Business news: డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.1,188 కోట్లు

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రికార్డు స్థాయిలో రూ.1,188 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Updated : 29 Jul 2022 03:56 IST

అనూహ్యంగా పెరిగిన ఇతర ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రికార్డు స్థాయిలో రూ.1,188 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాల లాభం రూ.570 కోట్లతో పోల్చితే, ఇది 108 శాతం అధికం. ఇదే సమయంలో  ఆదాయం కూడా రూ.4,919 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.5,215 కోట్లకు పెరిగింది. సమీక్షా  త్రైమాసికంలో ఇతర ఆదాయం అధికంగా నమోదు కావడం గమనార్హం. ఇండీవియర్‌ ఇంక్‌, ఇండీవియర్‌ యూకే, అక్వెస్టివ్‌ థెరప్యూటిక్స్‌ ఇంక్‌., అనే సంస్థలతో జనరిక్‌ బుప్రెనోర్ఫైన్‌, నలోగ్జోన్‌ సబ్‌లింగువల్‌ ఫిల్మ్‌ అనే మందుకు సంబంధించిన వివాదాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ ఇటీవల పరిష్కరించుకుంది. మరికొన్ని సర్దుబాట్ల వల్ల లభించిన ప్రతిఫలంతో, కంపెనీకి ఇతర ఆదాయం అనూహ్యంగా  రూ.600 కోట్లు లభించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఇతర ఆదాయం రూ.50 కోట్లు మాత్రమే. దీనివల్ల ఈసారి నికరలాభం భారీగా పెరిగింది.

ఉత్తర అమెరికాకు కొత్త ఔషధాలు: జూన్‌ త్రైమాసికంలో కెనడా, ఉత్తర అమెరికా మార్కెట్లలో డాక్టర్‌ రెడ్డీస్‌, 6 కొత్త ఔషధాలు విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో అమెరికాలో మరో 25 కొత్త ఔషధాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. తాజా ఫలితాలపై కంపెనీ సహఛైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ స్పందిస్తూ, తమ ఔషధాల శ్రేణిని పెంచుకోవటం ద్వారా, వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించే యత్నాల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు.

దేశీయ మార్కెట్లో 26 శాతం వృద్ధి : జూన్‌ త్రైమాసికంలో ఉత్తర అమెరికాలో 2 శాతం, ఐరోపాలో 4 శాతం వృద్ధిని డాక్టర్‌ రెడ్డీస్‌ నమోదు చేసింది. రష్యాలో మాత్రం అమ్మకాలు  9 శాతం తగ్గాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్లో ఎంతో అధికంగా  26 శాతం వృద్ధి నమోదైంది. కొన్ని అప్రధాన ఔషధ బ్రాండ్లను విక్రయించడం, నొవార్టిస్‌ నుంచి కొన్ని ఉత్పత్తులు సొంతం చేసుకోవడం, కొత్త ఔషధాలు కొన్ని విడుదల చేయడం వల్ల దేశీయ మార్కెట్లో అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం వచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వివరించింది.  

బూస్టర్‌ డోసుగా స్పుత్నిక్‌ లైట్‌ టీకా:  మొదటి రెండు డోసులుగా ఏ టీకా తీసుకున్నా, బూస్టర్‌ డోసుగా స్పుత్నిక్‌ లైట్‌ టీకాను  ఇచ్చేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ ఎరెజ్‌ ఇజ్రాయెల్‌ తెలిపారు. దీనికి సంబంధించి దేశీయంగా తాము నిర్వహిస్తున్న క్లినికల్‌ పరీక్షలు తుది దశలో ఉన్నాయని అన్నారు. దీనికి భారతదేశంలో అనుమతి వచ్చిన తర్వాత, ఇతర దేశాల్లోకి విడుదల చేసే సన్నాహాలు చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు