అదానీ షేర్లపై అదనపు నిఘా కొత్త కాదు

అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువల పతనంపై పార్లమెంటులోనూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మదుపర్ల సంపద పరిరక్షించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated : 08 Feb 2023 07:27 IST

2019 నుంచి పలుసార్లు ఏఎస్‌ఎం పరిధిలోకి
షేరు విలువ అసాధారణంగా పడినా, పెరిగినా
ప్రమోటర్లు షేర్లను అధికంగా తనఖా పెట్టినా

దిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువల పతనంపై పార్లమెంటులోనూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మదుపర్ల సంపద పరిరక్షించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అదానీ గ్రూపులోని కొన్ని కంపెనీల షేర్లను అదనపు నియంత్రణ నిఘా పరిధిలోకి (ఏఎస్‌ఎం) తీసుకొచ్చాయి. షేరు విలువలు అకస్మాత్తుగా క్షీణించినప్పుడే కాదు.. అసాధారణ రీతిలో పెరుగుతున్నప్పుడు, ప్రమోటర్లు తమ షేర్లను అధిక సంఖ్యలో తనఖా పెట్టినప్పుడు కూడా వాటికి ఏఎస్‌ఎం ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఈ పరిస్థితుల్లో 2019 నుంచి పలు సందర్భాల్లో అదానీ గ్రూపునకు చెందిన 7 కంపెనీల షేర్లు ఆంక్షలను ఎదుర్కొన్నాయి. 2023 ఫిబ్రవరి 3 నాటికి ఈ గ్రూపునకు చెందిన 5 నమోదిత సంస్థలు ఏఎస్‌ఎం పరిధిలో ఉన్నాయి. ఇవేకాదు ఎన్‌ఎస్‌ఈలోని 2,113 షేర్లలో.. 117 స్క్రిప్‌లు, బీఎస్‌ఈలోని 4,378 స్క్రిప్‌లలో 288 ఇలాంటి ఆంక్షల పరిధిలో ఉన్నాయి.


ఈ ప్రమాణాల ప్రకారం

2018 నుంచి ఏఎస్‌ఎం విధానాన్ని సెబీ అమల్లోకి తెచ్చిందని ఇండోర్‌లోని స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నిరంజన్‌ శాస్త్రి చెబుతున్నారు. షేరు ధరల్లో తేడా, క్లయింట్‌ కాన్సెంట్రేషన్‌, మార్కెట్‌ విలువ, లావాదేవీల సంఖ్యలో వ్యత్యాసం, డెలివరీ శాతం లాంటివి ఒక షేరు ఏఎస్‌ఎం పరిధిలోకి వెళ్లేందుకు కీలక ప్రమాణాలుగా చూస్తారు.

* ఏఎస్‌ఎం పరిధిలోకి వెళ్లిన షేరులో ట్రేడింగ్‌ చేయాలంటే.. ముందస్తుగా 100 శాతం మార్జిన్‌ అవసరం అవుతుంది. షేరు కదలాడే ధరల శ్రేణి కుదింపు, నికర పద్ధతిలో కాకుండా స్థూల పద్ధతిలో సెటిల్‌మెంట్‌ లాంటి ఆంక్షలు అమలవుతాయి.

* క్యాష్‌ విభాగంలో ఉన్న షేర్లకు దీర్ఘకాలం పాటు, ఎఫ్‌అండ్‌ఓ విభాగ షేర్లకు స్వల్పకాలం ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ముప్పుపై మదుపర్లకు సంకేతం..: ఇందువల్ల.. ఫలానా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడితే ముప్పు అనే సంకేతం మదుపర్లకు చేరుతుంది. 100% మార్జిన్‌ అవసరం కనుక, ఆ షేర్లలో ట్రేడింగ్‌ తగ్గుతుంది. దీని ద్వారా షార్ట్‌ సెల్లింగ్‌ను నియంత్రించొచ్చు. ఏఎస్‌ఎం పరిధిలోని షేర్లను తనఖా పెట్టడం.. వాటిపై రుణాలు తీసుకోవడం కుదరదు.

ఎప్పుడెప్పుడు.. ఎన్ని రోజులు

* అదానీ గ్రూపులో ఐదు షేర్లు క్యాష్‌ విభాగంలో, రెండు షేర్లు డెరివేటివ్స్‌, క్యాష్‌ విభాగంలో ఉన్నాయి. అంబుజా, ఏసీసీ ఇటీవలే అదానీ గ్రూప్‌ ఆధీనంలోకి వచ్చినందున, ఈ గణాంకాలకు పరిగణనలోకి తీసుకోలేదు.

* క్యాష్‌ విభాగంలోని అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు తొలిసారి ఏఎస్‌ఎం పరిధిలోకి వచ్చిన రోజు నుంచి మొత్తంగా 1,208 రోజుల్లో 43% లేదా 520 రోజుల పాటు ఏఎస్‌ఎం ఆంక్షలను ఎదుర్కొంది. ఈ 520 రోజుల్లో షేరు ధర అసాధారణ పెరుగుదల వల్ల 475 రోజుల పాటు కఠిన నిఘా చర్యలను ఎదుర్కొంది. ముందస్తుగా 100 శాతం మార్జిన్‌ చెల్లించడం, ధరల శ్రేణి కుదింపు, ట్రేడ్‌- ఫర్‌ ట్రేడ్‌ సెటిల్‌మెంట్‌ లాంటివి ఈ చర్యల్లో భాగంగా ఉంటాయి.

* అదానీ పవర్‌ షేరు మొదటిసారిగా ఏఎస్‌ఎం పరిధిలోకి వచ్చిన రోజు నుంచి మొత్తంగా 780 రోజుల్లో 511 రోజుల పాటు ఏఎస్‌ఎం చర్యలు ఎదుర్కొంది. ఇందులో కఠిన నిఘా చర్యలు అమలైన రోజుల సంఖ్య 267.

* అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేరు 1,618 రోజుల్లో 508 రోజుల పాటు ఏఎస్‌ఎం నిఘాలో ఉంది. 166 రోజుల పాటు కఠిన ఆంక్షలను ఎదుర్కొంది.

* అదానీ టోటల్‌ గ్యాస్‌ షేరు 774 రోజుల్లో 493 రోజుల పాటు ఏఎస్‌ఎం ఆంక్షల పరిధిలో ఉంది. 132 రోజుల పాటు కఠిన నిఘా ఆంక్షలు అమలయ్యాయి.

* అదానీ విల్మర్‌ షేరు గతేడాది ఫిబ్రవరి 8న స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైంది. ఈ షేరు తొలిసారి ఏఎస్‌ఎం పరిధిలోకి వచ్చిన రోజు నుంచి మొత్తంగా 281 రోజుల్లో 151 రోజుల (54%) పాటు ఏఎస్‌ఎం నిఘాలో ఉంది. కఠిన నిఘా చర్యలనూ ఎదుర్కొంది.

* ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో ఉన్న అదానీ గ్రూపునకు చెందిన రెండు కంపెనీల (అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌) షేర్లకు దీర్ఘకాల ఏఎస్‌ఎం నిఘా చర్యలు వర్తించవు. అయితే ప్రమోటర్లు షేర్లు అధికంగా తనఖాలో ఉన్నందున, వీటిపై గత ఏడాది కాలంలో స్వల్పకాలిక ఏఎస్‌ఎం చర్యలను చేపట్టారు.


‘అదానీ’ రుణాలతో బ్యాంకులకు ముప్పు తక్కువే: ఫిచ్‌, మూడీస్‌

అదానీ గ్రూపు కంపెనీలకు ఇచ్చిన రుణాల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యతపై ప్రభావం పడకపోవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ఫిచ్‌, మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడుతున్నాయి. రుణ ఆస్తుల నాణ్యతకు ముప్పు వాటిల్లకుండా నియంత్రించుకునే స్థాయిలోనే, అదానీ గ్రూపునకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు ఉన్నాయని భావిస్తున్నట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులే అదానీ కంపెనీలకు అధిక రుణాలిచ్చాయి. చాలా బ్యాంకుల మొత్తం రుణాల్లో ఈ రుణాల వాటా 1 శాతం కంటే తక్కువగానే ఉందని మూడీస్‌ గుర్తు చేసింది. అయితే బ్యాంకుల రుణాలపై అదానీ అధికంగా ఆధారపడితే మాత్రం బ్యాంకులకు ముప్పు పెరిగే అవకాశం ఉంటుందని వివరించింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అదానీ గ్రూపునకు రుణాల లభ్యత తగ్గిపోవచ్చని వివరించింది. ప్రస్తుతానికి భారతీయ బ్యాంకుల కార్పొరేట్‌ రుణాల నాణ్యత స్థిరంగానే ఉందని మూడీస్‌ తెలిపింది. అదానీ గ్రూపు పరిణామాలు.. మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రభావం చూపించొచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. దేశీయ మౌలిక నిర్మాణ రంగంలో అదానీ గ్రూపు కీలక పాత్ర పోషిస్తుండటమే ఇందుకు కారణంగా విశ్లేషించింది.


అదానీ సంస్థల్లో పెట్టుబడుల వల్ల ఎల్‌ఐసీకి లాభమే

రాజ్యసభలో కేంద్ర మంత్రి

ఈనాడు, దిల్లీ: అదానీ సంస్థల్లో పెట్టుబడులవల్ల ఎల్‌ఐసీకి లాభమే జరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. ఎల్‌ఐసీ ఆ సంస్థల్లో రూ.30,127 కోట్ల పెట్టుబడి పెట్టగా, వాటి మార్కెట్‌ విలువ రూ.56,142 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు సుశీల్‌కుమార్‌ మోదీ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘అదానీ గ్రూప్‌ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల గురించి ఎల్‌ఐసీ జనవరి 30న పత్రికా ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం 2022 డిసెంబరు 31 నాటికి అదానీ గ్రూప్‌ సంస్థల్లో ఎల్‌ఐసీ రుణాలు, వాటాల కింద రూ.35,917.31 కోట్ల పెట్టుబడి పెట్టింది. అదానీ గ్రూప్‌ కంపెనీలో ఎల్‌ఐసీ కొన్నేళ్లుగా కొనుగోలుచేస్తూ వచ్చిన వాటాల కోసం రూ.30,127 కోట్ల పెట్టుబడి పెట్టింది. గత జనవరి 27 నాటికి వాటి మార్కెట్‌ విలువ రూ.56,142 కోట్లకు చేరింది. 2022 సెప్టెంబరు 30 నాటికి ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలువ రూ.41.66 లక్షల కోట్లు. దాని ప్రకారం చూస్తే అదానీ సంస్థల్లో పెట్టిన పెట్టుబడి విలువ 0.975% మాత్రమే. ఈ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఇప్పటికే ప్రజాబాహుళ్యంలో ఉన్నట్లు ఎల్‌ఐసీ చెప్పింది. అన్ని పెట్టుబడులనూ 1938 ఇన్సూరెన్స్‌ యాక్ట్‌, ఐఆర్‌డీఏఐ ఇన్వెస్ట్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌-2016కి లోబడే పెడుతున్నట్లు ఎల్‌ఐసీ చెప్పింది’ అని కేంద్రమంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని