Raghu Rama Krishna Raju: ఇది మార్గదర్శిపై కాదు.. ఈనాడుపై దాడి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శి సంస్థపై చేస్తున్న దాడి.. వాస్తవానికి ‘ఈనాడు’ పత్రికపై చేస్తున్నట్లని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Updated : 18 Aug 2023 08:15 IST

వ్యాపారాన్ని కూడా పణంగా పెట్టి నిజాలు నిర్భయంగా రాస్తున్న రామోజీరావుకు ప్రజలు అండగా నిలవాలి: ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శి సంస్థపై చేస్తున్న దాడి.. వాస్తవానికి ‘ఈనాడు’ పత్రికపై చేస్తున్నట్లని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. మీడియా సంస్థలపై ప్రభుత్వాల దాడిని ప్రజలు హర్షించరని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘నిజాలను నిర్భయంగా చెప్పడానికి, ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగట్టడానికి రామోజీరావు తన వ్యాపారాలను కూడా పణంగా పెట్టి పోరాడుతున్నారు. అందువల్ల ఆయన వ్యాపార సంస్థలపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రజలంతా ఖండించాలి. ప్రజల పక్షాన ‘ఈనాడు’ దినపత్రిక ద్వారా పోరాడుతున్న రామోజీరావుకు సంపూర్ణ సహకారాన్ని అందించాలి. మార్గదర్శి సంస్థపై ఒక్క ఫిర్యాదు కూడా లేకపోయినప్పటికీ, జగన్‌ ప్రభుత్వం పదేపదే దాడులు చేస్తోంది. ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులు స్టే విధించినా జగన్‌ ప్రభుత్వం దాడులను ఆపడం మానలేదు. మార్గదర్శి రోజువారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించింది.

ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు పచ్చి అబద్ధాలు ఆడారు. తాము మార్గదర్శి రోజువారి కార్యకలాపాలను అడ్డుకోలేదని తెలిపారు. ఆ సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తన ఉత్తర్వులలో రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు ఇతరులను ఆదేశించింది. అయినా, గుంటూరు పట్టణంలోని అరండల్‌పేట మార్గదర్శి బ్రాంచిలో షట్టర్లను మూసివేసిన, సీసీ కెమెరాలను తొలగించిన దృశ్యాలు వెలుగు చూశాయి. మార్గదర్శి సంస్థలపై దాడి కోసం రెండు మానిటరింగ్‌ గ్రూపులతో పాటు, 37 సబ్‌ గ్రూపులను ఏర్పాటుచేసి తాడేపల్లి ప్యాలెస్‌ సమీపంలోని సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో వారికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని రంగంలోకి దింపి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి బ్రాంచ్‌లలో అగ్నిమాపకశాఖ అనుమతులు పరిశీలించడం, విద్యుత్తు బకాయిలు, జీఎస్టీ చెల్లింపులు, ఇంటి పన్నులు, భవన నిర్మాణ అనుమతులలో ఉల్లంఘనలను గుర్తించాలని ఆదేశించారు. కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా మార్గదర్శి సంస్థను ప్రభుత్వం వేధిస్తోంది’ అని రఘురామ పేర్కొన్నారు.  

తిరుపతి కొండలను బోడి గుండులని అవమానించడం సబబేనా?

తితిదే చైర్మన్‌గా నియమితుడైన భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతి కొండలను బోడి గుండులని అవమానించడం సబబేనా? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. కరుణాకర్‌రెడ్డి వర్ణన జుగుస్సాకరంగా ఉందన్నారు. ఆ వ్యాఖ్యలు భగవంతుడిపై ఆయనకున్న భక్తి తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.


జగన్‌కే నష్టం

-చింతా మోహన్‌

ఈనాడు, తిరుపతి: కక్ష సాధింపులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఆరోపించారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీటివల్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే నష్టం వస్తుందని హెచ్చరించారు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.


పారిశ్రామికవేత్తలెవరైనా రాష్ట్రానికి వస్తారా

-ప్రత్తిపాటి

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: కోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా మార్గదర్శిపై సీఎం జగన్‌ కక్ష కట్టి ముప్పేట దాడులతో వేధిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. వ్యాపార ప్రపంచానికి జగన్‌ తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, ఇలాంటి చర్యలతో ఏ పారిశ్రామికవేత్తా రాష్ట్రం వైపు చూసే పరిస్థితి ఉండదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని