ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు

ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్‌’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది.

Published : 07 May 2024 02:49 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్‌’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. ప్రయోగాత్మక దశలో 700 - 2,100 మెగాహెర్జ్ట్‌్స స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో రూపొందించిన 4జీ నెట్‌వర్క్‌లో, 40-45 ఎంబీపీఎస్‌ డేటా వేగాన్ని  నమోదు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు వెల్లడించారు. ఐటీ సేవల అగ్రగామి సంస్థ టీసీఎస్‌, ప్రభుత్వ టెలికాం పరిశోధనా సంస్థ సి-డాట్‌ నేతృత్వంలోని కన్సార్షియం దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంజాబ్‌లో 4జీ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందుబాటులోకి తెచ్చింది. సుమారు 8 లక్షల మంది చందాదార్లను జత చేర్చుకుంది.

‘సి-డాట్‌ అభివృద్ధి చేసిన 4జీ కోర్‌ పంజాబ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లో చాలా బాగా పని చేస్తోంది. గత ఏడాది జులైలో దీన్ని ఏర్పాటు చేశారు. అలాంటి సంక్లిష్ట సాంకేతికత విజయాన్ని నిరూపించడానికి 12 నెలలు పడుతుంది. అయితే సి-డాట్‌ కోర్‌ 10 నెలల్లో స్థిరీకరణ సాధించడంతో దేశ వ్యాప్తంగా ఆగస్టులో ఆత్మనిర్భర్‌ 4జీ సాంకేతికతను బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రారంభించనుంద’ని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.

1.12 లక్షల టవర్ల ఏర్పాటు: కోర్‌ నెట్‌వర్క్‌ అనేది టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లో ప్రాథమిక సేవలను అందించే నెట్‌వర్క్‌ హార్డ్‌వేర్‌, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ల సమాహారం. 5జీకి అప్‌గ్రేడ్‌ అయ్యేలా 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం టీసీఎస్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, ప్రభుత్వ రంగ ఐటీఐ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ.19,000 కోట్ల విలువైన ఆర్డర్లు పొందాయి. 4జీ, 5జీ సేవల కోసం దేశ వ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే 9,000 టవర్లను ఏర్పాటు చేయగా, ఇందులో 6,000 టవర్లు పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, యూపీ పశ్చిమ, హరియాణా సర్కిల్‌లో యాక్టివ్‌గా ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌లను గత 4-5 ఏళ్ల నుంచే విక్రయిస్తోంది. అంతకు ముందు సిమ్‌లు కలిగి ఉన్న వినియోగదార్లు, కొత్త సిమ్‌లకు మారి, సేవలు 4జీ పొందొచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని