జీఎస్‌టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా

జీఎస్‌టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (జీఎస్‌టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్‌ (రిటైర్డ్‌) సంజయ్‌ కుమార్‌ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్‌టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్‌టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క.

Published : 07 May 2024 02:40 IST

దిల్లీ: జీఎస్‌టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (జీఎస్‌టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్‌ (రిటైర్డ్‌) సంజయ్‌ కుమార్‌ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్‌టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్‌టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. మిశ్రా.. ఇంతకుమునుపు ఝార్ఖండ్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈయన్ను జీఎస్‌టీఏటీ ప్రెసిడెంట్‌గా భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని అన్వేషణ, ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. జీఎస్‌టీ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయ్యే అప్పీళ్లను విచారించేందుకు సీజీఎస్‌టీ చట్టం- 2017 కింద జీఎస్‌టీఏటీ ఏర్పాటైంది. ఇందులో ఒక ప్రధాన ధర్మాసనంతో పాటు వివిధ రాష్ట్ర ధర్మాసనాలు ఉంటాయి. జీఎస్‌టీ మండలి అనుమతినిచ్చిన దాని ప్రకారం.. ప్రధాన ధర్మాసనం దిల్లీలోనే ఉండాలని ప్రభుత్వం నోటిఫై చేసింది. 31 రాష్ట్రాల ధర్మాసనాలు దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఉండొచ్చు. ప్రస్తుతం జ్యుడీషియల్‌ సభ్యులు, సాంకేతిక సభ్యుల నియామకాల ప్రక్రియ జరుగుతోంది.

జీఎస్‌టీ ముందు స్థాయికి ఆదాయాలు: జీఎస్‌టీ చట్టం అమలులో పేదల అనుకూల వైఖరికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గతంతో పోలిస్తే, జీఎస్‌టీలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. జీడీపీలో పన్ను ఆదాయాలు జీఎస్‌టీ చట్టం రాక ముందు స్థాయికి చేరాయని తెలిపాయి. ‘జీఎస్‌టీ లేకుంటే ఈ పన్ను విధానంలో కలిపిన గత పన్నుల ద్వారా రాష్ట్రాలకు 2018-19 నుంచి 2023-24 వరకు రూ.37.5 లక్షల కోట్ల పన్ను ఆదాయం వచ్చి ఉండేది. జీఎస్‌టీ వల్ల ఇది రూ.46.56 లక్షల కోట్లకు చేరింద’ని ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మంత్రి తెలిపారు. పన్నుల రేట్లు తక్కువగా ఉన్నా, కొవిడ్‌-19 పరిణామాలు ప్రభావం చూపినా.. జీఎస్‌టీ వసూళ్లు నికరంగా, స్థూలంగా ఈ విధానం పూర్వస్థాయిలకు చేరాయని ఆమె పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదార్లపై తక్కువ పన్ను భారాన్ని మోపుతూ,  అత్యుత్తమ పన్ను విధాన నిర్వహణ ద్వారా అంతే స్థాయిలో పన్నుల ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు కలిసి వసూలు చేయగలిగాయని ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని