Aadhaar: ‘ఆధార్‌’పై మూడీస్‌ సంచలన ఆరోపణలు.. గట్టిగా బదులిచ్చిన కేంద్రం

Aadhaar: ఆధార్‌ వినియోగంపై మూడీస్‌ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. 100 కోట్ల మంది భారతీయులకు దీనిపై విశ్వాసం ఉందని పేర్కొంది. 

Updated : 26 Sep 2023 12:13 IST

దిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్నా ఇప్పుడు ఆధార్‌ (Aadhaar) తప్పనిసరి. ఈ ఆధార్‌పై ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ (Moody's Investors Service) సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్‌ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను కేంద్రం గట్టిగా తిప్పికొట్టింది. అవన్నీ నిరాధారమని కొట్టిపారేసింది.

మూడీస్‌ ఆరోపణలేంటీ..?

ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ ఐడీ ప్రొగ్రామ్‌ ‘ఆధార్‌ (Aadhaar)’ అని పేర్కొన్న మూడీస్‌.. దీనిపై తాజాగా ‘డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డిజిటల్ అసెట్స్‌’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆధార్‌ వినియోగం వల్ల భద్రతాపరమైన సమస్యలు ఏర్పడే అవకాశముందని ఆ నివేదికలో ఆరోపించింది. ‘‘అట్టడుగు వర్గాలను ఏకీకృతం చేయడంతో పాటు సంక్షేమ ప్రయోజనాలను చిట్టచివరి వ్యక్తికి విస్తరించడమే లక్ష్యంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ ఆధార్‌ను తీసుకొచ్చింది. చాలా పథకాలకు దీన్ని తప్పనిసరి చేశారు. అయితే దీనివల్ల తరచూ సేవల తిరస్కరణ వంటివి జరుగుతున్నాయి. బయోమెట్రిక్‌ సరిగా రాక చాలా మందికి సేవలు అందడం లేదు. ముఖ్యంగా అత్యంత వేడి, తేమ వాతావరణంలో పనిచేసే కార్మికులు ఆధార్‌ను వినియోగించడం అంత విశ్వసనీయమైనది కాదు’’ అని మూడీస్‌ పేర్కొంది. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే చెల్లింపులకు కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని ప్రస్తావిస్తూ మూడీస్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

అంతేగాక, పౌరుల సున్నితమైన సమాచారం కలిగి ఉన్న ఆధార్‌ వల్ల.. డేటా ఉల్లంఘనల ముప్పు పొంచి ఉందని మూడీస్‌ ఆరోపించింది. ‘‘కేంద్రీకృత వ్యవస్థలో బ్యాంకింగ్‌ అవసరాలు, సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వ సంక్షేమాలు ఇలా అన్నింటికి ఒకే గుర్తింపు కార్డును వినియోగిస్తున్నారు. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉంది’’ అని మూడీస్‌ తన నివేదికలో పేర్కొంది.

పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!

కేంద్రం వివరణ ఇదే..

అయితే, మూడీస్‌ నివేదికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా రేటింగ్‌ సంస్థ ఆ ఆరోపణలు చేసిందని దుయ్యబట్టింది. ‘‘ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్‌ ఐడీ ఆధార్‌. గత పదేళ్లుగా వంద కోట్లకు పైగా భారతీయులు దీనిపై విశ్వాసం ఉంచారు. తమ గుర్తింపును ధ్రువీకరించేందుకు 100కోట్ల సార్లకు పైగా దీన్ని వినియోగించారు. మూడీస్‌ తన నివేదికలో చెప్పిన అభిప్రాయాలను సమర్థించేలా ఎలాంటి అధ్యయనాలను ప్రస్తావించలేదు. ఆ సంస్థ చేసిన ఆరోపణలను రుజువు చేసే ప్రయత్నమూ చేయలేదు’’ అని ఉడాయ్‌ (UIDAI) ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘‘అంతేగాక, ఆధార్‌ బయోమెట్రిక్‌ కోసం కేవలం వేలిముద్ర మాత్రమే కాకుండా, ఫేస్‌ అథెంటికేషన్‌, ఐరిస్‌ అథెంటికేషన్‌ వంటి కాంటాక్ట్‌లెస్‌ మార్గాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మూడీస్‌ విస్మరించింది. దీంతో పాటు.. చాలా కేసుల్లో మొబైల్‌ ఓటీపీని వినియోగించుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ఇక, సెంట్రలైజ్డ్‌ ఆధార్‌ వ్యవస్థలో భద్రతా, గోప్యతా ముప్పు పొంచి ఉందని నివేదికలో వాదించారు. కానీ, ఆధార్‌ డేటాబేస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదు. ఆ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు పార్లమెంట్‌ ముందు నివేదించాం’’ అని ఉడాయ్‌ తమ ప్రకటనలో వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని