Super Star Krishna: సాహసి.. సినిమా ప్రగతి పిపాసి

ఇంజినీర్‌ కావాలన్నది తల్లితండ్రుల కల.. తీరా ప్రయత్నిస్తే.. బీఎస్సీ సీటు లభించింది. అలా చదువుపైనే దృష్టి కేంద్రీకరించిన ఆ కుర్రాడికి తొలి నుంచీ సినిమాలపై ఆసక్తి ఉండేది. కాలేజిలో అప్పుడప్పుడు ప్రదర్శించే నాటకాల్లో చిన్నచిన్న వేషాలు వేసే అలవాటుండేది. ఆనాటి దిగ్గజ హీరో అక్కినేనికి లభిస్తున్న ప్రేక్షకాదరణ.. ప్రజల బ్రహ్మరథం ప్రత్యక్షంగా చూశాక అతడిలో సినిమాకాంక్ష బలపడింది.

Updated : 16 Nov 2022 10:51 IST

నటుడిగా.. నిర్మాతగా ఎన్నో మైలురాళ్లు
సంచలన ఆరంభం.. కెరీర్‌ ప్రయోగాల భరితం
కృష్ణ.. చలనచిత్ర రంగానికి ఓ పాఠం
ఈనాడు - హైదరాబాద్‌

ఇంజినీర్‌ కావాలన్నది తల్లితండ్రుల కల.. తీరా ప్రయత్నిస్తే.. బీఎస్సీ సీటు లభించింది. అలా చదువుపైనే దృష్టి కేంద్రీకరించిన ఆ కుర్రాడికి తొలి నుంచీ సినిమాలపై ఆసక్తి ఉండేది. కాలేజిలో అప్పుడప్పుడు ప్రదర్శించే నాటకాల్లో చిన్నచిన్న వేషాలు వేసే అలవాటుండేది. ఆనాటి దిగ్గజ హీరో అక్కినేనికి లభిస్తున్న ప్రేక్షకాదరణ.. ప్రజల బ్రహ్మరథం ప్రత్యక్షంగా చూశాక అతడిలో సినిమాకాంక్ష బలపడింది. అలా ఆ యువకుడు తెలుగు సినీ వినీలాకాశంలో తనూ చోటు సంపాదించాలని మద్రాసు రైలెక్కాడు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. మొదట మూడు సినిమాల్లో చిన్న వేషాలు వేసి.. తర్వాత హీరో అయ్యాడు.. అది పెద్ద సూపర్‌హిట్‌. మూడో సినిమా ఓ ట్రెండ్‌సెట్టర్‌.. అది మొదలు అతడు ఎదురులేకుండా అయిదు దశాబ్దాలపాటు చలనచిత్ర రంగంలో ధ్రువతారగా వెలుగొందాడు. ఆయనే నటశేఖర కృష్ణ.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ చదివిన కృష్ణకు మొదటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక ఉండేది. దాన్ని మరింత రగిల్చిందో సంఘటన. కృష్ణ డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడైన నటుడు అక్కినేని నాగేశ్వరరావు 60 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఆర్‌ఆర్‌ కాలేజీలో అక్కినేనిని సత్కరించగా.. ఆయనను చూడటానికి జనం, విద్యార్థులు ఎగబడ్డారు. వేదికపై ప్రముఖులంతా ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఆ గ్లామర్‌ను చూసి కృష్ణ ఆకర్షితులయ్యారు. సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక అప్పుడే మరింత బలపడింది. డిగ్రీ పూర్తయిన వెంటనే తల్లితండ్రుల అనుమతితో మద్రాసు వెళ్లిపోయారు. సొంత ప్రయత్నాలతో ‘కులగోత్రాలు’, ‘పదండి ముందుకు’, ‘పరువు ప్రతిష్ఠ’ సినిమాల్లో చిన్న పాత్రలు వేశారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తమ కొత్త చిత్రం కోసం నటీనటులు కావాలంటూ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆయన వద్దకు కృష్ణ వెళ్లడం.. అన్ని పరీక్షల అనంతరం ఎంపికవడం చకచకా జరిగిపోయాయి. అలా ‘తేనెమనసులు’ చిత్రంలో ఇద్దరు కథానాయకుల్లో ఒకరిగా అవకాశం లభించింది. ఆ సినిమాలో డ్రిల్‌ మాస్టర్‌ బసవరాజుగా ప్రేక్షకుల్ని మెప్పించారు. రెండో సినిమా ఆదుర్తి సుబ్బారావు ‘కన్నెమనసులు’తో దక్కింది. ఇది సెట్స్‌పై ఉండగానే డూండీ దర్శకత్వంలో ‘గూఢచారి 116’ రూపంలో మూడో అవకాశం వచ్చింది. ఈ రెండు చిత్రాలు ఇరవై రోజుల తేడాతో విడుదలై విజయం సాధించాయి. అంతేకాదు ‘గూఢచారి 116’ చిత్రం కృష్ణను ఆంధ్రా జేమ్స్‌బాండ్‌ని చేసింది. ఏకంగా 20 సినిమాలకు హీరోని చేసింది. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సినిమా ట్రెండ్‌సెట్టర్‌గా నిలవడంతో ఇక కృష్ణ తిరిగి చూసుకోలేదు.

అల్లూరి ఓ చరిత్ర

ఆ తర్వాత బాపు దర్శకత్వంలో నటించిన ‘సాక్షి’ నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. కెరీర్‌ తొలినాళ్లలో ‘అసాధ్యుడు’, ‘సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘పచ్చని సంసారం’ తదితర చిత్రాలు నటుడిగా ఆయనకు సంతృప్తినిచ్చాయి. 1971లో వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ కృష్ణ స్థాయిని పెంచింది.. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు నిర్మించిన ఆ సినిమా తొలి కౌబాయ్‌ చిత్రంగా ఘనవిజయం సాధించి పరిశ్రమలో సంచలనం సృష్టించింది. కృష్ణ అగ్రకథానాయకుడిగా ఎదగడానికి ఈ సినిమానే బాటలు వేసింది. ఆ తర్వాత ‘పండంటి కాపురం’, ఎన్టీఆర్‌తో కలసి నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ కూడా విజయం సాధించాయి. కృష్ణ వందో చిత్రంగా 1974లో వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ చరిత్ర సృష్టించింది. ఆ సినిమాలో ఆవేశపూరిత పాత్రలో కృష్ణను చూసిన ప్రేక్షకులు ఆ తర్వాతి చిత్రాల్లో ఆయనను సాధారణ పాత్రల్లో చూడటానికి ఇష్టపడలేదు. అందుకే ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత వరుసగా 14 చిత్రాలు నిరాశపరిచాయి. వీటిలో కృష్ణ ఎంతో ఇష్టపడి చేసిన ‘దేవదాసు’ కూడా ఉంది. రెండేళ్ల పాటు కృష్ణ తన కెరీర్‌లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ‘పాడిపంటలు’ కృష్ణకు పునర్వైభవం తీసుకొచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం ‘కురుక్షేత్రం’తో కృష్ణ తొలిసారిగా పౌరాణిక చిత్రంలో నటించారు.

ఆయన ఓ పాఠం

కృష్ణ కేవలం నటించడమే కాదు.. నిర్మాతగా, దర్శకుడిగా చిత్రరంగానికి తన వంతు సేవలు అందించారు. తొలి తెలుగు సాంఘిక కలర్‌ సినిమా ‘తేనె మనసులు’లో కృష్ణ తన ప్రమేయం లేకుండానే హీరో అయ్యారు. ఆ తర్వాత పలు అంశాల్లో సినిమాలకు ఆనాటి ఆధునిక సాంకేతికతలను అద్ది ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ను పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. ఆ క్రమంలో నష్టాలొస్తాయని ఇతరులు వారిస్తున్నా సాహసం చేయడానికి వెనుకాడేవారు కారు కృష్ణ. నిర్మాతలు బాగుండాలని, సినిమా పరిశ్రమ కళకళలాడాలని ఆయన పరితపించేవారు. తన సినిమాలు ఫ్లాప్‌ అయినప్పుడు నిర్మాతలకు ఆ నష్టాన్ని పూడ్చడానికి సాయపడేవారని ప్రతీతి. చలనచిత్రాల్లో నటించడం, నిర్మాతలతో వ్యవహారశైలి విషయంలో కృష్ణ ఎంతో మొహమాటస్తుడని అంటారు. ఈ కారణంగానే ఆయన ఎన్నో సినిమాలు హిట్‌ కావని తెలిసీ.. నిర్మాతల మాట కాదనలేక నటించారని చెబుతారు. అలాగే సినిమా విడుదలయ్యాక.. తొలి ఒకటి రెండు రోజుల్లోనే దాని భవిష్యత్తును కచ్చితంగా అంచనా వేసేవారు కృష్ణ. ఇన్ని వారాలపాటు ఆడుతుందని నిర్మొహమాటంగా చెప్పేవారట. ఫ్లాప్‌ అయితే.. తన సినిమా అయినా సరే అంతే నిక్కచ్చిగా చెప్పేసేవారని ఆయనకు సన్నిహితులైన దర్శక నిర్మాతలు చెబుతుంటారు.

చుక్కల తోటలో ఎక్కడున్నావో!

‘‘రూథర్‌ఫర్డ్‌! ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం.. నీరు పవిత్రం.. గాలి పవిత్రం. నదులు, కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, వేయి జన్మలకైనా ఈ పుణ్యభూమి మీదే పుడతాను’’ .. కంచుకంఠంగా పేరొందిన కొంగర జగ్గయ్యకు ఎదురుగా నిలబడి ఈ డైలాగులు చెప్పి మెప్పించడం మాటలు కాదు. అలా మెప్పించడమే కాదు, ఈ పతాక సన్నివేశం కోసమే ప్రేక్షకులను పదే పదే థియేటర్లకు రప్పించి తెలుగువాళ్ల గుండెల్లో ‘అల్లూరి సీతారామరాజు’గా చిరస్థాయి పొందిన నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ. కృష్ణ పంచె కడితే ఆ సినిమా సూపర్‌హిట్‌ అనేలా రైతు పాత్రల్లో ఒదిగిపోయి వెండితెరపై సిరుల ‘పాడిపంటలు’ పండించారు. అంతేనా! ‘ఒరేయ్‌ కిట్టిగా!’ అంటూ పటపటా పళ్లు కొరికే విలన్‌ రావుగోపాల్రావును ఎన్నో సినిమాల్లో మూడు చెరువుల నీళ్లు తాగించిన ‘ఊరికి మొనగాడు’. కుళ్లు రాజకీయాలపై ఆయన పిడికిలి బిగిస్తే ఓ ‘ఈనాడు’.. రైతులకు మద్దతుధరల కోసం గళమెత్తితే మరో ‘ప్రజారాజ్యం’.. సమసమాజం కోసం గన్ను పడితే ‘ఎన్‌కౌంటర్‌’... ఇలా విప్లవచిత్రాలకూ పెట్టింది పేరే. అభిమానుల ఆరాటం ఎలా ఉన్నా, దయ లేని కాలం తన జాలం విసరక మానదుగా! ‘దేవదాసు’లో కృష్ణ పాటలాగే.. ‘వచ్చేవారు పోయేవారు.. జగతి పురాతన సత్రం’ అంటూ కటువైన సత్యాన్ని చాటకా మానదు.  

రాశి.. వాసి.. కలగలిసి..

కృష్ణ కెరీర్‌లో 1978-86 మధ్య కాలం స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఆ కాలంలో సంఖ్య పరంగా ఎక్కువ సినిమాలు చేయడమే కాదు... అత్యధిక విజయాలూ అందుకున్నారు. 1978లో ‘అన్నదమ్ముల సవాల్‌’, ‘ఏజెంట్‌ గోపి, ‘ఇంద్ర ధనస్సు’, ‘కుమార్‌ రాజా’, ‘అల్లరి బుల్లోడు’.. 1979లో వియ్యాలవారి కయ్యాలు, హేమాహేమీలు, మండే గుండెలు, కొత్త అల్లుడు, బుర్రిపాలెం బుల్లోడు విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఘరానా దొంగ, మామా అల్లుళ్ల సవాల్‌, చుట్టాలున్నారు జాగ్రత్త, రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌ లాంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. వీటిలో అత్యధిక చిత్రాల్లో కలసి నటించిన కృష్ణ, శ్రీదేవి హిట్‌పెయిర్‌గా పేరొందారు. 1981లో సంక్రాంతికి విడుదలైన ‘ఊరికి మొనగాడు’ పెద్ద విజయం సాధించింది. 1982లో కృష్ణ స్వయంగా నిర్మించిన ‘ఈనాడు’ సినిమాతో ఆయన 200 చిత్రాల మైలురాయిని చేరుకోవడం విశేషం. 1983లో ఆయన పద్మాలయా స్టూడియోస్‌ను స్థాపించారు. ఆ తర్వాతా ఆయన జైత్రయాత్రను కొనసాగించారు. ‘ముందడుగు’, ‘కిరాయి కోటిగాడు’, ‘అడవి సింహాలు’, ‘ప్రజారాజ్యం’, ‘ఇద్దరు దొంగలు’, ‘బంగారు కాపురం’, ‘ముఖ్యమంత్రి’, ‘కంచు కాగడా’ చిత్రాలతో ఆకట్టుకున్నారు. 1985లో కృష్ణ ఇమేజ్‌ శిఖరాగ్రస్థాయికి చేరింది. ఆ ఏడాది విడుదలైన ‘అగ్నిపర్వతం’, ‘పల్నాటి సింహం’, ‘వజ్రాయుధం’ చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. వాటిలోని ఆవేశపూరిత పాత్రల్లో కృష్ణ ప్రదర్శించిన అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1986లో కృష్ణ దర్శకుడిగా మారి.. ‘సింహాసనం’తో సత్తా చాటారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో ‘ముద్దాయి’, ‘తండ్రీ కొడుకుల ఛాలెంజ్‌’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘సాహసమే నా ఊపిరి’, ‘గూఢచారి 117’, ‘గూండారాజ్యం’ చిత్రాలతో మెప్పించారు. హిందీలోనూ అడుగుపెట్టి నిర్మాతగా ‘ఇష్క్‌ హై తుమ్‌సే’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ‘తెలుగు వీర లేవరా’ (1995)తో 300 చిత్రాలు పూర్తిచేశారు. ఆ తర్వాత కథానాయకుడిగా నటిస్తూనే ఇతర చిత్రాల్లో కీలకపాత్రలు పోషించడం ప్రారంభించారు. ‘వారసుడు’, ‘రాముడొచ్చాడు’, ‘ఒసేయ్‌ రాములమ్మా’, ‘సుల్తాన్‌’, ‘రాజకుమారుడు’, ‘వంశీ’, ‘మల్లన్న’ తదితర చిత్రాల్లో ప్రత్యేక పాత్రలతో ఆకట్టుకున్నారు కృష్ణ. ‘శ్రీశ్రీ’ సినిమా తర్వాత ఆయన నటించలేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నేళ్లుగా సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు మహేశ్‌బాబు.

రాజీవ్‌గాంధీ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి..

నటుడిగా సాహసోపేతమైన పాత్రలతో వెండితెరపై చెరగని ముద్ర వేసిన కృష్ణ.. ఎంపీగా రాజకీయ క్షేత్రంలోనూ చక్రం తిప్పారు. రాజీవ్‌ గాంధీ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో అదే ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజీవ్‌ మరణం తర్వాత అనూహ్యంగా రాజకీయాల నుంచి వైదొలగారు. దీని వెనకున్న కారణాన్ని ఓ సందర్భంలో పంచుకున్నారు కృష్ణ.

‘‘నేను రాజకీయ నాయకుడిగా స్థిరపడిపోవాలని రాజకీయాల్లోకి రాలేదు. రాజీవ్‌ గాంధీ బలవంతం చేయడంతో వచ్చాను. ఏ వ్యక్తి కారణంగా రాజకీయ క్షేత్రంలోకి వెళ్లానో.. ఆ వ్యక్తే లేనప్పుడు నేను అక్కడ ఉండటం అనవసరం అనిపించింది. అందుకే రాజకీయాల నుంచి విరమించుకున్నా’’

- ఓ సందర్భంలో కృష్ణ


తిరుమలలో విజయనిర్మలతో కృష్ణ వివాహం

తిరుమల, న్యూస్‌టుడే: దిగ్గజ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ సినీనటి విజయనిర్మలను 1969లో తిరుమలలో వివాహం చేసుకున్నారు. కృష్ణ, విజయ నిర్మల దంపతులు చివరిగా 2006లో తిరుమల వచ్చినట్లు తెలిసింది. ఆ సమయంలో విజయనిర్మల తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాలను సందర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపని ఆయన విజయనిర్మల కోసం తిరుమల వచ్చారు.


నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

సినీనటుడు కృష్ణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరపాలని సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఆ మేరకు తగు ఏర్పాట్ల నిమిత్తం సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని