సేవల రంగ వృద్ధి వేగవంతంగానే

దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్‌లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్‌లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది.

Published : 07 May 2024 02:41 IST

దిల్లీ: దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్‌లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్‌లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. పీఎంఐ పరిభాషలో సూచీ 50 పాయింట్లకు ఎగువన ఉంటే ఆ రంగంలో వృద్ధి ఉన్నట్లు, దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో వృద్ధి తగ్గినప్పటికీ.. గత 14 ఏళ్లలో నమోదైన బలమైన వృద్ధిలో ఇది కూడా ఒకటి అని సర్వే తెలిపింది. సానుకూల ఆర్థిక పరిస్థితులు, బలమైన గిరాకీ, కొత్త ఆర్డర్ల రాకను ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ఉద్యోగ నియామకాల విషయానికొస్తే.. కొత్త నియామకాల విషయంలో జాగ్రత్తపడటం మరింత పెరిగింది.  ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగానే తమ వద్ద సిబ్బంది సంఖ్య ఉన్నట్లు కంపెనీలు తెలిపాయి. ఉద్యోగాల సృష్టి స్వల్పంగా ఉండటంతో పాటు.. గత ఆర్థిక సంవత్సరం చివరితో పోలిస్తే స్వల్పంగానే పెరిగిందని తెలిపింది. కొత్త ఆర్డర్లకు తగ్గట్లుగా తమ సిబ్బంది సంఖ్యను కంపెనీలు పెంచుకుంటున్నాయని పేర్కొంది. వేతన ఒత్తిళ్లు, అధిక ఆహార పదార్థాల ధరల రీత్యా కంపెనీలకు వ్యయ భారం పెరగడంతో.. అందులో కొంత మొత్తాన్ని వినియోగదార్లకు సంస్థలు బదిలీ చేస్తున్నాయని తెలిపింది. వ్యాపార కార్యకలపాల విషయంలో సేవల రంగ సంస్థల విశ్వాసం 3 నెలల గరిష్ఠ స్థాయికి చేరినట్లు నివేదిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని