Viveka Murder Case - Avinash Reddy: ఎ-8గా అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ కోర్టుకు శుక్రవారం సీబీఐ అనుబంధ అభియోగపత్రం సమర్పించింది.

Updated : 01 Jul 2023 08:24 IST

నిందితులుగా భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి
అనుమానితులుగా ఎం.వి.కృష్ణారెడ్డి, ఏదుల ప్రకాష్‌
వివేకా హత్యకేసులో సీబీఐ అనుబంధ అభియోగ పత్రం
జులై 14 వరకు నిందితుల రిమాండు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ కోర్టుకు శుక్రవారం సీబీఐ అనుబంధ అభియోగపత్రం సమర్పించింది. ఇందులో ఎ-6గా ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎ-7గా వై.ఎస్‌.భాస్కరరెడ్డి, ఎ-8గా వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిలను పేర్కొంది. వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్‌లను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది. జూన్‌ 30లోగా వివేకా హత్యకేసులో దర్యాప్తును పూర్తిచేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. దీంతోపాటు ఇప్పటివరకూ నమోదుచేసిన సాక్షుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను జతచేసింది. సీబీఐ సమర్పించిన అన్ని ఆధారాలనూ పరిశీలించిన తర్వాత కోర్టు యంత్రాంగం న్యాయమూర్తి ముందు ఉంచుతుంది. అభియోగపత్రాన్ని, అందులో పేర్కొన్న అభియోగాలను, ఆధారాలను పరిశీలించాక న్యాయమూర్తి దాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుని నిందితులకు సమన్లు జారీచేయాల్సి ఉంది.

రిమాండు పొడిగింపు

ఈ కేసులో నిందితులైన గంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కరరెడ్డిలను చంచల్‌గూడ జైలునుంచి తీసుకొచ్చి శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచారు. వీరందరికీ జడ్జి సీహెచ్‌.రమేశ్‌బాబు జులై 14 వరకు రిమాండును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

దర్యాప్తు కొనసాగుతుందా?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసినా.. ఇంకా దర్యాప్తు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వివేకా చనిపోయే ముందు రాసిన లేఖలో నిగూఢ వేలిముద్రలనూ గుర్తించడంలో భాగంగా లేఖను కోర్టు నుంచి సీబీఐ తీసుకుని, దిల్లీ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది. నిన్‌హైడ్రిన్‌ పరీక్ష ద్వారా వేలిముద్రలను గుర్తించాలని కోరింది. ఎం.వి.కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాష్‌లను అనుమానితులుగా పేర్కొంది. వీటన్నింటిపై స్పష్టత నిమిత్తం దర్యాప్తును మరికొంతకాలం కొనసాగించే అవకాశాలున్నాయి. తదుపరి దర్యాప్తులో సమాచారం వెల్లడైతే సమర్పిస్తామంటూ కోర్టును కోరే అవకాశం ఉంది. వివేకా హత్యకు డబ్బు సమకూర్చిందెవరు, ఆ డబ్బు ఎక్కడ ఉందన్న వివరాలు తెలియాల్సి ఉంది.

నేరంలో నిందితుల పాత్ర స్పష్టం

వివేకా హత్య వెనుక జరిగిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు... ‘‘నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొనగా సాక్ష్యాలు విధ్వంసం చేయడంలో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి పాత్ర ఉన్నట్లు తేలింది.  అవినాష్‌రెడ్డి డ్రాయింగ్‌ రూం లోపల, లాన్‌ ప్రాంతంలో ఉండగా, శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డిలతో కలిసి భాస్కరరెడ్డి బెడ్‌రూంలో ఉంటూ సాక్ష్యాలు విధ్వంసం చేయించారు. హత్య పథకం అమలుకు అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి నగదు సమకూర్చుతారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. అవినాష్‌రెడ్డి ఇతరులతో చర్చించిన తర్వాత సీఐ శంకరయ్యకు ఫోన్‌ చేసి బందోబస్తుకు పోలీసులను పంపాలని చెప్పి, గుండెపోటుతో మృతిచెందినట్లు ప్రకటించడం కుట్రలో భాగమే. సీఐకి కేసు నమోదు చేయవద్దని, పోస్టుమార్టం కూడా అవసరం లేదని మొదట చెప్పారు. తర్వాత సునీత తదితరులు వచ్చాక కేసు నమోదు చేశారు. అవినాష్‌రెడ్డి సూచనల మేరకు అస్పష్టమైన వివరాలతో గాయాలు, రక్తపుమడుగులో మృతదేహం పడి ఉన్నా.. కనీసం వాటి ప్రస్తావన లేకుండా ఎం.వి.కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు’’ అని సీబీఐ పేర్కొంది.

రాజకీయ విభేదాలూ కారణమే

‘‘కడప జిల్లా రాజకీయాల్లో వివేకా చురుకైన పాత్ర పోషిస్తుండటంతో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి రాజకీయ విభేదాలతో కక్ష పెంచుకుని ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నడం ప్రారంభించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల డివిజన్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో గెలవడం వైకాపా శ్రేణులకు ఆశ్చర్యం కలిగించింది. గెలుస్తానన్న ధీమాతో వివేకా తన డివిజన్‌ను వదిలి ఇతర డివిజన్లపై దృష్టి సారించారు. పులివెందుల వ్యవహారాలను అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి పర్యవేక్షిస్తూ వివేకా ఓటమికి కారకులయ్యారు. వెన్నుపోటు గురించి తెలుసుకున్న వివేకా ఆగ్రహం వ్యక్తం చేసి, గంగిరెడ్డిని పలుమార్లు తిట్టారు. ఎంపీ టికెట్‌ అవినాష్‌రెడ్డికి దక్కకుండా వివేకా ప్రయత్నించారని అవినాష్‌ కక్ష పెంచుకున్నారు. దీంతో నేరచరిత్ర ఉన్న శివశంకర్‌రెడ్డి ద్వారా హత్యకు కుట్రపన్నినట్లు ప్రాసంగిక సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి’’ అని అభియోగపత్రంలో సీబీఐ తెలిపింది.


సాంకేతిక ఆధారాలున్నాయి

‘‘దర్యాప్తులో భాగంగా అనుమానితుల కాల్‌ డేటా, హత్య జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజి, గూగుల్‌ టేక్‌ ఔట్‌, కాల్‌డేటా రికార్డులు, అనుమానితుల ఫోన్ల నుంచి సేకరించిన డేటాతో పాటు వివేకా ఇంట్లోని రౌటర్‌ నుంచి వై-ఫై లాగ్స్‌, ఏఐఐఎంఎస్‌ నిపుణుల నుంచి అభిప్రాయాలతో సహా భారీ ఎత్తున ఎలక్ట్రానిక్‌ డేటా సేకరించి పరిశీలించాం. దిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి గూగుల్‌ టేక్‌ ఔట్‌ గురించి అందిన నివేదికలో సాక్ష్యాల ధ్వంసం, హత్య వెనుక కుట్రలో ఉదయ్‌కుమార్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిల పాత్ర ఉంది. వివేకా హత్య తర్వాత 15 తెల్లవారుజామున 1.58 గంటలకు అవినాష్‌ ఇంట్లో సునీల్‌యాదవ్‌ ఉన్నట్లు గూగుల్‌ ద్వారా తేలింది. గూగుల్‌ టేక్‌ఔట్‌ ప్రకారం సునీల్‌యాదవ్‌ ఈ సమయంలో 6.15 నుంచి 6.33 మధ్య అవినాష్‌రెడ్డి వాళ్ల ఇంట్లో ఉంటూ కత్తి తీసుకురావడానికి కదిరి వెళ్లిన దస్తగిరి కోసం ఎదురు చూస్తున్నాడు. అవినాష్‌రెడ్డి ఇంటికి ఉదయ్‌కుమార్‌రెడ్డి 6.53కు వచ్చి 8.07 గంటల వరకు ఉన్నాడు. శివశంకర్‌రెడ్డి 15న 8.25 నుంచి 12.45 వరకు పులివెందుల స్టేషన్‌ సమీపంలో ఉన్నట్లు గూగూల్‌ టేక్‌ఔట్‌ ద్వారా వెల్లడైంది. అంటే ఫిర్యాదు సమయంలో కృష్ణారెడ్డితో పాటు ఉన్నట్లు తెలుస్తోంది’’ అని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని