Mukul Rohatgi: యడుయూరప్పకు ఒక ‘లా’.. చంద్రబాబుకు మరో ‘లా’

ఒకే తరహా కేసులలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ భిన్న వాదనలు వినిపించడం న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Updated : 21 Sep 2023 08:46 IST

వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్పకు సెక్షన్‌ 17ఏ వర్తిస్తుంది
గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని గతంలో వాదన
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అది వర్తించదని తాజాగా వాదన

ఈనాడు-దిల్లీ, అమరావతి: ఒకే తరహా కేసులలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ భిన్న వాదనలు వినిపించడం న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అవినీతి నిరోధక (సవరణ) చట్టం సెక్షన్‌ 17ఏ వ్యవహారంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్ప విషయంలో ఓ విధంగా.. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో మరో విధంగా వాదనలు వినిపించడంపై న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17ఏ ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్‌పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నాకే పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు చేయాలి. ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిపై కేసుల విషయంలో ముందుకెళ్లాలంటే గవర్నర్‌ ఆమోదం తప్పనిసరి.

  • ఓ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసేందుకు కుమారుడి ద్వారా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్ప లంచం తీసుకున్నారని, ఆ సొమ్మును ఆయన అనుచరులు షెల్‌ కంపెనీలకు మళ్లించారని, తిరిగి ఆ సొమ్ము యడుయూరప్ప కుటుంబానికే చెందిందనే ఆరోపణలతో టీజే అబ్రహం అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా లోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి దర్యాప్తునకు అదేశించింది. అయితే దానిపై విచారణ కొనసాగించడానికి గవర్నర్‌ ముందస్తు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సెషన్స్‌ కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రైవేటు ఫిర్యాదుదారు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు యడుయూరప్పకు వ్యతిరేకంగా ఉత్తర్వులిచ్చింది. గవర్నర్‌ అనుమతిని తిరస్కరించడం ఆయనపై విచారణ కొనసాగించడానికి అడ్డంకి కాదని, అందువల్ల ప్రైవేటు ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టాలని ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక కోర్టును ఆదేశించింది. దాంతో ఆ కోర్టు ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ యడుయూరప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం 2022 సెప్టెంబరు 23న విచారణ జరిపింది. యడుయూరప్ప తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. 2013 అక్టోబరులో అనిల్‌కుమార్‌ వర్సెస్‌ అయ్యప్ప కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను కోర్టు దృష్టికి తెచ్చారు. అవినీతి కేసుల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా పబ్లిక్‌సర్వెంట్‌కు వ్యతిరేకంగా దర్యాప్తునకు ఆదేశించే అధికారం మేజిస్ట్రేట్‌కు లేదన్నారు. యడుయూరప్ప పబ్లిక్‌ సర్వెంట్‌ అనే నిర్వచనం పరిధిలోకి వస్తారన్నారు. సెక్షన్‌ 17ఏ నేపథ్యంలో గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే దర్యాప్తు ప్రారంభించాలన్నారు. ఆయనకు సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. బెంగుళూరు అదనపు సిటీ సివిల్‌ సెషన్స్‌ జడ్జి ముందు పెండింగ్‌లో ఉన్న కేసులో తదుపరి విచారణపై స్టే ఇచ్చింది.
  • మరోవైపు తనపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ అనిశా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంలో సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. సెక్షన్‌ 17ఏ చంద్రబాబుకు వర్తించదని వాదించారు. చంద్రబాబు విషయంలో కేసు నమోదు చేయాలన్నా, దర్యాప్తు ప్రారంభించాలన్నా గవర్నర్‌ ఆమోదం పొందాల్సిన అవసరం లేదన్నారు. 17ఏ సెక్షన్‌ను చంద్రబాబు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులైన యడుయూరప్ప, చంద్రబాబు విషయంలో ముకుల్‌ రోహత్గీ ఇలా భిన్న వాదనలు వినిపించడం న్యాయసమాజంలో విస్తృతచర్చకు దారితీసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు