Disney-Reliance Merger: డిస్నీ, రిలయన్స్‌ విలీన ఒప్పందం ఖరారు!

Disney-Reliance Merger: గత కొన్ని నెలలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌, డిస్నీ మధ్య విలీన ఒప్పందం జరగనుందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇరు సంస్థలు సంతకాలు చేసినట్లు సమాచారం.

Published : 25 Feb 2024 22:04 IST

దిల్లీ: భారత్‌లో మీడియా వ్యాపారాలను విలీనం చేసే నిమిత్తం వాల్డ్‌ డిస్నీ (Walt Disney) కంపెనీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) నిశ్చయాత్మక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. విలీనానంతర సంస్థలో 61 శాతం వాటా కలిగి ఉండేలా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్టుబడులు పెడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. మిగిలిన వాటా డిస్నీ చేతిలో ఉంటుంది. నగదు- షేర్ల బదిలీ రూపంలో ఈ లావాదేవీ జరిగే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఇరు సంస్థలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

ఇరు సంస్థల మధ్య వాటాల పంపకాలు ఒప్పందం పూర్తయ్యే లోపు మారొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రాడ్‌కాస్ట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ టాటా ప్లే లిమిటెడ్‌లో డిస్నీకి మైనారిటీ వాటాలు ఉన్నాయి. దీన్ని రిలయన్స్‌ కొనుగోలు చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు సబ్‌స్క్రైబర్లను నిలిపి ఉంచుకోవడంలో డిస్నీకి భారత్‌లో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అదే సమయంలో రిలయన్స్‌ ఇటీవల దేశంలో అనేక ఎంటర్‌టైన్‌మెంట్‌, మీడియా వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌ చేసింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌లను ఆకర్షించిన దేశీయ మీడియా, వినోద రంగంపై పట్టు సాధించాలని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఉవ్విళ్లూరుతోంది. 2022లో డిస్నీని వెనక్కి నెట్టి ఐపీఎల్‌ ప్రసార హక్కులను రిలయన్స్‌ సొంతం చేసుకున్న సంగతి విదితమే. అదే క్రమంలో గతంలో డిస్నీ చేతిలో ఉన్న వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీకి చెందిన హెచ్‌బీఓ షోల బ్రాడ్‌కాస్ట్‌ను సైతం దక్కించుకుంది.

విలీనానంతర సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. ఈ సంస్థకు స్టార్‌ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 నుంచి 38 ఛానళ్లు లభిస్తాయి. ఇవే కాకుండా రెండు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు- డిస్నీ హాట్‌స్టార్‌, జియో సినిమా కూడా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని