Dream 11: గేమింగ్‌ కంపెనీలకు షాక్‌.. ఒక్క డ్రీమ్‌ 11కే ₹25 వేల కోట్ల పన్ను నోటీసు..!

Tax notices to gaming firms: జీఎస్టీ బకాయిలకు సంబంధించి గేమింగ్‌ కంపెనీలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ పన్ను నోటీసులు పంపింది. ఒక్క డ్రీమ్‌ 11కే రూ.25 వేల కోట్ల పన్ను నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.

Published : 26 Sep 2023 13:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో పలు రియల్‌ మనీ గేమింగ్‌ కంపెనీలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ (DGGI) ప్రీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం 12 కంపెనీలకు ఈ నోటీసులు ఇచ్చింది. ఇందులో ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11 (Dream 11) సహా పలు కంపెనీలు ఉన్నాయి. మొత్తం రూ.55వేల కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. ఒక్క డ్రీమ్‌ 11కే రూ.25వేల కోట్లు జీఎస్టీ బకాయిలు చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్టీని 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించిన నేపథ్యంలో డీజీజీఐ ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. అయితే, అదాయపు పన్ను శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేయకముందు ఎంతెంత బకాయిలు ఉన్నాయో ఆయా కంపెనీలకు తెలియజేస్తూ ఈ ప్రీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇందులో డ్రీమ్‌ 11, రమ్మీ సర్కిల్‌, మై 11 వంటి కంపెనీలు ఉన్నాయి. మున్ముందు మరిన్ని కంపెనీలకూ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, డీజీజీఐ ప్రీ షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంపై డ్రీమ్‌ 11 బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

‘ఆధార్‌’పై మూడీస్‌ సంచలన ఆరోపణలు.. గట్టిగా బదులిచ్చిన కేంద్రం

దేశంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో పన్ను నోటీసులు పంపించడం ఇదే ప్రథమం. గతేడాది బెంగళూరుకు చెందిన గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీకి రూ.21వేల కోట్ల ట్యాక్స్‌ నోటీసు పంపించారు. అయితే, కర్ణాటక హైకోర్టు నోటీసును రద్దు చేసింది. ఈ నిర్ణయంపై డీజీజీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. డీజీజీఐ జారీ చేసిన నోటీసులను కంపెనీలు సవాలు చేసే అవకాశం ఉందని నిపుణలు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని