Btech Ravi: తెదేపా నేత బీటెక్‌ రవి అరెస్టు

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)ని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.

Updated : 15 Nov 2023 07:52 IST

పది నెలల క్రితం జరిగిన చిన్న గొడవపై కేసు
14 రోజుల రిమాండ్‌
అర్ధరాత్రి కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు

ఈనాడు, కడప: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)(Btech Ravi)ని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్‌ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దాదాపు పది నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. బీటెక్‌ రవి వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి కడప వస్తుండగా నంది మండలం వరకు ఫోన్‌లో అందుబాటులో ఉన్నారు. తర్వాత ఆయనతోపాటు.. డ్రైవరు, గన్‌మెన్‌, ఇతర సహాయకుల ఫోన్లు సైతం పని చేయలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పార్టీ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలోనే యోగి వేమన విశ్వవిద్యాలయం ఎదుట మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు గంట తర్వాత పోలీసుల అదుపులో ఉన్న గన్‌మెన్‌, డ్రైవర్‌, వ్యక్తిగత సహాయకులను వదిలిపెట్టి అందరి ఫోన్లను తిరిగిచ్చారు. దీంతో అదుపులోకి తీసుకున్నది పోలీసులేనని కుటుంబసభ్యులకు తెలిసింది. తర్వాత రవిని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి అక్కడ నుంచి కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రికి రాత్రి పది గంటలకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు.

అందుబాటులో లేరనే..

పది నెలల కిందట కడప విమానాశ్రయం దగ్గర ఆందోళన చేసినందుకు బీటెక్‌ రవిని అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ షరీఫ్‌ తెలిపారు. మంగళవారం రాత్రి విలేకర్లతో మాట్లాడుతూ విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్‌ఐకి గాయాలయ్యాయని, దానిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు వివరించారు. పది నెలలుగా బీటెక్‌ రవి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు అరెస్టు చేశామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని