Kadapa: మృతదేహానికి చీమలు.. చీమల మందు తెచ్చుకొమ్మన్న సిబ్బంది!

పోస్టుమార్టం గదిలోని ఫ్రీజర్‌బాక్స్‌లో ఉంచిన బాలిక మృతదేహానికి చీమలు పట్టడంపై బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Updated : 31 Jan 2024 07:58 IST

శవపరీక్ష గదిలో ఇదీ దుస్థితి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: పోస్టుమార్టం గదిలోని ఫ్రీజర్‌బాక్స్‌లో ఉంచిన బాలిక మృతదేహానికి చీమలు పట్టడంపై బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సంఘటన వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో మంగళవారం చోటుచేసుకుంది. ఈ నెల 29న జమ్మలమడుగు బీసీ కాలనీలో 16 ఏళ్ల బాలిక ఇంట్లో ఉరేసుకుంది. జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్ష అదే రోజు చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో మరుసటి రోజుకు వాయిదాపడింది. మృతదేహాన్ని ఆసుపత్రిలోని ఫ్రీజర్‌లో ఉంచారు. కుటుంబీకులు మంగళవారం ఉదయం వచ్చి చూడగా మృతదేహాన్ని చీమలు చుట్టుముట్టి కనిపించాయి. దీనిపై వారు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. చీమల మందు తెచ్చుకుని శుభ్రం చేసుకోవాలని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బంధువులు వాపోయారు. సిబ్బంది వైఖరిని నిరసిస్తూ ఆసుపత్రి ఆవరణలో వారు బైఠాయించారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఫీక్‌పాషాను వివరణ కోరగా మృతదేహాన్ని ఉంచే సమయంలో ఫ్రీజర్‌ బాగానే ఉందని తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని