ఈ యంత్రాలకు మంత్రం వేసేది ఎవరు?

ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ యంత్రాలు, పరికరాలు పాడై.. రోగులు అవస్థలు పడుతున్నా.. వాటిని బాగుచేసే చర్యలు కనిపించడంలేదు. రాష్ట్రంలోని వివిధ రకాల ప్రభుత్వాసుపత్రుల్లో

Published : 30 Sep 2022 04:59 IST

ఆసుపత్రుల్లో పాడైన వైద్య పరికరాలు 

పర్యవేక్షణ సంస్థ ఎంపికపై ప్రభుత్వం మీనమేషాలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ యంత్రాలు, పరికరాలు పాడై.. రోగులు అవస్థలు పడుతున్నా.. వాటిని బాగుచేసే చర్యలు కనిపించడంలేదు. రాష్ట్రంలోని వివిధ రకాల ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 80,000కు పైగా యంత్రాలు, పరికరాలు ఉన్నట్లు అంచనా. చాలాచోట్ల సిటీస్కాన్లు, వ్యాధి నిర్ధారణ పరికరాలు పనిచేయడంలేదు. కొన్నిచోట్ల మూడేళ్ల నుంచి పనిచేయనివి కూడా ఉన్నాయి. దీంతో సకాలంలో పరీక్షలు జరగక రోగులు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చుపెట్టుకోవలసి వస్తోంది. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పరికరాలు, యంత్రాల పర్యవేక్షణకు సర్వీస్‌ ప్రొవైడర్‌ ఎంపిక కోసం చాన్నాళ్ల క్రితమే టెండరు పిలిచింది. ఎల్‌1 వచ్చిన ఓ సంస్థ గురించి వివరిస్తూ.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని గత జూన్‌ 27న వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. అక్కడి నుంచి తదుపరి చర్యలకు బ్రేక్‌ పడింది. ఉన్నత స్థాయిలో ఈ సంస్థ ఎంపిక పట్ల సానుకూలత కనిపించడంలేదు. ‘ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది.. కాస్త ఆగండి’ అని చెబుతూ కాలయాపన చేస్తున్నారని.. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియడంలేదని బయోమెడికల్‌ ఇంజినీర్లు పేర్కొంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం.. పర్యవేక్షణ సంస్థ ఎంపికకు ముందు జ్యుడిషియల్‌ ప్రివ్యూ జరిగిందా? యంత్రాలు, పరికరాల మరమ్మతులు ఎలా? చెల్లింపులు ఎలా చేస్తారు? మోడల్స్‌ ఎలా పరిగణనలోనికి తీసుకున్నారు? వంటి పలు అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి స్పష్టత కోరింది. టెండరు ఖరారుకు ముందు జరగాల్సిన ఈ ప్రక్రియ చివర్లో జరుగుతుండడం చర్చనీయాంశమైంది. గతంలో బయోమెడికల్‌ పరికరాల నిర్వహణ కోసం ఎంపిక చేసిన సంస్థ పనితీరు ఘోరంగా ఉండడం, అక్రమాలు చోటుచేసుకోవడంతో టెండరు రద్దుచేశారు. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో పరికరాలు, యంత్రాల పర్యవేక్షణను చూసేందుకు వైద్య ఆరోగ్య శాఖలో ఎవరూ ముందుకు రావడంలేదు. చివరికి వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలోనే ఇతర హెచ్‌ఓడీ కార్యాలయాల అధికారులతో ఏర్పాటుచేసే ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకున్నారు. చెల్లింపులు జరిగే హెచ్‌ఓడీ కార్యాలయంలోనే ఈ పర్యవేక్షణ విభాగం ఉండాలని మళ్లీ నిర్ణయించారు. అయితే.. సంస్థతో ఒప్పందం జరగనందున తదుపరి చర్యలకు విఘాతం ఏర్పడింది.


పనిచేయని యంత్రం..

అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి రక్త పరీక్షల విభాగంలో బయోకెమిస్ట్రీకి సంబంధించిన పరీక్షలు చేసే రూ. 5.50 లక్షల విలువైన ఫుల్లీ ఆటో అనలైజర్‌ పరికరమిది.. నాలుగు నెలలుగా పనిచేయడం లేదు. కొవిడ్‌ సమయంలో దీనిని తెప్పించారు. ఈ పరికరంతో వివిధ రకాల రక్త పరీక్షలు చేయవచ్చు. కానీ ఇది పనిచేయకపోవడంతో ఒక్కోటీ రూ. 7,500 విలువ చేసే కిట్లు నిరుపయోగంగా మారాయి. ఇవే పరీక్షలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 10,000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ భారమంతా రోగులపైనే పడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని