మార్గదర్శిపై మరో కట్టుకథ

రామోజీ గ్రూప్‌ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. మార్గదర్శిపై అక్రమంగా దాడులు చేసి, కేసులు పెట్టి, ఖాతాదారుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వం ఇంకో కట్టుకథ అల్లింది.

Updated : 18 Oct 2023 06:53 IST

జగన్‌ ప్రభుత్వ కుట్రలో భాగంగా  ఇంకో కేసు
మార్గదర్శిలో తన తండ్రి పెట్టిన రూ.5వేల పెట్టుబడికి  రూ.39.74 లక్షల డివిడెండ్‌ పొందిన యూరిరెడ్డి
ఆ షేర్లు సంస్థకే విక్రయించిన వైనం
బలవంతంగా తీసుకున్నారంటూ ఏడేళ్ల తర్వాత తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు
ఏపీ సీఐడీయే సూత్రధారి

ఈనాడు, అమరావతి: రామోజీ గ్రూప్‌ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. మార్గదర్శిపై అక్రమంగా దాడులు చేసి, కేసులు పెట్టి, ఖాతాదారుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వం ఇంకో కట్టుకథ అల్లింది. యూరిరెడ్డి అనే వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు చేయించి.. మార్గదర్శి సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌ల ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ఏపీ సీఐడీతో కుట్రపూరితంగా మరో కేసు నమోదు చేయించింది. తాను హైదరాబాద్‌లో ఉంటున్నానని, నేరమూ అక్కడే జరిగిందని ఆరోపిస్తున్న వ్యక్తి అక్కడ ఫిర్యాదు చేయకుండా.. మంగళగిరి వచ్చి మరీ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేయడాన్ని బట్టే ఇది ఎంత పెద్ద కుట్రో, దాని వెనుక ఉన్నదెవరో అర్థమవుతోంది. ఆ ఫిర్యాదులో మార్గదర్శిపై యూరిరెడ్డి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు.

వారి విజ్ఞప్తి మేరకే షేర్ల కొనుగోలు

జి.జె.రెడ్డి అనే వ్యక్తి 1962లో మార్గదర్శిలో పెట్టిన రూ.5 వేల పెట్టుబడికి సంబంధించిన 90 షేర్లను (బోనస్‌ షేర్లతో కలిపి 288 షేర్లను) ఆయన కుమారుల విజ్ఞప్తి మేరకు మార్గదర్శి సంస్థ కంపెనీ వారిలో ఒకరి పేరు మీద బదిలీ చేసింది. వారికి చెందాల్సిన రూ.39.74 లక్షల డివిడెండ్‌కు చెక్కు ఇచ్చింది. దాన్ని జి.జె.రెడ్డి కుమారుడు యూరిరెడ్డి వెంటనే నగదుగా మార్చుకున్నారు. యూరిరెడ్డి, ఆయన సోదరుడి విజ్ఞప్తి మేరకు వారి పేరు మీదున్న షేర్లను మార్గదర్శి సంస్థ ప్రమోటర్లు 2016లో కొన్నారు. ప్రతిఫలంగా వారికి రూ.2.88 లక్షల చెక్కును అందజేశారు. అయితే ఆ చెక్కును యూరిరెడ్డి నగదుగా మార్చుకోలేదు. కొన్ని సందేహాలను లేవనెత్తుతూ లేఖ రాశారు. వాటన్నింటినీ నివృత్తి చేస్తూ కంపెనీ వెంటనే బదులిచ్చింది. ఏడేళ్లుగా మౌనంగా ఉన్న యూరిరెడ్డిని ఇప్పుడు సీఐడీ ట్రాప్‌ చేసి, మార్గదర్శిపై తప్పుడు కేసు పెట్టించిందన్న భావన వ్యక్తమవుతోంది. 2016లో జరిగిన షేర్ల బదిలీ ప్రక్రియ నిబంధనల ప్రకారం, పూర్తి పారదర్శకంగా జరిగింది. యూరిరెడ్డి సోదరులిద్దరూ తమ న్యాయవాదిని సంప్రదించి, అన్ని విషయాల్నీ ఆకళింపు చేసుకుని, పూర్తి స్పృహతోనే షేర్ల విక్రయ ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ షేర్లు కొనుగోలు చేయాలన్న విజ్ఞప్తిని మన్నించినందుకు ఛైర్మన్‌ రామోజీరావుకు వారు ఈ-మెయిల్‌ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలిపారు.

మాట మార్చి... పచ్చి అబద్ధాలు

యూరిరెడ్డి ఫిర్యాదుతో ఈ నెల 13న ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలకు, 2017లో ఆయన చేసిన ఫిర్యాదులోని అంశాలకు మధ్య చాలా వైరుధ్యాలున్నాయి. షేర్ల బదిలీకి సంబంధించిన ఫారంపై అనుకోకుండా సంతకం చేశానని ఆయన అప్పట్లో చెప్పారు. గన్‌పాయింట్‌లో బెదిరించడంతో ట్రాన్స్‌ఫర్‌ డీడ్‌పై సంతకం చేయాల్సి వచ్చిందని ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. షేర్ల ట్రాన్స్‌ఫర్‌కు (కంపెనీలోని ఒకరి షేర్లను మరొకరికి బదిలీ చేయడానికి) సంబంధించిన ఎస్‌హెచ్‌-4 పత్రంపై అది షేర్ల ట్రాన్స్‌మిషన్‌ (షేర్‌హోల్డర్‌ చనిపోతే చట్టప్రకారం వారి వారసులకు షేర్లు దఖలు పడేందుకు ఉద్దేశించిన) పత్రంగా భావించి సంతకం చేశానని ఆయన ఇప్పుడు చెప్పడం పచ్చి అబద్ధం.

ప్రమోటర్లను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు కుట్ర

2016లో జరిగిన షేర్ల బదిలీపై ఫిర్యాదుదారుకు అసంతృప్తి, అభ్యంతరాలేవైనా ఉంటే చట్టప్రకారం పరిష్కరించుకోవడానికి హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ లేదా ఎన్‌సీఎల్‌టీని సంప్రదించేవారే తప్ప.. ఏపీసీఐడీకి ఫిర్యాదు చేసేవారు కాదు. షేర్లు బదిలీ జరిగిన విషయాన్ని ఏడేళ్ల తర్వాత ఇప్పుడే గుర్తించినట్టుగా యూరిరెడ్డి ఫిర్యాదు చేయడమూ విడ్డూరంగానే ఉంది. మార్గదర్శి ప్రమోటర్లను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఇలా మోసపూరితంగా వ్యవహరిస్తున్న యూరిరెడ్డి, ఆయనను ఆడిస్తున్న ఏపీ సీఐడీపైనా న్యాయపరమైన చర్యలకు సంస్థ సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని