EPACK Durables IPO: ఈప్యాక్‌ డ్యూరబుల్స్‌ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే!

EPACK Durables IPO: రూ.640 కోట్ల సమీకరణ లక్ష్యంతో ‘ఈప్యాక్‌ డ్యూరబుల్స్ లిమిటెడ్‌’ ఐపీఓకి వచ్చింది.

Published : 19 Jan 2024 11:30 IST

EPACK Durables IPO | ఈప్యాక్‌ డ్యూరబుల్స్ లిమిటెడ్‌ ఐపీఓ (IPO) శుక్రవారం ప్రారంభమైంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.218-230గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.640 కోట్లు సమీకరించనుంది. జనవరి 23 వరకు షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. మదుపర్లు కనీసం రూ.14,950తో 65 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈప్యాక్‌ డ్యూరబుల్స్ ఐపీఓలో (EPACK Durables IPO) రూ.400 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేస్తున్నారు. మరో 1.3 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ సభ్యులు, వాటాదారులు విక్రయిస్తున్నారు. ఈ ఐపీఓలో (IPO) సమీకరించిన నిధులను తయారీ కేంద్రాల ఏర్పాటుకు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వాడుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీఓలో సగం షేర్లను అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులకు కేటాయించారు. 35 శాతం రిటైల్‌ మదుపరులకు, 15 శాతం సంస్థాగతేతర మదుపరులకు రిజర్వ్‌ చేశారు.

ఈప్యాక్‌ డ్యూరబుల్స్‌ను 2002లో స్థాపించారు. ఇది ఏసీలతో పాటు గృహోపకరణాలను తయారు చేస్తోంది. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ తొలి విడతలో ఐసీఐసీఐ వెంచర్‌ నుంచి 24 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. రెండో విడతలో అఫిర్మా క్యాపిటల్‌ నుంచి 40 మిలియన్‌ డాలర్లు సమకూర్చుకుంది. యాక్సిస్‌ క్యాపిటల్‌, డామ్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ ఐపీఓకి (EPACK Durables IPO) బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: జనవరి 19-23
  • ధరల శ్రేణి: రూ.218-230
  • షేరు ముఖ విలువ: రూ.10
  • కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 65 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,950
  • అలాట్‌మెంట్ తేదీ: జనవరి 24
  • రిఫండ్‌ తేదీ: జనవరి 25
  • లిస్టింగ్‌ తేదీ: జనవరి 29

(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని