15 మందితోనే ప్రజాభిప్రాయ సేకరణ!
పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని చెన్నాయపాలెంలో సీఎం జగన్ బంధువులకు చెందిన ‘సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’కు పర్యావరణ అనుమతుల జారీ కోసం శనివారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ తూతూమంత్రగా సాగింది.
సిద్ధం చేసుకున్న జాబితాలోని వారినే పిలిచారు
సీఎం బంధువులకు చెందిన సరస్వతి సిమెంట్స్ పర్యావరణ అనుమతుల సభ నిర్వహణ తీరు
తమ సమస్యలు వినలేదని స్థానికుల అసంతృప్తి
మాచవరం, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని చెన్నాయపాలెంలో సీఎం జగన్ బంధువులకు చెందిన ‘సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’కు పర్యావరణ అనుమతుల జారీ కోసం శనివారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ తూతూమంత్రగా సాగింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ వేదికలో తమకు మాట్లాడే అవకాశం లభిస్తుందని ఆశపడిన మూడు గ్రామాల ప్రజలకు నిరాశే ఎదురైంది. అధికారులు ముందుగా సిద్ధం చేసుకున్న జాబితా ప్రకారం కేవలం పదిహేను మందితో మాట్లాడించి మమ అనిపించారు. పరిశ్రమకు భూములిచ్చిన మాచవరం, దాచేపల్లి మండలాలకు చెందిన వేమవరం, చెన్నాయపాలెం, తంగెడ గ్రామస్థులు సభకు వచ్చారు. జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ సమావేశ ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం డీఆర్వో వినాయకం ముందుగా సిద్ధం చేసుకున్న జాబితాలోని చెన్నాయపాలెం, తంగెడ గ్రామాలకు చెందిన 15 మందిని మాత్రమే మాట్లాడేందుకు ఆహ్వానించారు. అందులో ఒకరు తప్ప, మిగిలిన వారందరూ అనుకూలంగా మాట్లాడారు. వేమవరం గ్రామం నుంచి ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశం కల్పించకపోవడంపై ఆ గ్రామ సర్పంచితోపాటు పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ సిమెంట్ పరిశ్రమ, క్లింకర్ తయారీ, పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో దాదాపు 1,100 ఎకరాల భూమి సేకరించి దాదాపు 13 ఏళ్లు అవుతోంది.
మాకు జబ్బులు వస్తే బాధ్యులెవరు?
ఫ్యాక్టరీ రావడం అందరికీ సంతోషమేనని, దానివల్ల వచ్చే దుమ్ము, ధూళితో తమకు జబ్బులు వస్తే బాధ్యత ఎవరు వహిస్తారని సభలో స్థానికులు ప్రశ్నించారు. ఆసుపత్రి నిర్మాణం చేపట్టి ఉచితంగా వైద్యం అందించాలని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఎకరా భూమి రూ.3 లక్షలకు కొనుగోలు చేశారని, మూడేళ్ల లోపు అదే ప్రాంతంలో ఎవరైనా ఎక్కువ ధర చెల్లిస్తే అంతే ఇస్తామన్నారని, ఆ మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై రైతులకు, యాజమాన్యానికి మధ్య ఒప్పందం జరగాలని తంగెడ గ్రామానికి చెందిన హుస్సేన్ స్పష్టం చేశారు. మూడు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సీజే రెడ్డి మాట్లాడుతూ రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానం ప్రకారం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, సీఎస్‌ఆర్ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జేసీ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మాచర్ల, దాచేపల్లి ప్రాంతాల్లో అనువైన భూములు గుర్తించి, ఏపీఐఐసీ పార్కు ఏర్పాటు చేస్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?