Adani Group debt: అదానీ అప్పులు.. ఏడాదిలో 21% పైకి

Adani Group debt: అదానీ గ్రూప్‌ అప్పులు గత ఏడాది కాలంలో 21% పెరిగాయి. మార్చి చివరకు అదానీ తీసుకున్న రుణాల్లో అంతర్జాతీయ బ్యాంకుల వాటా 29 శాతంగా ఉంది. ఏడేళ్ల కిందట ఈ విభాగం నుంచి నిధులు సమీకరించిందే లేదు.

Updated : 19 Apr 2023 11:04 IST

మార్చి 31కి రూ.2.3 లక్షల కోట్లు
అంతర్జాతీయ బ్యాంకుల నుంచి మూడో వంతు రుణాలు

దానీ గ్రూప్‌ అప్పులు గత ఏడాది కాలంలో 21% పెరిగాయి. మార్చి చివరకు అదానీ తీసుకున్న రుణాల్లో అంతర్జాతీయ బ్యాంకుల వాటా 29 శాతంగా ఉంది. ఏడేళ్ల కిందట ఈ విభాగం నుంచి నిధులు సమీకరించిందే లేదు. మార్చి 31 నాటికి అదానీ గ్రూప్‌ (Adani Group)లోని 7 నమోదిత కంపెనీల రుణాలు ఏడాది క్రితంతో పోలిస్తే 20.7% పెరిగి రూ.2.3 లక్షల కోట్లకు చేరినట్లు ఈ అంశాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. మొత్తం అప్పుల్లో బాండ్ల ద్వారా సమీకరించిన రుణాలు 2016లో 14 శాతం కాగా.. 2023 మార్చి చివరకు 39 శాతానికి చేరాయి. దేశీయ బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలూ తక్కువగా ఏమీ లేవు. ఎస్‌బీఐకి రూ.27,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఫిబ్రవరిలో గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీయే వెల్లడించారు. భారీ విస్తరణ ప్రణాళికల కారణంగా 2019 నుంచీ రుణాలు స్థిరంగా పెరుగుతూ వచ్చాయి.

పెరుగుతున్న చెల్లింపు సామర్థ్యం: భారత్‌లోని గుజరాత్‌లో ప్రారంభమైన అదానీ గ్రూప్‌ (Adani Group).. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌తో వ్యాపార సంబంధాలు నెరపడం చూస్తుంటే.. ఎంత బాగా అంతర్జాతీయంగా అనుసంధానం అవుతోందన్నది అర్థమవుతోందని ఆ వార్తా సంస్థ పేర్కొంది. అయితే అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక అనంతరం, అదానీకిచ్చే రుణాల విషయంలో సంస్థల పరిశీలనలు కఠినమయ్యాయి. ఈ నివేదిక వెలుగు చూశాక, కుదేలైన అదానీ గ్రూప్‌ (Adani Group)షేర్లు, డాలరు బాండ్లు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అంటే రాబోయే కాలంలో అదానీ గ్రూప్‌ మరింత ఎక్కువమొత్తం డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు. అయితే రుణ నిష్పత్తి మెరుగుపడుతున్నందున చెల్లించే సామర్థ్యమూ పెరిగిందని ఆ వార్తా సంస్థ అంటోంది.

మెరుగుదల ఇదీ..: కంపెనీ తన రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలిపే కీలక గణాంకాలు మెరుగయ్యాయి.  నికర రుణాలకు; రన్‌ రేట్‌ ఎబిటాకు మధ్య నిష్పత్తి 2013లో 7.6 శాతంగా ఉండగా.. 2022-23 కల్లా అది 3.2 శాతానికి పరిమితమయింది. రన్‌ రేట్‌ ఎబిటా అనేది కంపెనీ ఇటీవలి ఆర్థిక పనితీరును లెక్కిస్తుంది. అదానీ గ్రూప్‌ (Adani Group) తన రుణాలను మరింత తగ్గించుకోవాలని అనుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు