Mark Zuckerberg: జుకర్‌బర్గ్‌ ఆసియా టూర్‌.. ఏఐ చిప్స్‌, అంబానీ ప్రీ-వెడ్డింగ్‌

Mark Zuckerberg: టెక్‌ దిగ్గజం మార్క్‌ జుకర్‌బర్గ్ త్వరలో భారత్‌కు రానున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడి వివాహ ముందుస్తు వేడుకలకు హాజరుకానున్నారు. 

Published : 26 Feb 2024 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌ (Facebook) మాతృ సంస్థ మెటా (Meta) అధిపతి మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ఆసియా పర్యటన చేపట్టారు. కుటుంబంతో కలిసి సోమవారం జపాన్‌ చేరుకున్న ఆయన.. అక్కడినుంచి దక్షిణకొరియా వెళ్లి ఆ తర్వాత భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గోనున్నారు. యాపిల్‌తో పోటీ పడేందుకు ఓ డీల్‌ కుదుర్చుకోనున్నారు. ఇక, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తనయుడి ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు ఆయన హాజరుకానున్నారు.

కత్తుల తయారీని నేర్చుకుని..

ప్రస్తుతం జపాన్‌లో ఉన్న జుకర్‌.. అక్కడ సంప్రదాయ కటానా (కత్తులు) ఎలా తయారుచేస్తారో నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. స్వయంగా కొలిమిలోని ఇనుమును సుత్తితో కొట్టి కత్తిని తయారుచేశారు. ఈ పర్యటనలో భాగంగా టోక్యోలోని ఫేస్‌బుక్‌ డెవలపర్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.

అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలకు విలాస టెంట్‌లు

యాపిల్‌తో పోటీ పడేందుకు..

అక్కడినుంచి జుకర్‌బర్గ్‌ దక్షిణాఫ్రికా చేరుకోనున్నారు. ఆ దేశాధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌తో సమావేశం కానున్నారు. ఏఐ చిప్స్‌ ప్రధాన అజెండాగా శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎస్‌ హినిక్స్‌ ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక, యాపిల్‌ విజన్‌ ప్రోతో పోటీ పడేందుకు మిక్స్‌డ్‌ రియాల్టీ హెడ్‌సెట్‌ను మెటా తీసుకురానున్న విషయం తెలిసిందే. దీని అభివృద్ధికి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ సీఈవోతో జుకర్‌ చర్చించనున్నట్లు కొరియన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

అంబానీ ఇంట వేడుకకు..

మార్చి 1-3 తేదీల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికగా జరిగే అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ముందస్తు వివాహ వేడుకలకు హాజరయ్యే ప్రపంచ ప్రఖ్యాత అతిథుల్లో జుకర్‌ కూడా ఉన్నారు. రిలయన్స్‌కు చెందిన డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో మెటా బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని