Yerragondapalem: చంద్రబాబుపై రాళ్ల దాడి.. ఆ మూడో వ్యక్తి ఎవరు?

‘చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న రాళ్ల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరు జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు, ఇంకొకరు కంభంపాడు సర్పంచితో పాటు ‘మరో వ్యక్తి’ ఉన్నారు.

Updated : 24 Apr 2023 09:08 IST

దాడిలో గాయాలయ్యాయంటూ హడావుడి
ఐ-ప్యాక్‌ బృందం సభ్యుడేనని తెదేపా ఆరోపణ

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న రాళ్ల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరు జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు, ఇంకొకరు కంభంపాడు సర్పంచితో పాటు ‘మరో వ్యక్తి’ ఉన్నారు..’

- ఇవీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ యర్రగొండపాలెంలో శనివారం విలేకర్లతో చెప్పిన మాటలు.

ఆ ‘మూడో వ్యక్తి’ ఎవరనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది. అతని చిత్రాలను గానీ, పేరు గానీ వైకాపా నాయకులు బయటపెట్టలేదు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఈ నెల 21న పర్యటించారు. ఈ సందర్భంగా వైకాపా శ్రేణులు ఆయనపై రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఈ ఆందోళనలో ఓ యువకుడు పాల్గొన్నప్పటి చిత్రాలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తెదేపా అధినేత పట్టణంలోకి ప్రవేశించడానికి ముందు రహదారిపై మంత్రి సురేష్‌ ఆందోళన చేశారు. ఆ సమయంలో ఓ యువకుడు ఆయన పక్కనే ఉండి.. మాట్లాడుతూ, సంకేతాలిస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. దీంతో ఆ ‘మరో వ్యక్తి’ ఎవరనే ప్రశ్న రేకెత్తుతోంది. అతడు ఐ-ప్యాక్‌ సభ్యుడని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. అతడి ప్రణాళిక ప్రకారమే తెదేపా కార్యకర్తలను రెచ్చగొట్టేలా రాళ్లదాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఐ ప్యాక్‌కు చెందిన ఆ యువకుడికి కూడా చిన్నపాటి గాయం కావడంతో మంత్రి క్యాంపు కార్యాలయం లోనికి తీసుకెళ్లి తొలుత చికిత్స అందించినట్టు సమాచారం. ఇందుకుగాను 108 వాహనాన్ని, ఒక ప్రభుత్వ వైద్యుడిని పిలిపించారు. ఆ సమయంలో ముఖ్యనాయకులు మినహా ఇతరులెవరినీ గదిలోకి అనుమతించలేదు. అనంతరం అతని పేరు ఎక్కడా రాలేదు, ఎవరూ ప్రస్తావించలేదు. ‘ఆ మూడో వ్యక్తి’ ఎవరనే విషయాన్ని వైకాపా నాయకులు కూడా గోప్యంగా ఉంచారు. దీంతో పక్కా ప్రణాళికతోనే చంద్రబాబుపై రాళ్లదాడి జరిగిందనే విమర్శలకు ఈ అంశం బలం చేకూరుస్తోంది. ఐ-ప్యాక్‌కు చెందిన దాదాపు ఆరుగురు సభ్యులు చంద్రబాబు పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే యర్రగొండపాలెంలో తిష్ఠ వేసినట్టు తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని