Artificial Intelligence: ఉద్యోగులను ఏఐ ఇప్పట్లో భర్తీ చేస్తుందా? ఎంఐటీ ఆసక్తికర నివేదిక!

Artificial Intelligence: ఉద్యోగుల స్థానంలో కృత్రిమ మేధను నియమించుకోవటం ఇప్పట్లో సాధ్యమవుతుందా అనే అంశంపై ఎంఐటీ అధ్యయనం చేసింది. దీంట్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం..!

Updated : 09 Feb 2024 14:35 IST

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) వల్ల ఉద్యోగాలు పోతాయంటూ ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఓ కీలక నివేదిక ఊరటనిచ్చే విషయాన్ని తెలియజేసింది. ఇప్పటికిప్పుడు ఉద్యోగుల స్థానంలో ఏఐని నియమించుకోవటం సాధ్యం కాకపోవచ్చునని వెల్లడించింది. చాలా కంపెనీలకు అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ‘మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT)’ అధ్యయనం వెల్లడించింది.

అమెరికాలో ఉద్యోగుల స్థానంలో ఏఐని (Artificial Intelligence) తీసుకురావడం సాధ్యమేనా? అనే అంశంపై ఎంఐటీ తాజాగా పరిశోధన చేసింది. చాలా సంస్థలకు ఏఐని నియమించుకోవటం కంటే ఆ స్థానంలో ఉద్యోగులను కొనసాగించటమే తక్కువ ఖర్చుతో కూడుకొన్న వ్యవహారమని గుర్తించింది. కొన్ని దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని తెలిపింది. ‘కంప్యూటర్‌ విజన్‌’ అనే ఏఐ ఆటోమేషన్‌ సిస్టమ్‌పై అధ్యయనం జరిపి ఈ నిర్ధరణకు వచ్చినట్లు పేర్కొంది.

కేవలం 23 శాతం ఉద్యోగాలను మాత్రమే ఏఐతో (Artificial Intelligence) రీప్లేస్‌ చేయడం కంపెనీలకు ఖర్చులపరంగా కలిసొస్తుందని తమ పరిశీలనలో గుర్తించినట్లు ఎంఐటీ నివేదిక తెలిపింది. కంప్యూటర్‌ విజన్‌ అమలుకు వెచ్చించాల్సిన ధర ఏటా 20 శాతం తగ్గినా.. అది అందుబాటు ధరకు వచ్చేందుకు దశాబ్దాలు పడుతుందని పేర్కొంది. ఈ విషయంలో గతంలో వచ్చిన అధ్యయనాలు ఆర్థిక, సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. కేవలం ఏఐ సామర్థ్యం, దాని పనితీరును మాత్రమే అంచనా వేశాయని స్పష్టం చేసింది.

జాబ్‌ మార్కెట్‌లో మార్పులకు మాత్రం ఏఐ కచ్చితంగా కారణమవుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన నీల్‌ థామ్సన్‌ వెల్లడించారు. స్వల్ప కాలంలోనూ కొంతమంది ఉద్యోగాలు పోతాయని.. మరికొంత మంది బాధ్యతల్లో మార్పులు వస్తాయని అంచనా వేశారు. రానురానూ ఏఐ వ్యవస్థల అభివృద్ధికి అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలిపారు. అయితే, వాటిని కంపెనీలు విస్తృత స్థాయిలో అమలు చేసే స్థాయికి దిగిరావడానికి మాత్రం చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని