Adani: 2023 సవాళ్లను ‘అపూర్వమైన శక్తి’తో ఎదుర్కొన్నాం: అదానీ

Adani: 2023లో అదానీ గ్రూప్‌నకు అనేక సవాళ్లు ఎదురయ్యాయని.. వాటిని దీటుగా ఎదుర్కొన్నామని ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు.

Published : 02 Jan 2024 14:02 IST

దిల్లీ: 2023లో ఎదురైన అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) అన్నారు. అంతర్జాతీయ షార్ట్‌సెల్లర్‌ సహా వివిధ గ్రూపుల నుంచి వచ్చిన దాడులను తిప్పికొట్టగలిగామని తెలిపారు. గడ్డు పరిస్థితుల నుంచి తమ వ్యాపారం ‘అత్యద్భుత శక్తి’గా అవతరించిందని వ్యాఖ్యానించారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రూప్‌ (Adani Group) ఉద్యోగులకు పంపిన వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘సుమారు 12 నెలల క్రితం అంతర్జాతీయ షార్ట్‌సెల్లర్‌ నుంచి మా ప్రతిష్ఠకు అగ్నిపరీక్ష ఎదురైంది. ‘అదానీ’ (Adani Group) ప్రయోజనాలతో విభేదించే వివిధ సమూహాలు స్వలాభం కోసం షార్ట్‌సెల్లర్‌ ఆరోపణలను ఉపయోగించుకున్నాయి. దీంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. అవి అదానీ గ్రూప్‌ ప్రతిష్ఠకు మాత్రమే కాకుండా జాతీయ స్థాయి పాలనా విధానాలకు హాని కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని అదానీ తన సందేశంలో ఆరోపించారు.

ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, తమ వ్యాపారాల సమగ్రత, పాలనా విధానాలకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నుంచి పూర్తి మద్దతు లభించిందని అదానీ (Gautam Adani) చెప్పారు. తమ వైపు ఎలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు కమిటీ నివేదిక గుర్తించలేదన్నారు. తమ వ్యాపారాలపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవిగా ఇది నొక్కి చెబుతోందన్నారు. నమోదిత సంస్థల షేర్ల విలువను పెంచేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ 2023 ఆరంభంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు ఓ దశలో భారీగా నష్టపోయాయి. అయితే, మదుపర్లలో విశ్వాసం నింపేందుకు గ్రూప్‌ అనేక చర్యలు చేపట్టింది. ఫలితంగా షేర్లు మళ్లీ గాడిన పడ్డాయి.

భవిష్యత్‌లో ఇలాంటి సవాళ్లను అరికట్టేందుకు తమ విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అదానీ (Gautam Adani) అన్నారు. అయితే, షార్ట్‌సెల్లర్‌ దాడిని తమ గ్రూప్‌ (Adani Group) అసాధారణ స్థాయిలో ఎదుర్కొందని వ్యాఖ్యానించారు. గడ్డుకాలం నుంచి పుంజుకోవడమే కాకుండా, రికార్డు స్థాయి కార్పొరేట్‌ ఫలితాలను ప్రకటించామని చెప్పారు. దీంతో అత్యంత సవాళ్లతో కూడిన సంవత్సరాన్ని ‘అపూర్వమైన శక్తి’తో ముగించామని వ్యాఖ్యానించారు.

వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకొన్నట్లు గౌతమ్‌ అదానీ తెలిపారు. స్వచ్ఛ ఇంధనం దిశగా ఆ పెట్టుబడులు ఉంటాయన్నారు. జీక్యూజీ పార్ట్‌నర్స్‌ వంటి బడా సంస్థాగత మదుపర్ల మద్దతు తమకు కలిసొచ్చిందని తెలిపారు. ఆర్థికంగా తామిప్పుడు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని