దాల్మియాకు చుక్కెదురు

జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్‌, పునీత్‌ దాల్మియాలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

Updated : 01 May 2024 06:45 IST

ఈడీ నోటీసుల చెల్లుబాటుపై ఉత్తర్వులివ్వలేం
జగన్‌ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో తేల్చిచెప్పిన తెలంగాణ హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్‌, పునీత్‌ దాల్మియాలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో విచారణ నిమిత్తం మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 50 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేయగా, వాటి చట్టబద్ధతను సవాలు చేస్తూ దాల్మియా సిమెంట్‌ భారత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని ఎండీ పునీత్‌దాల్మియాలు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉమ్మడి కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల్లో 407.05 హెక్టార్లను లీజుకు అక్రమ పద్ధతుల్లో దాల్మియాకు కట్టబెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన రఘురాం సిమెంట్స్‌లో రూ.95 కోట్లను వారు పెట్టుబడులుగా పెట్టారు. అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా దాల్మియాకు ప్రభుత్వం చేసిన మేలు, ప్రతిఫలంగా పెట్టిన పెట్టుబడులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించి మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 50 కింద నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్‌ కింద ఈడీ అధికారికి సివిల్‌ కోర్టు హోదా లభిస్తుండటంతో ఎవరినైనా పిలిపించి ప్రశ్నించడానికి అధికారం ఉంది. ఈ సెక్షన్‌ కింద అనుమానితుల ద్వారానే నిజం తెలుసుకునే అవకాశం ఉందని, కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాల్మియా..పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ విజయ్‌మదన్‌ చౌదరి కేసులో సెక్షన్‌ 50ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు 2022లో తీర్పు వెలువరించిందన్నారు. అదే తీర్పు ప్రస్తుత కేసుకూ వర్తిస్తుందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్నధర్మాసనం.. సుప్రీం తీర్పు నేపథ్యంలో దీనిపై తదుపరి ఉత్తర్వులు అవసరం లేదంటూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది.

మిగిలింది రెండు కేసులే: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ 11 అభియోగ పత్రాలను దాఖలు చేయగా వీటి ఆధారంగా ఈడీ 9 అభియోగ పత్రాలు దాఖలు చేసింది. భారతి, దాల్మియా సిమెంట్స్‌లో ఈడీ అభియోగ పత్రాలు దాఖలు చేయలేదు. మరోవైపు పలు నోటీసులు, దర్యాప్తు ప్రక్రియపై దాల్మియా సిమెంట్స్‌ న్యాయస్థానాల్లో పిటిషన్‌లు దాఖలు చేస్తూ వస్తోంది. దీంతో దాల్మియా సిమెంట్స్‌లో ఇప్పటివరకు ఈడీ అభియోగ పత్రం దాఖలు చేయలేదు. భారతి సిమెంట్స్‌ వ్యవహారంలో ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసినా సాంకేతిక కారణాలతో ప్రత్యేక కోర్టు వెనక్కి పంపింది. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని