సంక్షిప్త వార్తలు(7)

సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం

Updated : 07 May 2024 02:43 IST

సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌కు నష్టాలు

ఈనాడు, హైదరాబాద్‌: సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ రూ.32.82 కోట్ల ఆదాయాన్ని, రూ.105 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌ ఎండీగా మరో అయిదేళ్ల కాలానికి వెంకట్‌ జాస్తి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.  


అరవింద్‌ లాభం రూ.104.42 కోట్లు

రూ.4.75 డివిడెండ్‌

దిల్లీ: వస్త్ర తయారీ సంస్థ అరవింద్‌ లిమిటెడ్‌ మార్చి త్రైమాసికంలో రూ.104.42 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.97.3 కోట్లతో పోలిస్తే ఇది 7.32% ఎక్కువ. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,880.76 కోట్ల నుంచి రూ.2,074.51 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ రూ.353.63 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2022-23లో కంపెనీ లాభం రూ.413.17 కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.8,882.48 కోట్ల నుంచి రూ.7,737.75 కోట్లకు తగ్గింది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై తుది డివిడెండ్‌ రూ.3.75, ప్రత్యేక డివిడెండ్‌ రూ.1 కలిపి మొత్తం రూ.4.75 చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.


మారికో లాభం రూ.320 కోట్లు

దిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ మారికో లిమిటెడ్‌,  మార్చి త్రైమాసికంలో రూ.320 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.305 కోట్లతో పోలిస్తే ఇది 4.9% అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.2,240 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.2,278 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ.1,907 కోట్ల నుంచి రూ.1,894 కోట్లకు తగ్గాయి. దేశీయ వ్యాపారంలో అమ్మకాల వృద్ధి 3% కాగా.. స్థిర కరెన్సీ రూపేణా అంతర్జాతీయ విపణుల్లో వృద్ధి 10 శాతంగా నమోదైంది.

2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం రూ.1,502 కోట్లకు చేరింది. 2022-23 లాభం రూ.1,322 కోట్లతో పోలిస్తే ఇది 13.62% అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.9,764 కోట్ల నుంచి రూ.9,653 కోట్లకు తగ్గింది. ‘2023-24 ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగానే ముగించాం. త్రైమాసిక ప్రాతిపదికన దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో అత్యధిక వార్షిక నిర్వహణ మార్జిన్‌ నమోదు చేసినట్లు’ మారికో లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టరు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి సౌగతా గుప్తా తెలిపారు. తాము చేపడుతున్న వివిధ చర్యల ద్వారా దేశీయంగా తమ కీలక విభాగాల వృద్ధి అంచనాలు క్రమంగా మెరుగవుతాయని భావిస్తున్నామని పేర్కొన్నారు. సేతు ప్రాజెక్టు కింద.. మూడేళ్లలో దశలవారీగా నేరుగా 15 లక్షల విక్రయ కేంద్రాలకు చేరువకావాలని మారికో ప్రణాళికగా పెట్టుకుంది.


విపణిలోకి కీటక నాశిని ఎఫికాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రసాయన ఎరువులను అందించే బీఏఎస్‌ఎఫ్‌, కొత్త కీటక నాశిని ఎఫికాన్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. గతేడాది ఆస్ట్రేలియా, కొరియాలలో దీన్ని ప్రవేశపెట్టింది. అందుబాటులో ఉన్న ఉత్పత్తులకు భిన్నంగా క్రిములు, కీటకాలపై ఇది సమర్థంగా పనిచేస్తుందని బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా అగ్రికల్చర్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ గిరిధర్‌ రానువా తెలిపారు. పత్తి, మిర్చి, టమాటా, దోస, వంకాయ పంటలకు దీన్ని ఉపయోగించవచ్చని అన్నారు. రసం పీల్చే క్రిములు, తెగుళ్ల వల్ల దేశంలో పంటల దిగుబడి 35-40% తగ్గుతోందని; పూత దశలో ఎఫికాన్‌ను వాడటం ద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. ఎకరాకు దాదాపు 280 మిల్లీ లీటర్లు సరిపోతుందని, 12-14 రోజుల వరకూ ప్రభావం ఉంటుందని తెలిపారు.


జూన్‌ 6 నుంచి రూ.96,317 కోట్ల స్పెక్ట్రమ్‌ వేలం

దిల్లీ: రూ.96,317 కోట్ల కనీస ధరతో, జూన్‌ 6 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా దరఖాస్తులు సమర్పించాయి. 2022లో నిర్వహించిన వేలంలో అదానీ గ్రూప్‌ సంస్థ కూడా పాల్గొనడం ఆశ్చర్యం కలిగించింది. ఈసారి వేలంలో కొత్త సంస్థలేవీ పాల్గొనడం లేదు. మొబైల్‌ ఫోన్‌ సేవలకు సంబంధించిన 8 స్పెక్ట్రమ్‌ బ్యాండ్ల (800 - 900 - 1,800 - 2,100 - 2,300 - 2,500 - 3,300 మెగాహెర్ట్జ్‌్స, 26 గిగాహెర్ట్జ్‌్స) స్పెక్ట్రమ్‌ వేలంను, 20 ఏళ్ల కాలానికి వేలం వేయనున్నారు. ఈ నెల 10న దరఖాస్తుదార్ల  వివరాలను డాట్‌ వెల్లడించనుంది. 7 వరకు దరఖాస్తుల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 20న బిడ్డర్ల తుది జాబితా ప్రకటిస్తారు.


నెఫ్రోప్లస్‌కు రూ.850 కోట్ల నిధులు

ఈనాడు, హైదరాబాద్‌: డయాలసిస్‌ సేవలను అందించే హైదరాబాద్‌ సంస్థ నెఫ్రోప్లస్‌ రూ.850 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఆసియాలో ఆరోగ్య సేవల రంగంపై పెట్టుబడులు పెట్టే అతిపెద్ద సంస్థ క్వాడ్రియా క్యాపిటల్‌ ఈ మొత్తాన్ని సమకూర్చింది. ఇందుకుగాను క్వాడ్రియాకు నెఫ్రోప్లస్‌ కొత్తగా షేర్లను జారీ చేసింది. దేశీయ నెఫ్రాలజీ విభాగంలో ఇదే అతి పెద్ద పెట్టుబడి. గత కొన్నేళ్లుగా తమ వ్యాపారం విస్తరించిందని, దాదాపు 30వేల మంది రోగులకు సేవలను అందిస్తున్నామని నెఫ్రోప్లస్‌ సీఈఓ విక్రమ్‌ వుప్పాల తెలిపారు. తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులు వెచ్చిస్తామని అన్నారు.


55% పెరిగిన ఇండియన్‌ బ్యాంక్‌ లాభం

దిల్లీ: ఇండియన్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,247 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం   రూ.1,447 కోట్లతో పోలిస్తే ఇది 55% అధికం. మొత్తం ఆదాయం రూ.14,238 కోట్ల నుంచి రూ.16,887 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ)  రూ.5,508 కోట్ల నుంచి 9% పెరిగి రూ.6,015 కోట్లకు చేరింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం  రూ.8,063 కోట్లకు చేరింది. 2022-23లో ఆర్జించిన రూ.5,282 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 53% అధికం. మొత్తం ఆదాయం రూ.52,085 కోట్ల నుంచి రూ.63,482 కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని