటు ఎక్కడి నుంచి ఎటు వెళుతుందనే లెక్క తేల్చాలని చెప్పింది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలనే కేంద్రం ఇచ్చిన సూచనలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడంతో డిస్కంలు కూడా వీటి ఏర్పాటుకు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని