Meta: ఐరోపాలో మెటాకు ఎదురుదెబ్బ.. యూజర్ల అనుమతి ఉంటేనే యాడ్‌లు!

Meta | టెక్‌ దిగ్గజం మెటా ఐరోపాలో అనేక వివాదాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రైవసీ విషయంలో నియంత్రణా సంస్థల నుంచి కఠిన సవాళ్లు తప్పడం లేదు.

Updated : 02 Nov 2023 19:17 IST

Meta | లండన్‌: టెక్‌ దిగ్గజం మెటా (Meta), ఐరోపా దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. యూజర్ల ఆన్‌లైన్‌ హిస్టరీ ఆధారంగా వాణిజ్య ప్రకటనలను పంపే విధానంపై అమల్లో ఉన్న నిషేధాన్ని దాదాపు ఐరోపా వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ‘యురోపియన్‌ డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌’ బుధవారం ప్రకటించింది. మెటాకు చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఇతర టెక్‌ కంపెనీలు యూజర్ల బ్రౌజింగ్‌, మౌస్‌ క్లిక్‌లు, యాప్‌ల వాడకాన్ని పరిశీలిస్తాయి. వాటి ఆధారంగా ఆయా యూజర్ల ఆసక్తులకు అనుగుణంగా వాణిజ్య ప్రకటనలను పంపుతుంటాయి. దీన్నే ‘బిహేవియరల్‌ అడ్వర్టయిజింగ్‌ (behavioural advertising)’ అంటారు.

‘బిహేవియరల్‌ అడ్వర్టయిజింగ్‌ (behavioural advertising)’పై తొలుత నార్వేలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సరైన అనుమతులు లేకుండా యూజర్ల వ్యక్తిగత డేటాను తీసుకున్నందుకు రోజుకు 90 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని ఆ దేశ ప్రైవసీ విభాగం మెటా (Meta)ను ఆదేశించింది. అయితే, డేటా సేకరణకు యూజర్లు అనుమతించే ఆప్షన్‌ను కల్పించామని నియంత్రణా సంస్థలకు తెలిపినట్ల మెటా తాజాగా వెల్లడించింది. నెలకు 9.99 యూరోలతో ప్రకటనలరహిత సేవలను కూడా తీసుకొచ్చినట్లు తెలిపింది. అయినప్పటికీ.. బోర్డు తమపై చర్యలు తీసుకోవడం సమ్మతంకాదని పేర్కొంది. అయితే, మెటా తీసుకున్న చర్యలు ఐరోపా ప్రమాణాల స్థాయిలో లేవని నార్వే డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ చీఫ్‌ తెలిపారు. డేటా సేకరణకు యూజర్లు తమ ఇష్టపూర్వకంగా అనుమతిచ్చేలా విధానాలు ఉండాలని.. బలవంతంగా సబ్‌స్క్రిప్షన్‌ రూపంలో దాన్ని అమలు చేయాలని చూడొద్దని వివరించారు.

ప్రైవసీ విషయంలో ఐరోపాలో మెటా (Meta) అనేక వివాదాలను ఎదుర్కొంటోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఇతర ప్రదేశాలకు పంపుతున్నందుకుగానూ మే నెలలో ఐరోపా సమాఖ్య 1.3 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. అలాగే నియంత్రణాపరమైన చర్యల కారణంగా మెటా టెక్ట్స్‌ ఆధారిత యాప్‌ ‘థ్రెడ్స్‌’ను ఐరోపాలో ప్రవేశపెట్టలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని