మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే

మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తాజా నివేదికలో పేర్కొంది.

Published : 07 May 2024 02:50 IST

2027-28 కల్లా సాకారం: క్రిసిల్‌
ముంబయి

మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తాజా నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో,  దేశీయ సంస్థల విమానాల్లో మన అంతర్జాతీయ ప్రయాణికుల వాటా 43 శాతంగా ఉండగా.. 2027-28 కల్లా ఇది మరో 7% వృద్ధి చెంది 50 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ఈ నివేదికలో ముఖ్యాంశాలు..

  • అంతర్జాతీయంగా కొత్త మార్గాలను నిర్దేశించుకుని, అందుకనువైన పెద్ద విమానాలను జత చేసుకోనుండడంతో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారతీయ విమాన సంస్థల వాటా పెరగనుంది. విదేశీ విమానాలతో పోలిస్తే దేశీయ మార్గాల్లో మన విమానాలకు అనుసంధానత ఎక్కువగా ఉండడం కలిసి రానుంది.
  • అంతర్జాతీయ రద్దీలో వాటా పెరుగుతున్నందున, దేశీయ విమానయాన కంపెనీల వ్యాపారమూ బలోపేతం కానుంది. దేశీయ మార్గాలతో పోలిస్తే అంతర్జాతీయ మార్గాల్లో లాభాలు ఎక్కువ.
  • 2023-24లో భారత అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 7 కోట్లకు చేరింది. కొవిడ్‌ అనంతరం అంతర్జాతీయ ప్రయాణాలకు భారతీయులు మొగ్గుచూపడమే ఇందుకు నేపథ్యం. కరోనా సంవత్సరం (2020-21)లో ఈ రద్దీ కోటికి పరిమితమైంది.
  • వీసా నిబంధనలు సడలడానికి తోడు ఖర్చుపెట్టేందుకు సరిపడా ఆదాయాలు పెరగడం, దేశీయంగా కొత్త విమానాశ్రయాలు ప్రారంభమై, మెట్రోలకు అనుసంధానత పెరగడం వల్ల, అంతర్జాతీయ ప్రయాణాలు సులువవుతున్నాయి.
  • భారత్‌ను పర్యాటక కేంద్రంగా మార్చడంపై కేంద్రం దృష్టి పెట్టడంతో దేశీయ రద్దీ మరింత పెరగనుంది.
  • వచ్చే నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్‌) 10-11 శాతంగా నమోదు కావొచ్చు. కరోనా ముందు ఇది 5 శాతానికి దరిదాపుల్లోనే ఉంది.
  • భారతీయ విమాన కంపెనీలు గత 15 నెలల్లో కొత్తగా 55 అంతర్జాతీయ మార్గాలను జత చేసుకోవడంతో, మొత్తం సంఖ్య 300కు చేరింది. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాకు నేరుగా సర్వీసుల ప్రారంభమూ కలిసొస్తోంది.
  • మన ప్రయాణికులు దేశీయ నగరాల నుంచి, ఇబ్బంది పడకుండా అంతర్జాతీయ గమ్యస్థానానికి చేరేందుకు అవసరమయ్యే అనుసంధానత కోసం విదేశీ విమాన కంపెనీలతో కోడ్‌షేర్‌ ఒప్పందాలు కుదుర్చుకోవడమూ మన సంస్థలకు ప్రయోజనాన్ని చేకూర్చబోతోంది. ఇందువల్ల చిన్న నగరాల నుంచి ఒకే టికెట్‌పై అంతర్జాతీయ గమ్యానికి చేరే సదుపాయం కల్పించడంలో, విదేశీ విమానయాన కంపెనీలపై మన సంస్థలు పైచేయి సాధిస్తున్నాయి.
  • చిన్న, పెద్ద స్థాయి విమానాలు సమకూర్చుకునేందుకు పెట్టుబడులు పెట్టడం; కీలక, సుదూర గమ్యస్థానాలకు నాన్‌-స్టాప్‌ విమానాలను ఆవిష్కరించడం; కొత్త అంతర్జాతీయ మార్గాలను ప్రారంభించడంతో అంతర్జాతీయ ప్రయాణాల్లో తమ వాటాను దేశీయ కంపెనీలు పదిలపరుచుకుంటున్నాయి. నీ భౌగోళికంగా భారత్‌ స్థానం కూడా అంతర్జాతీయ ప్రయాణాలకు కేంద్రంగా మారేందుకు ఉపయోగపడుతోంది.

ఇండిగో నుంచి 30 ఏ350-900 విమానాలకు ఆర్డర్‌: ఎయిర్‌బస్‌

దిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులు పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్న ఇండిగో, ఇందుకోసం ఎయిర్‌బస్‌కు 30 పెద్ద (వైడ్‌బాడీ) విమానాలకు ఆర్డరు ఇచ్చింది. 300-410 సీట్లు ఉండే ఏ350-900 విమానాల కోసం ఇండిగో నుంచి కచ్చితమైన ఆర్డర్‌ లభించినట్లు విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ సోమవారం ప్రకటించింది. 2027 సంవత్సరం నుంచి ఇవి సరఫరా కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు