Reliance: రిలయన్స్‌ రిటైల్‌లోకి రూ.8,278 కోట్లు!

ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (క్యూఐఏ) తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ద్వారా రూ.8,278 కోట్ల పెట్టుబడులను రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో పెట్టనుంది.

Updated : 24 Aug 2023 05:29 IST

పెట్టుబడులు పెట్టనున్న ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ

దిల్లీ: ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (క్యూఐఏ) తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ద్వారా రూ.8,278 కోట్ల పెట్టుబడులను రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో పెట్టనుంది. ఈ విషయాన్ని రిలయన్స్‌ రిటైల్‌ మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) బుధవారం ప్రకటించింది. ఆర్‌ఆర్‌వీఎల్‌ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ.8.278 లక్షల కోట్లుగా పరిగణించి, ఖతార్‌ సంస్థ పెట్టుబడులు పెట్టిందని నియంత్రణ సంస్థలకు ఆర్‌ఐఎల్‌ సమాచారమిచ్చింది. ఈ లెక్కన క్యూఐఏ పెట్టుబడి ఆర్‌ఆర్‌వీఎల్‌లో 0.99 శాతానికి సమానం.
ఆర్‌ఆర్‌వీఎల్‌ తన అనుబంధ, అసోసియేట్‌ సంస్థల ద్వారా దేశంలోనే అతి పెద్ద రిటైల్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. 18,500 పైచిలుకు విక్రయశాలలతో, ఇంటిగ్రేటెడ్‌ ఓమ్నీ ఛానెల్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ‘ఆర్‌ఆర్‌వీఎల్‌లో పెట్టుబడిదారుగా క్యూఐఏని స్వాగతిస్తున్నాం. క్యూఐఏ అంతర్జాతీయ అనుభవం, విలువ సృష్టిలో బలమైన ట్రాక్‌ రికార్డు ఆర్‌ఆర్‌వీఎల్‌ను ప్రపంచ స్థాయి సంస్థగా అభివృద్ధి చేయడంలో సహకరిస్తాయని నమ్ముతున్నాం. భారతీయ ఆర్థిక వ్యవస్థపై విదేశీయులకు ఉన్న సానుకూల దృక్పథంతో పాటు రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపార నమూనా, వ్యూహం, అమలు సామర్థ్యాలను గమనించే క్యూఐఏ పెట్టుబడులు పెడుతోంద’ని ఆర్‌ఆర్‌వీఎల్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ వెల్లడించారు. ‘భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్‌ విపణిలో ఉన్న వినూత్న కంపెనీలకు మద్దతు ఇచ్చేందుకు క్యూఐఏ కట్టుబడి ఉంది. రిలయన్స్‌ రిటైల్‌కు ఉన్న బలమైన దూరదృష్టి, ఆకర్షణీయ వృద్ధి అవకాశాలు మమ్మల్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రేరేపించాయ’ని క్యూఐఏ సీఈఓ మన్సూర్‌ ఇబ్రహీం అల్‌-మహమూద్‌ తెలిపారు.

2020లో రూ.47,265 కోట్లు!: 2020లో ఆర్‌ఆర్‌వీఎల్‌ 6.4 బిలియన్‌ డాలర్ల (రూ.47,265 కోట్ల) పెట్టుబడుల్ని సమీకరించింది. అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌కు అప్పట్లో 10.09% వాటా విక్రయించి ఈ పెట్టుబడులు సేకరించింది. అప్పుడు ఆర్‌ఆర్‌వీఎల్‌ విలువను రూ.4.2 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఇప్పుడు అంతకు దాదాపు రెట్టింపయ్యింది. ఈ రంగంలో ఈ స్థాయిలో నిధులు రావడం అదే తొలిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని