IPO Listings: ఐపీఓ లిస్టింగ్‌.. ‘డోమ్స్‌’ అదుర్స్‌.. ఇండియా షెల్టర్‌ ఓకే!

IPO Listings: డోమ్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇరు కంపెనీలు లిస్టింగ్‌ వేళ మదుపర్లకు లాభాలనిచ్చాయి.

Published : 20 Dec 2023 12:33 IST

దిల్లీ: రెండు కంపెనీల షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో బుధవారం తొలిసారి నమోదయ్యాయి. ఇరు సంస్థలూ లిస్టింగ్‌ వేళ మదుపర్లకు లాభాలను తీసుకొచ్చాయి. డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు దాదాపు 77 శాతం ప్రీమియంతో లిస్ట్‌ కాగా.. ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ షేర్లు 26 శాతం లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.790 ఇష్యూ ధర వద్ద ఐపీఓకి వచ్చింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నేడు ఈ కంపెనీ షేర్లు 77.21 శాతం ప్రీమియంతో రూ.1,400 దగ్గర లిస్టయ్యాయి (DOMS Industries Listing). ఆరంభంలో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8,622.14 కోట్లుగా నమోదైంది. ఐపీఓలో షేర్లు దక్కించుకొన్న మదుపర్లు ఒక లాటు(18 షేర్లు)పై కనీసం రూ.14,220 పెట్టుబడిగా పెట్టారు. ఈ లెక్కన వారు లిస్టింగ్‌లోనే ఒక్కో లాట్‌పై రూ.10,980 లాభాన్ని ఆర్జించారు. ఈ కంపెనీ ఐపీఓకి 93.40 రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ (India Shelter Finance Listing) షేర్లు ఇష్యూ ధర రూ.493తో పోలిస్తే బీఎస్‌ఈలో 24.27 శాతం లాభంతో రూ.612.70 దగ్గర లిస్టయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో 26.77 శాతం ప్రీమియంతో రూ.625 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. లిస్టింగ్‌ సమయంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ.6,236.26 కోట్లుగా నమోదైంది. ఐపీఓలో షేర్లు అలాట్‌ అయిన మదుపర్లు 30 షేర్లపై కనీసం రూ.14,790 పెట్టుబడిగా పెట్టారు. ఈ లెక్కన వారు లిస్టింగ్‌లో ఒక్కో లాట్‌పై రూ.3,591 లాభాన్ని పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని