ఆర్థిక అరాచకత్వంలో పోటీలేని జగన్‌ (సంపాదకీయం)

మట్టిగుర్రాన్ని నమ్ముకుని ఏట్లోకి దిగితే ఏమవుతుంది? పోనీ, ఆవుల మందకు తోడేలును కాపలా పెడితే ఏం జరుగుతుంది? జవాబు కావాలంటే- జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను పరిశీలిస్తే సరిపోతుంది!

Updated : 30 May 2023 10:43 IST

ట్టిగుర్రాన్ని నమ్ముకుని ఏట్లోకి దిగితే ఏమవుతుంది? పోనీ, ఆవుల మందకు తోడేలును కాపలా పెడితే ఏం జరుగుతుంది? జవాబు కావాలంటే- జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను పరిశీలిస్తే సరిపోతుంది! ‘సమసమాజ నిర్మాణానికి కావాల్సిన సుపరిపాలన అందిస్తా’ననే అందమైన అబద్ధంతో అధికారంలోకి వచ్చారాయన. అప్పటినుంచి అసత్యాలు, అర్ధసత్యాలనే జోడెద్దులపై సర్కారీ రథాన్ని నడిపిస్తూ, ఆంధ్ర రాష్ట్ర ఆర్థికారోగ్యాన్ని అప్పుల వెంటిలేటర్‌పైకి చేర్చారు! ‘రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి... నిధులను న్యాయబద్ధంగా వినియోగించాలి’ అని నీతిఆయోగ్‌ తాజా సమావేశంలో ప్రధాని మోదీ హితవు పలికారు. ఆయన హెచ్చరించినట్లు, రుణాల గుదిబండ బరువుకు రాబోయే తరాల నడుములు విరిగిపోకూడదంటే- రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి తీరాలి. ఆ మాటంటే ఒంటిమీద తేళ్లూజెర్రులూ పాకినట్లు కంపరమెత్తిపోయే జగన్‌ సర్కారు- విచ్చలవిడి అప్పులు, పారదర్శకత లేని పాలనా విధానాలతో ఏపీ భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయాలూ అనధికారిక అంచనాల ప్రకారం, పెండింగ్‌ బిల్లులతో కలిపి లెక్కిస్తే- రాష్ట్ర బకాయిల భారం మొన్న మార్చినాటికే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు నెలల్లోనే జగన్‌ సర్కారు బహిరంగ మార్కెట్‌ ద్వారా రూ.13,500 కోట్ల మేరకు రుణాలు సేకరించింది. బడ్జెట్‌లో చూపించకుండానే భారీయెత్తున అప్పులు చేస్తున్నారని, ఆ సొమ్ములో అత్యధికం రెవిన్యూ ఖర్చుకే ధారపోస్తున్నారని ‘కాగ్‌’ గతంలోనే ఆందోళన వ్యక్తంచేసింది. రుణ సేకరణలో రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ కేంద్ర ఆర్థికశాఖ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుడు తీవ్రంగా ఆక్షేపించింది. ఎవరు ఏమి చెప్పినా బేఖాతరు చేస్తున్న జగన్‌- దీర్ఘకాలంలో ప్రయోజనదాయకమైన మూలధన వ్యయాన్ని అటకెక్కించేశారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి పాటుపడటమంటే, దాన్నో మహాపాపంగా భావిస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నాటి ప్రభుత్వం రూ.55,894 కోట్లు ఖర్చుచేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలను ‘హరితాంధ్ర’గా తీర్చిదిద్దుతామని డంభాలు పలికిన వైకాపా సర్కారేమో జలయజ్ఞానికి నామమాత్రపు కేటాయింపులతో సరిపుచ్చుతోంది.  పరిశ్రమలను ప్రోత్సహించడం, ఉపాధికి ఊతమివ్వడం తదితరాల్లోనూ జగన్‌ చేతలు- రాష్ట్రం నెత్తిన భస్మాసుర హస్తాలవుతున్నాయి! 

మాటలతో కోటలు కట్టి, జనాన్ని బురిడీ కొట్టించడంలో జగన్‌ నైపుణ్యం అనితరసాధ్యం. నీతిఆయోగ్‌ సమావేశంలోనూ ఆయన తన ప్రతిభను నిరుపమానంగా ప్రదర్శించారు. ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన పురోగమించాలంటే- ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని జగన్‌ మహాగొప్పగా ప్రవచించారు. ఆ మేరకు స్వరాష్ట్రంలో ఆయన చేస్తున్నదేమిటంటే- హళ్లికిహళ్లి సున్నకుసున్న! 2019 అక్టోబరు నుంచి 2022 జూన్‌ నడుమ దేశంలోకి రూ.11.79 లక్షల కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు  వెల్లువెత్తాయి. వాటిలో ఏపీలోకి వచ్చినవి కేవలం రూ.4,056 కోట్లు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ తదితరాలతో పోటీ సంగతి దేవుడెరుగు- 2021లో మూలధన పెట్టుబడులను ఆకర్షించడంలో రాజస్థాన్, పశ్చిమ్‌ బెంగాల్‌ వంటి వాటికన్నా ఏపీ వెనకపడిపోయింది. వివిధ రాష్ట్రాల్లో సరకు రవాణా సౌకర్యాల స్థితిగతులను ‘లీడ్స్‌’ సర్వే పేరిట కేంద్రం సరిపోలుస్తుంటుంది. 2019కిగాను అందులో మూడో స్థానంలో నిలిచిన ఏపీ- 2021లో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మౌలిక సదుపాయాలు, సర్కారీ సేవలపరంగా నాణ్యతలేమే ఏపీ దుస్థితికి కారణమని ‘లీడ్స్‌’ నివేదిక కుండ బద్దలుకొట్టింది. నీతిఆయోగ్‌ రూపొందించిన ‘భారతదేశ నవకల్పనా సూచీ’లో 17 పెద్దరాష్ట్రాల్లో తెలంగాణ రెండోదిగా నిలిస్తే- ఏపీ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం మొన్న ఫిబ్రవరిలో రాజ్యసభలో వెల్లడించిన వివరాల మేరకు- అంకురసంస్థలకు ప్రోత్సాహక వాతావరణ పరికల్పనలోనైతే ఏపీది ఏకంగా 29వ స్థానం! 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మిజోరం, లద్దాఖ్‌ మాత్రమే ఆంధ్ర కంటే వెనక ఉన్నాయి. అభివృద్ధి పొడగిట్టని జగన్‌ అధ్వాన పాలనకు ప్రత్యక్ష నిదర్శనాలే ఇవన్నీ. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏదైనా సరే, ప్రజలకు జవాబుదారీగా మెలగాలి. ఏయే రూపాల్లో ఎన్నెన్ని అప్పులు తెస్తున్నారన్న సమాచారాన్ని వైకాపా సర్కారు ఏనాడూ సక్రమంగా బయటికి వెల్లడించడం లేదు. ప్రజల బతుకులను బలిపీఠంపైకి ఈడ్చుకుపోయే ఆర్థిక అరాచకత్వంలో జగన్‌ ప్రభుత్వానికి వేరొకరితో పోటీయే లేదు!  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు