చమురు-గ్యాస్‌ వెలికితీతకు ఎక్సాన్‌మొబిల్‌తో ఓఎన్‌జీసీ ఒప్పందం

ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ), అంతర్జాతీయ చమురు దిగ్గజం ఎక్సాన్‌ మొబిల్‌తో బుధవారం హెడ్స్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (హెచ్‌ఓఏ) కుదుర్చుకుంది. దీనికింద దేశీయంగా తూర్పు,

Published : 18 Aug 2022 05:22 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ), అంతర్జాతీయ చమురు దిగ్గజం ఎక్సాన్‌ మొబిల్‌తో బుధవారం హెడ్స్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (హెచ్‌ఓఏ) కుదుర్చుకుంది. దీనికింద దేశీయంగా తూర్పు, పశ్చిమ తీరంలోని లోతైన సముద్ర క్షేత్రాల్లో చమురు-గ్యాస్‌ వెలికితీతకు ఎక్సాన్‌మొబిల్‌ సహకారం అందించనుంది. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి, కావేరి బేసిన్‌లతో పాటు పశ్చిమ తీరంలోని కచ్‌-ముంబయి రీజియన్‌లపై రెండు సంస్థలూ ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఓఎన్‌జీసీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓఎన్‌జీసీకి చెందిన చమురు-గ్యాస్‌ క్షేత్రాల్లో ఎక్కడైనా ఎక్సాన్‌మొబిల్‌ వాటాలు తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. దేశీయ చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌.. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు సాంకేతిక, ఆర్థిక మద్దతు కోసం అంతర్జాతీయ చమురు దిగ్గజాలతో కలిసి పని చేయడంలో భాగంగా, ఈ ముందడుగు వేసింది. 2019లో ఈ రెండు సంస్థలు సంయుక్త అధ్యయనం కోసం అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకున్నాయి కూడా. తాజాగా కుదర్చుకున్న హెచ్‌ఓఏతో ఎక్సాన్‌తో దీర్ఘకాల భాగస్వామ్యం కొనసాగిస్తామని ఓఎన్‌జీసీ ఎక్స్‌ప్లోరేషన్‌ హెడ్‌ రాజేశ్‌ కుమార్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. ‘ఓఎన్‌జీసీతో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది. సరైన సంస్థలు సహకరించుకున్నప్పుడే గొప్ప ఆవిష్కరణలు జరుగుతాయ’ని ఎక్సాన్‌మొబిల్‌ ఇండియా సీఈఓ, లీడ్‌ కంట్రీ మేనేజర్‌ మోంటే కె.డోబ్సన్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఎక్సాన్‌ మొబిల్‌లోని 25 శాతం మంది భారత్‌లోని లోతైన సముద్ర క్షేత్రాల్లో నిల్వల్ని గుర్తించడంపై పని చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని