Adani Group: ఆ నిధులన్నీ వాటాల విక్రయం ద్వారా వచ్చినవే.. రాహుల్‌ గాంధీకి ‘అదానీ’ కౌంటర్‌!

Adani Group: అన్ని లావాదేవీలను ఎప్పటికప్పుడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం ద్వారా బహిర్గతం చేసినట్లు అదానీ గ్రూప్‌ తెలిపింది.

Updated : 10 Apr 2023 19:45 IST

దిల్లీ: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ (Adani Group).. తమ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై కీలక ప్రకటన చేసింది. 2019 నుంచి తమ కంపెనీలు 2.87 బిలియన్‌ డాలర్లు విలువ చేసే వాటాలను విక్రయించినట్లు తెలిపింది. అందులో నుంచే 2.55 బిలియన్‌ డాలర్లు తమ ప్రమోటర్లు తిరిగి అదానీ గ్రూప్ (Adani Group) వ్యాపారాల్లోకి పెట్టుబడులుగా మళ్లించినట్లు తెలిపింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేస్తున్న ఆరోపణలకు బదులుగానే అదానీ గ్రూప్‌ తాజా వివరణ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అదానీ డొల్ల కంపెనీల్లోకి రూ.20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ఆయన పదే పదే ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ (AGEL) వంటి కంపెనీల్లో అబుదాబి కేంద్రం పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ PJSC (IHC) 2.593 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు అదానీ గ్రూప్‌ తెలిపింది. అలాగే అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌లో ప్రమోటర్లు 2.783 బిలియన్ డాలర్లు విలువ చేసే వాటాలను విక్రయించినట్లు వెల్లడించింది. ఈ నిధులనే ప్రమోటర్‌ సంస్థలు తిరిగి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పవర్‌ వంటి పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలిపింది.

అదానీ డొల్ల కంపెనీల్లోకి అకస్మాత్తుగా రూ.20,000 కోట్లు వచ్చిపడ్డట్లు ఇటీవల ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీని ఆధారంగానే రాహుల్‌ గాంధీ అదానీ గ్రూప్‌పై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అదానీ గ్రూప్‌ను కూల్చివేయడానికి జరుగుతున్న పోటీ ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ, మేం నియంత్రణ సంస్థల నిబంధనలన్నింటినీ పాటిస్తున్నాం. అలాగే ప్రమోటర్ల వాటా, నిధుల సమీకరణకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని దాచిపెట్టడం లేదు’’ అని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అదానీ గ్రూప్‌ పేర్కొంది. 

పునరుత్పాదక ఇంధన సంస్థ AGELలో 20 శాతం వాటాను ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్‌కు జనవరి 2021లో ప్రమోటర్లు విక్రయించినట్లు అదానీ గ్రూప్‌ తెలిపింది. తద్వారా రెండు బిలియన్ డాలర్లు సేకరించినట్లు వెల్లడించింది. దీనికి ముందు, వారు సిటీ గ్యాస్ సంస్థ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్‌లో 37.4 శాతం వాటాను అదే ఫ్రెంచ్ సంస్థకు 783 మిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు తెలిపింది. మరోవైపు టోటల్‌ ఎనర్జీస్‌ కొన్ని విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ వెహికల్స్‌ను కొనుగోలు చేసి ఆ నిధులను తిరిగి అదానీ కంపెనీల్లోని మళ్లించినట్లు పేర్కొంది. అలా విదేశాల నుంచి వచ్చిన నిధులను తిరిగి ఇక్కడి గ్రూప్‌ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టడాన్నే ‘ఇప్పుడు కొందరు డొల్ల కంపెనీల నుంచి వచ్చిన నిధులుగా వ్యవహరిస్తున్న’ట్లు వ్యాఖ్యానించింది. పరోక్షంగా రాహుల్‌ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టింది.

అన్ని లావాదేవీలను ఎప్పటికప్పుడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం ద్వారా బహిర్గతం చేసినట్లు అదానీ గ్రూప్‌ తెలిపింది. అలాగే AGELలో అదనపు వాటాల కొనుగోలు, రుణాలు ఇతర సెక్యూరిటీల ద్వారా AGELకు మద్దతుగా నిలిచిన వ్యవహారం కూడా ప్రజలకు తెలిసిన విషయమేనని పేర్కొంది. ఆయా సమయాల్లో సంబంధిత రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ద్వారా వెల్లడించిన వివరాల నుంచి వాస్తవాలు సులభంగా, పారదర్శకంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ‘‘తప్పుదోవ పట్టించే కథనం’’ ‘‘విచారకరమైన’’ రాజకీయ సమస్యగా మారిందని వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు