Mera Bill Mera Adhikar: రశీదు అడగండి.. అప్‌లోడ్‌ చేయండి.. రూ.కోటి బహుమతి పొందండి

వినియోగదార్లు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘మేరా బిల్‌ మేరా అధికార్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు   ప్రభుత్వం వెల్లడించింది.

Updated : 25 Aug 2023 09:56 IST

నెలవారీ ప్రైజ్‌మనీలు కూడా
‘మేరా బిల్‌ మేరా అధికార్‌’ను ప్రారంభించనున్న ప్రభుత్వం

వినియోగదార్లలో రశీదు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేందుకే

దిల్లీ: వినియోగదార్లు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘మేరా బిల్‌ మేరా అధికార్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు   ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్‌ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్‌ ప్రాజెక్ట్‌) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్‌టీ రశీదులను ఎంపిక చేసి.. రూ.10,000 చొప్పున ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు ఆర్థిక శాక తెలిపింది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున అందజేయనున్నట్లు పేర్కొంది. బంపర్‌ బహుమతి కోసం త్రైమాసికానికి ఓసారి డ్రా తీస్తారు. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్‌ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్‌లోడ్‌ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. వినియోగదార్లలో రశీదు అడగాలనే సంస్కృతిని పెంచే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అస్సామ్‌, గుజరాత్‌, హరియాణా, కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, దాద్రా అండ్‌ నగర్‌ హవేలి, డామన్‌ అండ్‌ డయ్యూలో దీనిని ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది.

డ్రాకు అర్హత పొందాలంటే..

  • ముందు నెలలో ఇచ్చిన బీ2సీ రశీదులన్నింటినీ తదుపరి నెల 5వ తేదీ కల్లా అప్‌లోడ్‌ చేస్తేనే.. నెలవారీ డ్రాకి అర్హత లభిస్తుంది.
  • ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్‌లోడ్‌ చేసేందుకు వీలుంటుంది.
  • ఈ రశీదులను ‘మేరా బిల్‌ మేరా అధికార్‌’ మొబైల్‌ అప్లికేషన్‌లోను, ‘వెబ్‌.మెరాబిల్‌.జీఎస్‌టీ.గవ్‌.ఇన్‌’ అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200గా నిర్ణయించారు.
  • జీఎస్‌టీ నమోదిత సరఫరాదార్ల నుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు.
  • రశీదును అప్‌లోడ్‌ చేసే సమయంలో.. సరఫరాదారు జీఎస్‌టీ గుర్తింపు సంఖ్య, రశీదు సంఖ్య, రశీదు తేదీ, రశీదు విలువ, వినియోగదారు రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది.
  • డ్రాలో విజేతగా ఎంపికైన వాళ్లు.. ఎంపికైనట్లుగా సమాచారం వచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్‌/ వెబ్‌పోర్టల్‌ ద్వారా తమ పాన్‌, ఆధార్‌ కార్డ్‌, బ్యాంకు ఖాతా లాంటి అదనపు వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఉపయోగించి ఆ విజేతకు బహుమతి మొత్తాన్ని పంపిస్తామని ఆర్థిక శాఖ తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని