CM Jagan Meeting: ఉండలేం నాయనోయ్‌!

బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం మచిలీపట్నం జెడ్పీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒకవైపు సీఎం జగన్‌ ప్రసంగిస్తుండగానే.. మరోవైపు జనం భారీ సంఖ్యలో బయటకు వెళ్లిపోయారు.

Updated : 23 May 2023 13:03 IST

సభలో నుంచి బయటకొచ్చేసిన జనం
సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన వైనం

ఈనాడు, అమరావతి - మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం మచిలీపట్నం జెడ్పీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒకవైపు సీఎం జగన్‌ ప్రసంగిస్తుండగానే.. మరోవైపు జనం భారీ సంఖ్యలో బయటకు వెళ్లిపోయారు. కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసి జనాన్ని ఉదయం 8 గంటలకే సభా ప్రాంగణానికి తరలించారు. గంటకు పైగా సభ ఆలస్యమైంది. మధ్యాహ్నం 12.30 వరకూ సభ కొనసాగడంతో ఎండ,  ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్‌ ప్రసంగానికి ముందే చాలామంది బయటకొచ్చేశారు. సభా ప్రాంగణంలోని గ్యాలరీల్లో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రసంగిస్తున్న సమయంలోనూ జనం వెళ్లిపోతుండటంతో వారిని లోపల కూర్చోబెట్టి ఉంచేందుకు పోలీసులు, సిబ్బంది అవస్థలు పడ్డారు. బయటకు రాకుండా అడ్డుకునే వారిపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మండలంలోని 34 పంచాయతీల నుంచి జనాన్ని తీసుకొచ్చేందుకు 302 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఇవికాకుండా నగరంలోని 50 డివిజన్‌లకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులతోపాటు ఆటోలు, ట్రాలీలను ఏర్పాటు చేసి జనాన్ని తరలించారు. ప్రజలను సభకు తీసుకొచ్చే బాధ్యతను సచివాలయ ఉద్యోగులు, వ్యవసాయ సహాయకులకు అప్పగించారు.

తీసుకొచ్చి రోడ్డుపై వదిలేశారు...

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. తమను తీసుకొచ్చిన వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేశారో తెలియక చాలామంది మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేకమంది ఎండలో ఉక్కపోత కారణంగా సభా ప్రాంగణంలో ఉండలేక ముందుగానే బయటకొచ్చేశారు. తమ వాహనాలు ఎక్కడ ఉన్నాయో తెలియక.. రహదారులపైనే వేచి ఉన్నారు. సభకు రాకపోతే.. పథకాలు రావని చెప్పారు, తీరా వచ్చాక.. ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారని వాపోయారు. సీఎం రాక సందర్భంగా మచిలీపట్నంలో వ్యాపారాలపై ఆంక్షలు కొనసాగాయి. నగరంలోని జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. దీంతో రహదారి పక్కన ఇరువైపులా లక్ష్మీటాకీసు, జిల్లా పరిషత్‌ కూడలి వరకు బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు దుకాణాలను మూసివేయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు