పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ

సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్‌బీఐ, రిలయన్స్‌ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది.

Published : 07 May 2024 02:47 IST

సమీక్ష

సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్‌బీఐ, రిలయన్స్‌ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.80% పెరిగి 83.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌ లాభపడ్డాయి. జపాన్‌, కొరియా సూచీలు పనిచేయలేదు. ఐరోపా మార్కెట్లు మెరిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 74,196.68 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,359.69 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, అమ్మకాలతో 73,786.29 పాయింట్లకు పడిపోయింది. చివరకు 17.39 పాయింట్లు పెరిగి 73,895.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.15 పాయింట్లు తగ్గి 22,442.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,409.45- 22,588.80 పాయింట్ల మధ్య కదలాడింది.

  • త్రైమాసిక లాభం 25% పెరగడంతో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు 5.01% పరుగులు తీసి రూ.1,624.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.15,406.39 కోట్లు పెరిగి రూ.3.22 లక్షల కోట్లకు చేరింది.
  • మార్చి త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో టైటన్‌ షేరు ఒకదశలో 7.87% నష్టపోయి రూ.3,257.05కు చేరింది. చివరకు 7.18% కోల్పోయి రూ.3,281.65 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.22,527.56 కోట్లు తగ్గి రూ.2.91 లక్షల కోట్లకు చేరింది.
  • అమల్లో ఉన్న ప్రాజెక్టులకు ఇచ్చే రుణాల నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు నీరసపడ్డాయి. పీఎన్‌బీ 6.41%, కెనరా బ్యాంక్‌ 5.42%, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.71%, సెంట్రల్‌ బ్యాంక్‌ 3.12%, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2.57% కుదేలయ్యాయి. విద్యుత్‌ రుణ కంపెనీలు పీఎఫ్‌సీ 8.93%, ఆర్‌ఈసీ 7.35% క్షీణించాయి.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 లాభపడ్డాయి. టీసీఎస్‌ 2.12%, హెచ్‌యూఎల్‌ 1.80%, ఎం అండ్‌ ఎం 1.45%, సన్‌ఫార్మా 1.41%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.06%, టెక్‌ మహీంద్రా 1.01%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.89% పెరిగాయి. ఎస్‌బీఐ 2.86%, ఎన్‌టీపీసీ 2.31%, పవర్‌గ్రిడ్‌ 1.22%, ఎల్‌ అండ్‌ టీ 1.06%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.03%, రిలయన్స్‌ 1.03% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. మన్నికైన వినిమయ వస్తువులు 3.85%, సేవలు 1.95%, యుటిలిటీస్‌ 1.76%, విద్యుత్‌ 1.26%, పరిశ్రమలు 0.80%, కమొడిటీస్‌ 0.78% డీలాపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఐటీ, వాహన, స్థిరాస్తి, టెక్‌ రాణించాయి. బీఎస్‌ఈలో 1207 షేర్లు లాభాల్లో ముగియగా, 2726 స్క్రిప్‌లు నష్టపోయాయి. 161 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • 6 ఏళ్ల గరిష్ఠానికి పీ-నోట్‌ పెట్టుబడులు: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్లు) ద్వారా వచ్చిన పెట్టుబడులు ఫిబ్రవరి చివరకు ఆరేళ్ల గరిష్ఠమైన రూ.1.5 లక్షల కోట్లకు చేరాయి. 2024 జనవరిలో రూ.1,43,011 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, ఫిబ్రవరి ముగిసేసరికి రూ.1,49,517 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు 2017 జూన్‌లో అత్యధికంగా పీ-నోట్‌ పెట్టుబడులు రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన రూ.1.50 లక్షల కోట్లలో.. ఈక్విటీల్లోకి రూ.1.27 లక్షల కోట్లు, డెట్‌లోకి రూ.21,303 కోట్లు, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లోకి రూ.541 కోట్లు వచ్చాయి.
  • కంపెనీ సీఈఓగా అభయ్‌ ఓజాను తొలగించినట్లు జీ మీడియా కార్పొరేషన్‌ ప్రకటించింది. మే 4 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఇందుకు కారణాలను వెల్లడించలేదు.
  • ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆన్‌లైన్‌ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫస్ట్‌క్రై మాతృసంస్థ బ్రెయిన్‌బీస్‌ సొల్యూషన్స్‌ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను మళ్లీ దాఖలు చేసింది. అదనపు సమాచారాన్ని కోరుతూ మళ్లీ పత్రాలను దాఖలు చేయమని బ్రెయిన్‌బీస్‌ను సెబీ గతంలో ఆదేశించింది. రూ1816 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రస్తుత వాటాదార్లకు చెందిన 5.44 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో విక్రయించాలన్నది ప్రతిపాదన.
  • ఎనర్జీ మిషన్‌ మెషినరీస్‌ (ఇండియా) ఐపీఓ ఈనెల 9న ప్రారంభమై 13న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.131-138ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.41.15 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకానున్నాయి. రిటైల్‌ మదుపర్లు కనీసం 1000 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.

నేటి బోర్డు సమావేశాలు: డాక్టర్‌ రెడ్డీస్‌, పిడిలైట్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, యునైటెడ్‌ బ్రూవరీస్‌, వోల్టాస్‌, ఐడీఎఫ్‌సీ, ఛంబల్‌ ఫెర్టిలైజర్స్‌, గ్రాఫైట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు