ఐప్యాక్‌ డైరెక్షన్‌లో.. జగన్‌ ప్రాయోజిత భజన

జగన్‌ భజన పరాకాష్ఠకు చేరింది. ఎంతగా అంటే.. తమకు కుమారులు, కోడళ్లూ అవసరం లేదని, జగన్‌ ఉంటే చాలని సదస్సులకు హాజరైన వారితో చెప్పించారు. కొందరిని ఎంపిక చేసి.. వారు ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో కూడా ఎప్పటికప్పుడు ఐప్యాక్‌ ద్వారా శిక్షణ ఇప్పించారు.

Updated : 09 Apr 2024 13:14 IST

కరోనా సమయంలో మాంసం ఇచ్చారట.. నెహ్రూ కంటే జగన్‌ గొప్పవారట
కన్నబిడ్డలు, కోడళ్లూ అవసరం లేదట.. జగన్‌ ఉంటే చాలట
వారించకుండా చిక్కటి చిరునవ్వుతో మురిసిపోయిన సీఎం
తనపై పొగడ్తలు.. చంద్రబాబుపై దూషణలు, శాపనార్థాలు
ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో అంతా ప్రత్యేక శిక్షణ
‘పింఛనుదారులతో సీఎం ముఖాముఖి’ అసలు రంగు ఇదీ

ఈనాడు, అమరావతి: జగన్‌ భజన పరాకాష్ఠకు చేరింది. ఎంతగా అంటే.. తమకు కుమారులు, కోడళ్లూ అవసరం లేదని, జగన్‌ ఉంటే చాలని సదస్సులకు హాజరైన వారితో చెప్పించారు. కొందరిని ఎంపిక చేసి.. వారు ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో కూడా ఎప్పటికప్పుడు ఐప్యాక్‌ ద్వారా శిక్షణ ఇప్పించారు. ఎక్కడైనా పదాలు మర్చిపోయినా, తడబడినా.. ఆ సంస్థ ప్రతినిధులు పక్కనే ఉండి మాటలు అందించారు. జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల్లో ముంచేశారు.. చంద్రబాబుపై దూషణలు, శాపనార్థాలతో విరుచుకు పడ్డారు. ‘పింఛనుదారులతో సీఎం ముఖాముఖి’ అంటూ ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జరిగిందిదే. ఇప్పటి వరకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభల్లో ప్రతిపక్ష నేతను హంతకుడని విమర్శిస్తూ జగన్‌ మాట్లాడారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఆదివారం ఆయనకు నోటీసు కూడా ఇచ్చింది.

దీంతో ఈ సదస్సులో ఎంపిక చేసిన వారితో చంద్రబాబుపై దూషణలు చేయిస్తూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వేడుక చూశారు. ‘చంద్రబాబు మట్టికొట్టుకుని పోతారు..’, ‘ఎక్కువ రోజులు బతకరు, మామలాగే ఆయనా పోతారు’, ‘మా ఉసురు తగులుతుంది’ అంటూ శాపనార్థాలు పెడుతుంటే జగన్‌ ఉబ్బితబ్బిబ్బయ్యారు. వాలంటీర్లంతా దేవునిదూతలుగా మీ రూపంలో వచ్చి పింఛను ఇచ్చారంటూ కొందరు ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతుంటే పొంగిపోయారు. చాలా బాగా మాట్లాడారంటూ వారందరినీ జగన్‌ ప్రశంసించారు. ప్రతిపక్ష నేతను దూషిస్తుంటే వారించాల్సిన బాధ్యత సీఎంకు లేదా? ఇదేం రాజకీయం? అనే ప్రశ్నలు వైకాపా నేతల్లోనే విన్పించాయి. సదస్సుకు హాజరైన వారిలో కొందరు జగన్‌తో మాట్లాడుతూ తాము వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి బంధువులమని చెప్పడం గమనార్హం. నాలుగున్నరేళ్లుగా వైకాపాలో పనిచేస్తున్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని కొందరు సీఎంకు వివరించే ప్రయత్నం చేసినా.. ఆయన పట్టించుకోలేదు.

‘మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు. మోసాలు చేయలేడు’ అంటూ జగన్‌ విధేయత ఒలికించారు. ‘పథకాలకు సంవత్సరానికి రూ.70వేల కోట్లు ఇవ్వడం జగన్‌కే చాలా కష్టంగా ఉంటే.. రూ.1.40లక్షల కోట్లు ఇస్తామని చంద్రబాబు సునాయాసంగా చెబుతుంటే అర్థం ఏమిటి? అందర్నీ మోసం చేయడానికే కదా?’ అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. మద్య నిషేధం చేశాకే వచ్చి ఓట్లడుగుతానన్న హామీ సంగతేంటి? ఇది మోసం చేయడం కాదా? వాలంటీరు వ్యవస్థ రద్దు కాకున్నా.. రద్దు చేశారని, మళ్లీ వస్తే తొలి సంతకం చేస్తానని చెప్పడం అబద్ధం కాదా? అడుగడుగునా.. అబద్ధాలు, మోసాలతోనే సిద్ధం యాత్ర సాగుతుందనే సంగతి సామాన్యుడికి సైతం అర్థమైంది. అందుకే ప్రకాశం జిల్లాలో ఆది, సోమవారాల్లో జరిగిన యాత్ర వెలవెలబోయింది.

కరోనా సమయంలో ఇంటింటికి మాంసం పంపారట

‘కరోనా సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మాంసంతో సహా అన్నీ గడప గడపకు పంపారట..’ జగన్‌ ప్రాయోజిత పింఛనుదారుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఒక మహిళ చెప్పిన విషయం ఇది. చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషిస్తూ తన ప్రసంగం ప్రారంభించిన ఆమె.. తర్వాత జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. వైకాపా తరఫున పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఆయన తల్లి వెంకాయమ్మ తమ ఇళ్లకు వచ్చి వంట చేసుకుంటున్నామో లేదో కూడా చూస్తున్నారని చెప్పారు. ‘వాలంటీరు వ్యవస్థ కావాలి.. తీసేస్తే ఒప్పుకోం. నా కన్నబిడ్డ కూడా కూడు పెట్టడం లేదు’ అని పేర్కొన్నారు. తనకు మాట్లాడటం రాదని, చదువులేదని చెప్పారు. మరికొందరు తమకు కుమారులు, కోడళ్లు కూడా అవసరం లేదని జగన్‌ ఉంటే చాలంటూ భజన చేశారు.

నెహ్రూ కంటే జగనే గొప్పవారట..

‘నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడు.. భూపేష్‌ గుప్తా, డాంగే, చండ్ర రాజేశ్వరరావు తదితర నలుగురు మేధావులు ప్రతిపక్షంలో ఉండేవారు. వారు ఆలోచించుకుని పది, పన్నెండు అడిగితే అందులో నెహ్రూ ఒకటి, రెండు పథకాలే చేసేవారు. జగన్‌ సొంతంగా వంద సంక్షేమ పథకాలు ప్రకటించి 98 చేశారు. అప్పట్లో నలుగురు మేధావులు కలిసి ఆలోచించి అడిగేవారు. ఇప్పుడు జగన్‌కు ఎవరు చెప్పారు? అన్నీ ఆయన బంగారపు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే.. ఇలాంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం’ అని వృద్ధుడు ఒకరు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని