వినియోగదార్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా?

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీపై విమర్శలొస్తున్నాయి. ఆర్డర్‌ సమయంలో చిల్లర కొట్టేస్తోందంటూ పలువురు వినియోగదార్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు.

Updated : 23 Sep 2023 04:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీపై విమర్శలొస్తున్నాయి. ఆర్డర్‌ సమయంలో చిల్లర కొట్టేస్తోందంటూ పలువురు వినియోగదార్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. బిల్లు మొత్తం రౌండాఫ్‌ పేరిట దాదాపు రూ.3 వరకు అదనంగా వసూలు చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఈ ప్రచారంపై స్విగ్గీ స్పందించింది. సాంకేతిక లోపం కారణంగానే అలా చూపుతోందంటూ వివరణ ఇచ్చింది. స్విగ్గీ మోసం అంటూ ఎక్స్‌(అంతక్రితం ట్విటర్‌)లో ఓ వ్యక్తి పోస్ట్‌ పెట్టాడు. ఒకప్పుడు స్విగ్గీ రౌండాఫ్‌ పేరిట పైసల్లో తీసుకునేదని, ఇప్పుడు ఒకో బిల్లుపై రూ.3 చొప్పున అదనంగా వసూలు చేస్తోందని తన పోస్ట్‌లో తెలిపాడు. తాను ఆర్డర్‌ చేసిన ఆహారానికి వాస్తవంగా రూ.671.91 కాగా (626.57+35.24+2.00+28.00-52.99+33.09 = 671.91) తన వద్ద రౌండాఫ్‌ పేరిట 9 పైసలతో పాటు అదనంగా మరో రూ.3 స్విగ్గీ తీసుకుందని తెలిపాడు. కస్టమర్లకు ఎలాంటి సర్వీసూ ఇవ్వకుండానే ఏటా కోట్లాది రూపాయలు ఇలా స్విగ్గీ దోచుకుంటోందని ఆరోపించాడు.

ఇదే ట్వీట్‌పై క్యాపిటల్‌ మైండ్‌ సీఈఓ, వ్యవస్థాపకుడు దీపక్‌ సెనోయ్‌ సైతం స్పందించారు. తాను రూ.255.60 విలువైన ఫుడ్‌ ఆర్డర్‌ చేయగా.. తనకు రూ.259 స్విగ్గీ ఛార్జీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.5గా పేర్కొని డిస్కౌంట్‌ పేరిట మళ్లీ రూ.2గా చూపించి.. వాస్తవంలో మళ్లీ ఆ మూడు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారంటూ తన అనుభవాన్ని వివరించారు. బహుశా ఇది డిస్‌ప్లే ఎర్రర్‌ కావొచ్చనీ అభిప్రాయపడ్డారు. ఈ పోస్టులపై కొందరు తమకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై స్విగ్గీ స్పందించింది. ‘‘ఆర్డర్‌ హిస్టరీ పేజీలో కొందరికి డిస్కౌంట్‌ అమౌంట్‌ తక్కువగా చూపిస్తోంది. వాస్తవానికి కస్టమర్లు వాస్తవ మొత్తాన్నే చెల్లించారు. టెక్నికల్‌ బగ్‌ కారణంగా ఆర్డర్‌ హిస్టరీ పేజీలో మాత్రమే ఇలా చూపిస్తోంది. మా టెక్నికల్‌ టీమ్‌ ఈ బగ్‌ను సరిచేసింది. ఇకపై మీకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు’’ అని స్విగ్గీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని