ఐదేళ్లూ షాక్‌.. ఎన్నికలని బ్రేక్‌!

పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్‌... విద్యుత్‌ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు.

Updated : 19 Mar 2024 08:31 IST

జగన్‌ పాలనలో ఆరుసార్లు విద్యుత్‌ ఛార్జీల పెంపు
ప్రజలపై రూ.18,817 కోట్ల భారం మోత
మళ్లీ పీఠమెక్కితే... తక్షణమే రూ.12,491 కోట్లు  పిండుకునే ప్రమాదం

గెలిపిస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమన్నారు...
ఇప్పటికే ఉన్న వాటినీ తగ్గిస్తామన్నారు...
ఒక్కసారి అవకాశమివ్వాలని వేడుకున్నారు...
తమపై భారం తగ్గుతుందేమోనని ప్రజలూ ఆశ పడ్డారు...
ఈవీఎంలపై వారు ఒక్కసారి మీట నొక్కితే...
పీఠమెక్కిన ఈయనేమో ఆరుసార్లు నొక్కారు...
భారం తగ్గించేందుకు కాదు... ఛార్జీలు పెంచేందుకు...!  
మరోసారి బాదడానికి అడుగులేసినా...
వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారు...!

పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్‌... విద్యుత్‌ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీల భారం పడిందని... తాను అధికారంలోకి వచ్చాక భారాన్ని తగ్గిస్తానంటూ జగన్‌ నమ్మబలికారు. అధికారం చేపట్టిన మొదటి ఏడాదే పేదలు, సామాన్యులు, పరిశ్రమలు.. అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు షాక్‌ ఇచ్చారు. జగన్‌... ఐదేళ్లలో పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తెలిస్తే నిజంగా షాక్‌ తగులుతుంది. ఇప్పటికే వేసిన భారాలు అక్షరాలా రూ.18,817.73 కోట్లు. ఇంకా మోపబోయే భారాల ప్రతిపాదన మరో రూ.12,491 కోట్లుగా తేలింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదనలను వ్యూహాత్మకంగా పక్కన పెట్టారు. 


బాదుడు-1 రూ.5,200 కోట్లు

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలకు 500 యూనిట్లకు మించి వినియోగించే వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపింది. యూనిట్‌కు 90 పైసలు పెంచి ఏటా రూ.1,300 కోట్ల అదనపు భారం వేసింది. ఇలా నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు వసూలు చేసింది. 


బాదుడు-2 రూ.1,800 కోట్లు

ఇదో కంటికి కనిపించని బాదుడు. ఛార్జీలు పెంచలేదు. అలాగని ఆదాయం రాకుండా లేదు. గృహ, ఎల్‌టీ వాణిజ్య విద్యుత్‌ వినియోగదారులపై స్థిర ఛార్జీల భారాన్ని వేసింది. ఈ రూపంలో ఏటా రూ.600 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపి, మూడేళ్లలో రూ.1,800 కోట్లను వసూలు చేసింది. కనీస వినియోగ ఛార్జీలకు బదులు.. కాంట్రాక్ట్‌ లోడ్‌పై స్థిర ఛార్జీల కింద కిలోవాట్‌కు రూ.10 చొప్పున వసూలు చేసే విధానాన్ని 2021 ఏప్రిల్‌ నుంచి అమలు చేసింది. మూడు కిలోవాట్ల కాంట్రాక్ట్‌ లోడ్‌ తీసుకున్న సింగిల్‌ ఫేజ్‌ కనెక్షన్‌ వినియోగదారుల నుంచి ప్రతినెలా రూ.30, త్రీఫేజ్‌ కనెక్షన్‌ వినియోగదారుల నుంచి కనీస కాంట్రాక్ట్‌ లోడ్‌ అయిదు కిలోవాట్లపై రూ.50 చొప్పున ప్రతినెలా బిల్లులో కలిపి వసూలు చేసింది. 


బాదుడు-3 రూ.2910.74 కోట్లు

2014-19 సంవత్సరాల మధ్య వినియోగించిన విద్యుత్‌కు ట్రూఅప్‌ (విద్యుత్‌ వాస్తవ సరఫరా వ్యయం... వినియోగదారుల నుంచి ప్రతినెలా బిల్లుల రూపేణా వసూలు చేసిన మొత్తానికి మధ్య వ్యత్యాసం) కింద రూ.2910.74 కోట్లు వసూలు చేస్తోంది. ప్రతిపాదించిన మొత్తంలో ఇప్పటికే రూ.1,455.37 కోట్లు వసూలు చేసింది.


బాదుడు-4 రూ.3,082.99 కోట్లు 

2021-22లో వినియోగించిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.3,082.99 కోట్ల భారం వేసింది. ఈ మొత్తాన్ని 2023 ఏప్రిల్‌ నుంచి 12 వాయిదాల్లో వసూలుకు డిస్కంలకు అనుమతించింది. అవి గత ఏప్రిల్‌ నుంచి 10 నెలల్లో రూ.2,569.16 కోట్లు వసూలు చేశాయి.


బాదుడు-5 రూ.2,944 కోట్లు

విద్యుత్‌ ఛార్జీల పెంపు.. శ్లాబ్‌ల్లో మార్పులు చేసి ఏటా     రూ.1,400 కోట్ల ఛార్జీల భారాన్ని 2022 ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం వేసింది. అప్పట్లో సగటు విద్యుత్‌ వినియోగం రోజుకు 190 ఎంయూలుగా ఉంది. ప్రస్తుతం రోజుకు సగటున 200 ఎంయూలకు చేరింది. ఈ లెక్కన ఏటా అదనంగా పెరిగిన 3,600 ఎంయూల వినియోగంపై ఛార్జీల భారం కలిపితే పెంపు మొత్తం రూ.1,544 కోట్లకు చేరింది. గత రెండేళ్లలో రూ.2,944 కోట్ల భారం వినియోగదారులపై పడింది.


బాదుడు-6 రూ.2880 కోట్లు

2023 ఏప్రిల్‌ నుంచి ప్రతినెలా విద్యుత్‌ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో (ఎఫ్‌పీపీసీఏ) యూనిట్‌కు 40 పైసల చొప్పున ఆ తర్వాత నెల బిల్లులో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ప్రతినెలా సగటు విద్యుత్‌ డిమాండ్‌ 200 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ)గా పరిగణిస్తే.. నెలకు రూ.240 కోట్ల లెక్కన ఏడాదికి పడుతున్న భారం రూ.2880 కోట్లు.


ఓట్లు వస్తున్నాయని కాసుల వేటకు విరామం

  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో టారిఫ్‌, శ్లాబ్‌ల పెంపు ద్వారా ఇప్పటికే రూ.1,400 కోట్ల భారం వేసిన డిస్కంలు... మరో రూ.7,200 కోట్లను ట్రూఅప్‌ కింద వసూలు చేసుకోడానికి అనుమతించాలని ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదించాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రతిపాదనను  ఏపీఈఆర్‌సీ పక్కన పెట్టింది.
  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌పీపీసీఏ కింద ప్రతి యూనిట్‌కు రూ.1.10 చొప్పున డిస్కంలు ఖర్చు చేశాయి. నిబంధన మేరకు అందులో యూనిట్‌కు గరిష్ఠంగా 40 పైసలు గత ఏడాది ఏప్రిల్‌ నుంచి బిల్లులో కలిపి వసూలు చేశాయి. డిస్కంల ప్రతిపాదన ప్రకారం సుమారు రూ.5,040 కోట్లు ట్రూఅప్‌ భారాన్ని ప్రజలపై వేసే అవకాశముంది.
  • 2024-25లో రైల్వేలకు ఛార్జీల పెంపు, విద్యుత్‌ ఛార్జింగ్‌ కేంద్రాలకు ఇచ్చే రాయితీ ఉపసంహరణ ద్వారా మరో రూ.251 కోట్ల భారం వేయాలని డిస్కలు ప్రతిపాదించాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణను ఏపీఈఆర్‌సీ పూర్తి చేసింది. త్వరలో అమలవుతుంది. అంటే వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల నుంచి మరో రూ.12,491 కోట్లను వసూలు చేసే ప్రమాదం ఉంది.

ప్రణాళికతో మోసం

విద్యుత్‌ ఛార్జీల భారాలను ప్రజలపై మోపే విషయంలో జగన్‌ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించింది. అన్ని వర్గాలపై ఒకేసారి ఛార్జీల భారం వేస్తే.. అంతా ఒకేసారి గగ్గోలు పెడతారని గ్రహించి, ఒక్కో ఏడాది ఒక కేటగిరీని లక్ష్యంగా చేసుకుంది. ఇలా ఐదేళ్లూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే వచ్చింది. మరోవైపు సంక్షేమం పేరిట బటన్‌ నొక్కి ఆదుకుంటున్నామంటూ ప్రజలను మభ్యపెడుతోంది.

 ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని