సీఎస్‌ఈలో సీటుందా?

బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ సీటే కావాలి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరే అవ్వాలి.. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్‌ ఇది. ప్రాంగణ నియామకాల్లోనే ఉద్యోగం పొందడం, లేదంటే పీజీ చేసేందుకు విదేశాలకు వెళ్లాలనే దృక్పథంతో అందరూ ఈ బ్రాంచిపైనే ఆసక్తి చూపుతున్నారు.

Published : 20 Aug 2022 04:51 IST

ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుపైనే ఆసక్తి
తల్లిదండ్రులు, విద్యార్థుల అన్వేషణ
కళాశాలలు, డీమ్డ్‌, ప్రైవేటు వర్సిటీల్లో సీఎస్‌ఈలోనే 50%పైగా సీట్లు
ఈనాడు - అమరావతి

బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ సీటే కావాలి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరే అవ్వాలి.. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్‌ ఇది. ప్రాంగణ నియామకాల్లోనే ఉద్యోగం పొందడం, లేదంటే పీజీ చేసేందుకు విదేశాలకు వెళ్లాలనే దృక్పథంతో అందరూ ఈ బ్రాంచిపైనే ఆసక్తి చూపుతున్నారు. కరోనాతో డిజిటలైజేషన్‌లో వచ్చిన మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్‌ నియామకాలు భారీగా పెరగడం.. ఇతర విభాగాల్లో ప్రాంగణ నియామకాలు సరిగా లేకపోవడంతో ఇప్పుడు విద్యార్థులు సీఎస్‌ఈ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ బ్రాంచిలో రాష్ట్రంలో సీటు లభించకపోతే తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఈఏపీసెట్‌, ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులు, విద్యార్థి తెలివితేటలతో సంబంధం లేకుండా సీఎస్‌ఈ కోసమే పోటీ పడుతున్నారు. ఇప్పటికే డీమ్డ్‌, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో సీట్లు దాదాపుగా నిండిపోయాయి. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రకటన విడుదల కాకపోయినా అనధికారికంగా ఒప్పందాలు జరిగిపోయాయి. విద్యార్థుల నుంచి డిమాండ్‌ రావడంతో ఒక్కసారిగా డొనేషన్లు, ఫీజులను పెంచేశాయి. విజయవాడలోని ఓ ప్రముఖ కళాశాలలో సీఎస్‌ఈ సీటు కోసం ఏడాదికి రూ.2.10లక్షలు తీసుకుంటుండగా.. సివిల్‌, మెకానికల్‌లాంటి విభాగాల్లో రూ.69వేలకే సీటు ఇస్తామన్నా చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతుల ప్రక్రియ జులైతో ముగిసింది.

పెరిగిన సీట్లు.. ఫీజులు..

విద్యార్థుల డిమాండ్‌ ఆధారంగా రోజు రోజుకు ఇంజినీరింగ్‌ కోర్సులకు ఫీజుల్లో మార్పు జరుగుతోంది. వీటిల్లో డొనేషను రూ.2.50లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఉంది.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35శాతం సీట్లు కన్వీనర్‌ భర్తీ చేస్తుండగా.. మిగతా 65శాతం యాజమాన్యాలు నింపుకొంటున్నాయి. సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కొంత రాయితీలు ఇస్తున్నాయి. ఈఏపీసెట్‌తో సంబంధం లేకపోవడంతో ఇప్పటికే వీటిల్లో దాదాపుగా సీట్లు నిండిపోయాయి. కొన్ని ప్రైవేటు వర్సిటీలు ఏడాదికి రూ.3.20లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ మండలి నిర్ణయించిన ఫీజుపై మూడింతలు తీసుకుంటుండగా.. మరికొన్ని అదనంగా రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నాయి.

ట్రెండ్‌పై అవగాహన లేకపోవడమూ కారణమే..

ఐటీ నియామకాల్లో ట్రెండ్‌ పూర్తిస్థాయిలో మారింది. ఇంజినీరింగ్‌లో సీఎస్‌ఈ చదవాలి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు బ్రాంచిల కంటే విద్యార్థి నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ కోర్సులు చదువుతున్న వారు పైథాన్‌, ప్రోగ్రామింగ్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, జావా, సర్టిఫికేషన్‌ కోర్సులు లాంటివి నేర్చుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొందుతున్నారు. బీటెక్‌ చదువుతున్న సమయంలోనూ, పూర్తయిన తర్వాత పైథాన్‌, జావాలాంటివి నేర్చుకోవడం కష్టమని, ఆ తర్వాత దానికి సమయం కేటాయించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది సీఎస్‌ఈకి ప్రాధాన్యం ఇస్తున్నారు.


అదనపు సీట్లకు ప్రతిపాదనలు

* రాష్ట్రంలో ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు మినహా ప్రైవేటు, వర్సిటీ కళాశాలల్లో ఈ ఏడాది ఒక్క సీఎస్‌ఈలోనే 15,912 సీట్లు పెరిగాయి. గతేడాది 51,994 సీట్లు ఉండగా.. ఈసారి ఈ సంఖ్య 67,906కు చేరింది. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో 1,73,572మంది అర్హత సాధించారు. గతేడాదితో పోల్చితే విద్యార్థుల సంఖ్య 40వేల వరకు పెరిగింది.

* రాష్ట్రంలో 240 వరకు ప్రైవేటు కళాశాలలు ఉండగా.. వీటిల్లో సీఎస్‌ఈలో 67వేలకుపైగా సీట్లు ఉన్నాయి. 30శాతం యాజమాన్య కోటా సీట్లకు డిమాండ్‌ నెలకొంది.

* ఓ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో 4వేల సీట్లు ఉండగా.. 2,500 సీఎస్‌ఈలోనే ఉన్నాయి. మరో 300 సీట్ల కోసం యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరో డీమ్డ్‌ వర్సిటీలోనూ సీఎస్‌ఈలో 2వేలకుపైగా సీట్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని