సొంత గొప్పల జగన్‌.. మంచినీళ్లు ఏవి?

ఒక్క అవకాశమిస్తే... అంతా మార్చేస్తానని... అందరినీ ఆదుకుంటానని పాదయాత్రలు చేసి ప్రమాణం చేసిన వ్యక్తి... మార్చటం మాట అటుంచి... మంచినీళ్లయినా ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు!

Updated : 18 Apr 2024 16:42 IST

ఒక్క అవకాశమిస్తే... అంతా మార్చేస్తానని... అందరినీ ఆదుకుంటానని పాదయాత్రలు చేసి ప్రమాణం చేసిన వ్యక్తి... మార్చటం మాట అటుంచి... మంచినీళ్లయినా ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు! ఈ మాట విపక్షాలది కాదు... వైకాపా వారే ధర్నాలు చేసి మరీ చెబుతున్నారు! జగనన్నపాలనకు ఇంతకంటే అద్దం ఏం కావాలి?


గొంతెండిపోతోంది మహాప్రభూ... గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే- ‘ఆ సంగతి తరవాత కానీ, ముందు నా గొప్పలు వినండి’ అన్నట్టు ఎవరు ప్రవర్తించగలరు? అనుమానమేముంది- ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి తప్ప ఇంకెవరూ అలా చేయరు... చేయలేరు! రక్షిత నీటి పథకాలతో ప్రతి ఊరి దాహార్తినీ తీరుస్తానన్న జగన్‌ హామీలన్నీ గంగ పాలయ్యాయి. తాగునీటికోసం పల్లెలూ పట్టణాలూ తల్లడిల్లిపోతున్నాయి. కలుషిత జలాలతో జనం ప్రాణాలే పోతున్నాయి. అయిదేళ్లుగా అదేమీ పట్టించుకోని జగన్‌- ఇప్పుడు యుద్ధం, సిద్ధం అంటూ ఎన్నికల జాతరలో పోతురాజు విన్యాసాలు చేస్తున్నారు.


తాగునీటికి నిధులివ్వని జగన్‌

నిషి బతకాలంటే నీళ్లు కావాలి. తాగేందుకు పనికొచ్చే నీళ్లు కావాలి. 21వ రాజ్యాంగ అధికరణ ప్రకారం- పౌరులు అందరికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సింది ప్రభుత్వమేనని దిల్లీ హైకోర్టు మూడేళ్ల క్రితం తీర్పిచ్చింది. ఆ మేరకు బాధ్యతల నిర్వహణలో సీఎంగా జగన్‌ విఫలమయ్యారని చెప్పడం చాలా చిన్న మాట! ఊరు తగలబడిపోతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తికి నకలు జగన్‌మోహన్‌రెడ్డి. తాగడానికి కాస్త శుభ్రమైన నీళ్లకోసం జనం అల్లాడిపోతుంటే- జగన్‌ చిద్విలాసాలు చిందిస్తూ కూర్చున్నారు. నీళ్లకోసం కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచిపోతున్న సామాన్యుల వెతలు ఆయనకు పట్టలేదు. పైగా గత తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టిన పనులకూ జగన్‌ మోకాలడ్డుపెట్టారు. పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చేందుకు తెదేపా సర్కారు అప్పట్లో నడుంకట్టింది. లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ.400 కోట్ల అంచనా వ్యయంతో పనులు ఆరంభించింది. ప్రాజెక్టు వ్యయంలో ‘ఆసియా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంక్‌’ 70శాతం నిధులు సమకూరుస్తుంది. మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ ఒప్పందంతో రంగంలోకి దిగిన నాటి సర్కారు- 35శాతం పనులను పూర్తిచేసింది. లక్షకు పైబడిన జనాభా కలిగిన పట్టణాల గొంతు తడిపేందుకు చంద్రబాబు సర్కారు ‘అమృత్‌’ పథకం కింద రెండున్నర వేల కోట్ల రూపాయల పనులను చేపట్టింది. 35శాతానికి పైగా పనులను చకాచకా ఒక కొలిక్కి తెచ్చింది. అంతలోనే ప్రభుత్వం మారిపోయింది. వాగ్దానాల వరద పారించిన జగన్‌ సీఎం అయ్యారు. అధికారాన్ని దక్కించుకున్నారు కానీ, తాగునీటి ఇక్కట్లనుంచి ప్రజలకు విముక్తి కలిగించాలనే సత్సంకల్పం ఆయనలో ఏ కోశానా లేకుండా పోయింది. అందుకే గత తెదేపా ప్రభుత్వం చేపట్టిన రెండు ప్రాజెక్టులకూ నిధులు బిగబట్టేశారు జగన్‌. ఖాళీ బిందెలతో ఊరూరా మహిళలు రోడ్డెక్కాల్సిన దుర్గతిని సృష్టించారు.


కేంద్ర పథకానికీ మోకాలడ్డు

‘‘కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ తగ్గాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని నడిపించాల్సి వచ్చింది’’ అని అంటూ అక్కడకేదో సీఎంగా తాను తెగ కష్టపడిపోయినట్లు ఇటీవల మాట్లాడారు జగన్‌. నిజానికి కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర వాటా సొమ్ములను ఇవ్వకుండా కీలక పథకాలను నిరర్థకం చేశారాయన. దీనికి ఉదాహరణ- ‘జల్‌ జీవన్‌ మిషన్‌’(జేఎంఎం). 2024 నాటికల్లా గ్రామీణ భారతంలో ఇంటింటికీ కుళాయిల ద్వారా మంచినీళ్లు ఇవ్వడానికి 2019 ఆగస్టులో కేంద్రం ‘జేఎంఎం’ను ప్రారంభించింది. అందులో భాగంగా ఏపీ పల్లెల్లో 64.70 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అందుకయ్యే ఖర్చులో కేంద్రం సగం భరిస్తే- మిగిలింది రాష్ట్రం వంతు. దాని ప్రకారం ‘జేఎంఎం’కు కేంద్రం ఎప్పటికప్పుడు సొమ్ములిచ్చింది. వాటికి తనవంతు నిధులను కలిపి పనులను వేగంగా పూర్తిచేయించాల్సిన జగన్‌- ఆ బాధ్యతను గాలికొదిలేశారు. దానిపై కేంద్ర జల్‌శక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ 2022లోనే మండిపడ్డారు. జల్‌జీవన్‌ మిషన్‌ అమలులో ఏపీ చాలా వెనకబడిందని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూస్తుంటే వచ్చే ఇరవై ఏళ్లకైనా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదని కేంద్ర మంత్రి దుమ్మెత్తిపోశారు. నిరుడు జులైలో రాజ్యసభ వేదికగా గజేంద్ర సింగ్‌ మరోసారి వైకాపా ప్రభుత్వ బాధ్యతారా హిత్యాన్ని ఎండగట్టారు. ‘‘2021 తరవాత జేఎంఎంకు కేంద్రం కేటాయించిన నిధుల్లో రూపాయి కూడా వినియోగించుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అత్యంత దుఃఖంతో ఈ సభ దృష్టికి తెస్తున్నా’’ అని కేంద్ర మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీ గొంతు పిసికిన జగన్‌ దౌర్భాగ్య పాలనకు ఇంతకంటే సాక్ష్యమేమి కావాలి?


జగన్‌ కోతలు... నీటిపైరాతలు!

తెలంగాణ, హరియాణా, గుజరాత్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు జల్‌జీవన్‌ మిషన్‌లో నూటికి నూరుశాతం లక్ష్యాలను సాధించాయి. బిహార్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర తమిళనాడు తదితరాలు 80-96శాతం పనులను పూర్తిచేసేశాయి. ‘జేఎంఎం’ లక్ష్యాల సాధనలో ఏపీ ఏమో ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, అసోం వంటి వాటికన్నా వెనకబడింది. అలా జల్‌జీవన్‌ మిషన్‌ జీవం తీసేసిన జగన్‌ పుణ్యమా అని అనేక పల్లెల్లో తాగునీరు లేక జనం నోళ్లు పిడచకట్టుకుని పోతున్నాయి. ‘‘గ్రామాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి. వాటర్‌గ్రిడ్‌ పనులు మూడు దశల్లో పూర్తిచేయాలి’’ అని సీఎం అయిన కొత్తలో జగన్‌ పెద్ద పనిమంతుడిలా అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేతప్ప వాటర్‌గ్రిడ్‌ పనులను మాత్రం ఆయన పూర్తిచేయించలేదు. ‘‘కాలువల పక్కనే ప్రతి ఊరికీ సమ్మర్‌ స్టోరేజి ట్యాంకులను నిర్మిస్తా. కాలువలకు నీళ్లు రాగానే ఆ ట్యాంకులలో నింపిస్తా. రక్షిత నీటి పథకం ద్వారా మంచినీరు అందించేలా చూస్తాం. ప్రతి ఊళ్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ కట్టిస్తాం’’- జగన్‌కు గుర్తోందో లేదో కానీ, ఇవన్నీ ప్రతిపక్షనేతగా ఆయన ఇచ్చిన హామీలే. అన్నీ నీటిపైరాతలే! కొత్త మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల సంగతి దేవుడెరుగు కానీ- తెదేపా హయాంలో నిర్మితమైన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాలనూ చాలాచోట్ల పాడు పెట్టించిన భ్రష్ట చరిత్ర జగన్‌ ప్రభుత్వా నిది!


పైప్‌లైన్లలో మురుగునీరు

మను తాము పొగుడుకోవాలంటే- ఎవరైనా సరే, సిగ్గు పడతారు. జగన్‌ మాత్రం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనుకుంటూ ‘‘విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే’’ లాంటి డైలాగులను డీటీఎస్‌ సౌండ్‌లో చెబుతుంటారు. నిజానికి జగన్‌కు అసలు లేనిదే విశ్వసనీయత. వాగ్దానాలను నెరవేర్చని ఆయనను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతామన్న వాస్తవం జనానికి ఎప్పుడో బోధపడింది. ‘‘నీటికాలుష్యంపై అప్రమత్తంగా ఉండాలి. ప్రతి జిల్లాలోనూ రోజూ నీటి నమూనాలను పరీక్షించాలి’’ అని రెండేళ్ల నాడు అధికారులను పురమాయించారు జగన్‌. ఎవరూ చూడకుండా ఎదుటి మనిషి గుండెల్లో కత్తి దింపేసి... అందరూ పోగయ్యాక ఏమీ తెలియనట్టు ‘పదండి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్దాం’ అని హడావుడి చేశాడట వెనకటికెవడో! అతనికీ జగన్‌కూ పెద్ద తేడా ఏమీ లేదు. మురుగు కాల్వల మధ్యలోంచి, పక్కనుంచి వెళ్లే తాగునీటి పైప్‌లైన్లు చాలాచోట్ల పాతబడి పగిలిపోయాయి. వాటిలోకి మురికి నీళ్లు చేరి జనారోగ్యాన్ని జబ్బుల పాల్జేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అయిదువేల కిలోమీటర్లకు పైగా పొడవున తాగునీటి పైపులైన్లు అధ్వానంగా తయారయ్యాయి. వాటిని బాగు చేయించే తీరిక కూడా జగన్‌కు లేకపోయింది. అలాంటాయన నీటికాలుష్యం గురించి మాట్లాడటమంటే- అదే ఏపీ దౌర్భాగ్యం! అత్యవసరమైన చోట్ల పాత తాగునీటి పైప్‌లైన్ల మార్పిడికి గత తెదేపా ప్రభుత్వం చొరవ తీసుకుంది. క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరిట చేపట్టిన ఆ పనులు జగన్‌ జమానాలో పడకేశాయి. ‘ఆసియా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంక్‌’ సాయంతో 7800 కిలోమీటర్ల మేరకు కొత్త పైప్‌లైన్ల ఏర్పాటుకు తెదేపా సర్కారు అప్పట్లో శ్రీకారం చుట్టింది. జగన్‌ ఏలుబడిలో అదీ సాకారం కాలేదు. తాగునీటి పథకాల నిర్వహణకు జగన్‌ సర్కారు సక్రమంగా నిధులు ఇవ్వలేదు. గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న గుత్తేదారులకు బిల్లులనూ భారీగా పేరపెట్టింది. ఇలా అన్నింటికీ ఖాళీ చేతులు చూపించిన జగన్‌- ప్రజల తాగునీటి సమస్యలను తీర్చకపోగా, వాటిని ఇంకా రెట్టింపు చేశారు. గొంతు తడుపుకొనేందుకు  నీళ్లులేక కొన్నాళ్లుగా నానా అవస్థలు పడుతున్న తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ తాజాగా అనంతపురంలో ప్రజలు నిరసనకు దిగారు. వైకాపా కార్పొరేటర్లు కూడా వారితో కలిసి తాగునీటికోసం గళమెత్తడం- జగన్‌ జమానాలో జనం పాట్లకు ప్రత్యక్ష నిదర్శనం.


చనిపోతున్నా లెక్కలేదు!

మంచినీళ్లు అని చెప్పి- వాసన చూస్తే చాలు, వాంతొచ్చే మురుగునీటిని చాలాచోట్ల సరఫరా చేస్తున్నారు. దానిపై కాకినాడ జిల్లా సామర్లకోటలో వైకాపా నాయకులే ఆందోళన చేశారు. దుర్వాసనతో కూడిన పసరు రంగు నీళ్లతో జనం రోగాల పాలవుతున్నారని, యంత్రాంగానికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ సామర్లకోట వైకాపా కౌన్సిలర్లు ఆమధ్య ఆమరణ దీక్షకు కూర్చున్నారు. జనం ప్రాణాల పట్ల పట్టింపులేని జగన్‌ పాలనా శైలికి ఇదో ఉదాహరణ. నిరుడు అనంతపురం జిల్లా బేలోడులో తాగునీటి పైపులైన్‌లోకి చేరిన మురుగునీరు- 33 మంది ఆరోగ్యాలను దెబ్బతీసి, ఒకరి ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. అంతకు ముందు సంవత్సరం నంద్యాల జిల్లా జి.జంబులదిన్నెలో తాగునీటి కాలుష్యం ధాటికి మూడు రోజుల్లో ముగ్గురు కడతేరిపోయారు. మరో ముప్ఫై మందికి పైగా రోగాల బారినపడ్డారు. కొద్దిరోజుల క్రితం గుంటూరులో నీరే విషమై నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. వాంతులూ విరేచనాలతో అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారు. జగన్‌ సర్కారు జనాన్ని ఎంతగా ఉద్ధరించిందంటే- ఆఖరికి తాగునీటి ట్యాంకులను సరిగా శుభ్రం కూడా చేయించలేదు. మొత్తమ్మీద తాగునీటి పథకాలను ఎండగట్టిన జగన్‌ పాపం- వేసవికంటే మునుపే బిందెడు మంచినీటికోసం జనం అలమటించాల్సిన దారుణ స్థితిని కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని