నరేశ్‌ గోయెల్‌కు మధ్యంతర బెయిలు

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయెల్‌(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది.

Published : 07 May 2024 02:44 IST

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయెల్‌(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గోయెల్‌ను 2023 సెప్టెంబరులో అరెస్టు చేసింది. బెయిల్‌ ఇస్తూనే, ముందస్తు అనుమతి లేకుండా ముంబయిని వీడరాదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని జస్టిస్‌ ఎన్‌.జే జమాదార్‌ తన ఆదేశాల్లో తెలిపారు. గోయెల్‌ పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్‌ చేయాలనీ ఆదేశించారు.

నరేశ్‌ గోయెల్‌తో పాటు ఆయన భార్య అనితా గోయెల్‌ కూడా కేన్సర్‌తో బాధపడుతున్నారు. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలన్న నరేశ్‌ గోయెల్‌ విజ్ఞప్తిని ఇంతకుముందు స్పెషల్‌ కోర్టు తిరస్కరించింది. గోయెల్‌కు ఇష్టమైన ప్రైవేటు ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందడానికి మాత్రం అనుమతినిచ్చింది. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. గోయెల్‌ బెయిల్‌ అభ్యర్థనను ఈడీ న్యాయవాది వ్యతిరేకించారు. ఆసుపత్రిలో నరేశ్‌ గోయెల్‌ చికిత్స గడువును పొడిగిస్తే  ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే నరేశ్‌ గోయెల్‌ భౌతిక - మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్‌ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

ఇదీ కేసు: జెట్‌ ఎయిర్‌వేస్‌కు కెనరా బ్యాంకు ఇచ్చిన రూ.538.62 కోట్లను అక్రమంగా ఇతర అవసరాలకు వినియోగించారనేది గోయెల్‌పై ఆరోపణ. ఆయన భార్యను కూడా 2023 నవంబరులో అరెస్టు చేసినా, ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్‌ కోర్టు అదే రోజున బెయిలు మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని