మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్‌ మాల్స్‌!

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్‌ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్‌ మాల్స్‌ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది.

Published : 08 May 2024 03:47 IST

నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక
హైదరాబాద్‌ ఒక్కటే మినహాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్‌ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్‌ మాల్స్‌ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. ఒక మాల్‌లో 40 శాతానికి మించి స్థలం కనుక ఖాళీగా ఉంటే దానిని ఘోస్ట్‌ షాపింగ్‌ మాల్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటివి 2022లో 57 షాపింగ్‌ మాల్స్‌ ఉండగా, 2023లో వీటి సంఖ్య 64కు పెరిగిందని మంగళవారం విడుదల చేసిన ‘థింక్‌ ఇండియా థింక్‌ రిటైల్‌ 2024’ నివేదికలో తెలిపింది. ఈ 64 షాపింగ్‌ మాల్స్‌  విస్తీర్ణం దాదాపు 1.33 కోట్ల చదరపు అడుగులుగా ఉంటుందని అంచనా వేసింది. 2022లో ఇలాంటి 57 మాల్స్‌ విస్తీర్ణం 84 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఖాళీగా ఉన్న మాల్స్‌ వల్ల దాదాపు రూ.6,700 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని వెల్లడించింది.

దేశ రాజధాని దిల్లీ (ఎన్‌సీఆర్‌)లో 53 లక్షల చదరపు అడుగుల షాపింగ్‌ మాల్స్‌ స్థలం వృథాగా ఉంది. ముంబయిలో 21 లక్షలు, బెంగళూరులో 20 లక్షల చ.అడుగుల మేర షాపింగ్‌ మాల్స్‌ స్థలమూ ఖాళీగానే ఉంది. కోల్‌కతాలో ఖాళీగా ఉన్న మాల్స్‌ విస్తీర్ణం 237% పెరిగింది.

మన దగ్గర నిండుతున్నాయ్‌

హైదరాబాద్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడి మాల్స్‌లో గత ఏడాది ఖాళీగా ఉన్న స్థల విస్తీర్ణం 19% తగ్గి, 9 లక్షల చ.అడుగులకు పరిమితమైనట్లు నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది.

దిల్లీలోనే వృథాగా ఎక్కువ మాల్స్‌

64 ఘోస్ట్‌ మాల్స్‌లో 21 దిల్లీలోనే ఉన్నాయి. బెంగళూరులో 12, ముంబయిలో 10, కోల్‌కతాలో 6, హైదరాబాద్‌లో 4, అహ్మదాబాద్‌, చెన్నై, పుణేల్లో 3 చొప్పున ఉన్నాయి.

గ్రేడ్‌ ఎ మాల్స్‌కే గిరాకీ

ఆదాయాలు పెరగడం, యువ జనాభా, పట్టణీకరణ కారణంగా వినియోగం అధికమవుతోంది. వ్యవస్థీకృత రిటైల్‌ రంగానికి ఇది అనుకూలంగా మారిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బైజల్‌ పేర్కొన్నారు. అదే సమయంలో కొనుగోళ్ల కోసం యువత గ్రేడ్‌ ఎ మాల్స్‌వైపే చూస్తున్నారు. దీంతో గ్రేడ్‌ సి రిటైల్‌ కేంద్రాలు వెనుకబడిపోతున్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయా షాపింగ్‌ మాళ్లను తిరిగి కొత్తగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు విక్రయదారులేమో అలాంటి మాల్స్‌లో లీజు రద్దు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ప్రథమ శ్రేణి నగరాల్లో షాపింగ్‌ మాల్స్‌ సంఖ్య గతంతో పోలిస్తే తగ్గినట్లు నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. 8 నగరాల్లో కొత్తగా వచ్చిన వాటితో కలిపి షాపింగ్‌ మాల్స్‌ సంఖ్య 263గా ఉందని పేర్కొంది. ఆశించిన రీతిలో పనిచేయని షాపింగ్‌ సెంటర్లను కూల్చి, కొత్తగా నివాస, వాణిజ్య స్థలాలుగా అభివృద్ధి చేయడంలాంటివి చూస్తున్నట్లు తెలిపింది. కొన్ని షాపింగ్‌ మాళ్లు పూర్తిగా మూసివేయడం, వేలం వేయడంలాంటివీ జరుగుతున్నాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు