సంక్షిప్త వార్తలు (7)

ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మే మొదటి వారంలో ఒకరోజు సాధారణ సెలవుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం విజ్ఞప్తి చేశారు.

Updated : 20 Apr 2024 06:38 IST

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం సిబ్బందికి సెలవు ప్రకటించాలి
సీఈవోను కోరిన ఉద్యోగ సంఘాల నేతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మే మొదటి వారంలో ఒకరోజు సాధారణ సెలవుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా సిబ్బందిని వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రం వద్దకు ముందురోజు మధ్యాహ్నంలోగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదు, జారీ ప్రక్రియపై కొంతమంది అధికారుల్లో ఉన్న అనుమానాలను తొలగించేలా ఎన్నికల సంఘం తగు సూచనలు చేయాలని కోరారు.


గ్రామ, వార్డు సచివాలయశాఖకు ఎమ్మెల్వోలతో సంబంధం లేదు

ఈనాడు, అమరావతి: వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకంటూ ఎమ్మెల్వోల నియామకానికి సంబంధించి ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీతో గ్రామ, వార్డు సచివాలయశాఖ చేసుకున్న ఒప్పందం ఈ ఏడాది ఫిబ్రవరి 29తోనే ముగిసినట్టు ఆశాఖ వెల్లడించింది. ఎఫ్‌వోఏతో.. అందులో పనిచేసే ఎమ్మెల్వోలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది.


29 నుంచి గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు
వాయిదా వేయాలని కోరుతున్న ఉద్యోగులు

ఈనాడు, అమరావతి: విద్యార్థులకు గ్రంథాలయాల్లో ఈ నెల 29 నుంచి జూన్‌ 7 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించాలని పౌర గ్రంథాలయాల శాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రంథాలయాలకు అనుసంధానం చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు సూచనలివ్వాలని పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులు వేసవి శిబిరాలకు వచ్చేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కళ్లెపల్లి మధుసూదనరాజు, పి.కమ్మన్న డిమాండ్‌ చేశారు. గ్రంథాలయ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులు వేశారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో వేసవి శిబిరాలు నిర్వహించడం మంచిది కాదని పేర్కొన్నారు.


బాలల హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఫిర్యాదు చేస్తే విచారిస్తాం
బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు, ఇతర అధికారులు బాలల హక్కులను ఉల్లంఘించినట్లు ఫిర్యాదు అందలేదని, ఈ ఘటనలో నిందితులిద్దరు మేజర్లని బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే సుమోటోగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం పై దాడి ఘటనలో ఉల్లంఘనలు జరిగినట్లు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని తెలిపారు. రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా వ్యవస్థలు పనిచేస్తాయని దీనికి ఎవరూ అతీతులు కాదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం పరిధిలో మాత్రమే బాలల హక్కుల కమిషన్‌ పనిచేస్తుందని వెల్లడించారు. కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులు, సమస్యలపై విచారణ చేపట్టి, వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామన్నారు.


22న డీఈ సెట్‌ ప్రకటన

ఈనాడు, అమరావతి: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు నిర్వహించే డీఈ సెట్‌-24కు ఈ నెల 22న ప్రకటన విడుదల చేయనున్నట్లు కమిషనర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు డైట్‌ కళాశాలల్లో ప్రవేశాలు, సమాచార బులెటిన్‌ను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు వెల్లడించారు.


విద్యార్థులను ప్రలోభపెట్టే ప్రయత్నమేనా..?
26న ఏయూలో ‘అచీవర్స్‌ డే’ నిర్వహణకు ప్రణాళిక

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రలోభపెట్టేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏయూ సైన్స్‌, టెక్నాలజీ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు. వారిని సన్మానించేందుకు ఈనెల 26న ‘అచీవర్స్‌ డే’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ఎంపికైన విద్యార్థులు, తల్లిదండ్రులను ఆహ్వానించి వారి సమక్షంలో విద్యార్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 800 మంది హాజరయ్యే అవకాశముంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేసే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


రికార్డు స్థాయిలో ట్రాక్‌ పునరుద్ధరణ

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో చేపట్టినట్లు ద.మ.రైల్వే తెలిపింది. జోన్‌ పరిధిలో 649 కి.మీ.ట్రాక్‌ని పునరుద్ధరించినట్లు తెలిపింది. 2022-23 తో పోలిస్తే 45 శాతం అధికం అని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వేసవి కాలంలో జోన్‌ పరిధిలో 1079 ట్రిప్పుల అదనపు రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు ఏప్రిల్‌, మే నెలల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని